ఇమ్రాన్ ఖాన్ అధికారిక నివాసం అద్దెకు.. ఎన్నో కష్టాల్లో పాకిస్తాన్..!

0
1040

పాకిస్తాన్ ఆర్థికంగా ఎంతగా దిగజారిపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..! పెట్టుబడులు లేక, అప్పులు పుట్టక పాకిస్తాన్ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంది. ప్రపంచ దేశాలలో పాక్ అంటే తీవ్రవాద దేశం అనే పేరు ఉండడంతో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఎలా మెరుగుపడాలో తెలియక ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తల పట్టుకుంటూ ఉన్నాడు.

ఇక ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో ప్రధాన మంత్రి భవనాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ మీడియా సంస్థలు తెలిపాయి. ఈ భవనాన్ని యూనివర్సిటీ మరియు ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని గతంలో ప్రతిజ్ఞ చేసిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఫ్యాషన్, సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల కోసం దానిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ ఫెడరల్ క్యాబినెట్ కూడా ఖరారు చేసింది. దీనికి సంబంధించి, ఈ కార్యక్రమాల సమయంలో పిఎం హౌస్ అలంకరించడానికి రెండు కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆగష్టు 2019 లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి గృహాన్ని ఖాళీ చేసి, బని గాలాలోని తన ఖరీదైన నివాసానికి మారారు. అందుకే పిఎం హౌస్ ను అద్దెలకు ఇచ్చి అలాగైనా డబ్బులను ఆర్జించాలని భావిస్తూ ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఏమి చేస్తే పాకిస్తాన్ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుందోనంటూ ఆ దేశ ఆర్థికవేత్తలు తలలు పట్టుకుంటూ ఉన్నారు.

పిఎం హౌస్‌కు చెందిన గేదెలు, లగ్జరీ కార్లను వేలం వేయించిన ఇమ్రాన్ ఖాన్

సెప్టెంబర్ 2018 లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి నివాసంలో ఉంచిన గేదెలను వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. పశువుల అమ్మకం వలన 23.02 లక్షల పాకిస్తాన్ రూపాయలు వచ్చింది. పాక్ ఆర్థిక సంక్షోభం మధ్య ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలని ప్రతిజ్ఞ చేసిన ఇమ్రాన్ ఖాన్ పొదుపు చర్యలో ఇది ఒక భాగమని డాన్ మీడియా సంస్థ నివేదించింది. పాకిస్తాన్ ప్రధాని పిఎం హౌస్‌కు చెందిన 61 లగ్జరీ కార్లను కూడా వేలం వేశారు. ప్రభుత్వ నిధులకు 20 కోట్లను జోడించారు. ఒక నెల తరువాత అక్టోబర్‌లో PM హౌస్‌ని యూనివర్సిటీగా మార్చడానికి ఇమ్రాన్ ఖాన్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు.

సైనికుడి కుమార్తె వివాహ వేడుక కోసం పిఎం హౌస్ అద్దెకు:

ఆగష్టు 2019 లో బ్రిగేడియర్ వసీం ఇఫ్తీకార్ చీమా కుమార్తె అనం వసీమ్ వివాహ వేడుక కోసం పిఎం హౌస్‌ను అద్దెకు ఇచ్చారు. ఆ సమయంలో చీమా పాకిస్తాన్ ప్రధానికి సైనిక కార్యదర్శిగా ఉన్నారు. ఖాన్ పిఎం హౌస్‌ని వివాహ వేదికగా ఉపయోగించినందుకు సోషల్ మీడియా లో ప్రజలు విరుచుకుపడ్డారు. అప్పుడేమో యూనివర్సిటీగా చేస్తానని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ 3 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో యు- టర్న్ తీసుకున్నాడు. పిఎం హౌస్‌ను అద్దెకు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు నిధులను జోడించాలని నిర్ణయించుకున్నాడు. గవర్నర్ల బంగాళాలను కూడా ఇదే విధంగా ఆదాయం వచ్చేందుకు ప్రణాళికలను రూపొందించింది పాక్ ప్రభుత్వం. లాహోర్ లోని గవర్నర్ బంగళాను, కరాచీలోని బంగళాను మ్యూజియంలుగా , ముర్రే లోని బంగాళాను కూడా మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీగా మార్చే యోచనలో పాక్ ప్రభుత్వం ఉంది. తమ ప్రభుత్వం వద్ద నిధుల్లేవని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే చెప్పేశాడు. అందుకే నిధుల కోసం చైనా మీద ఆధారపడుతున్నామని కూడా ఒప్పేసుకున్నాడు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here