పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు వేసింది. PTI చైర్మన్ ఇకపై జాతీయ అసెంబ్లీలో సభ్యుడు కాదని తీర్పు చెప్పింది. తోషాఖానా అని కూడా పిలువబడే రాష్ట్ర రిపోజిటరీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెల్లడించడంలో విఫలమైనందుకు ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ పాలక సంకీర్ణ ప్రభుత్వ చట్టసభ సభ్యులు ఆగస్టులో ఇమ్రాన్‌పై కేసు వేశారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలడంతో అయిదేళ్ల నిషేధాన్ని విధించించి పాకిస్థాన్ ఎన్నికల సంఘం. ఆర్టికల్ 63(1)(p) ప్రకారం ఆ కేసులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఈసీ తెలిపింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ తన డిక్లరేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేల్చారు. అయిదేళ్ల నిషేధం పూర్తి అయ్యే వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 (1) (p) ప్రకారం పార్లమెంట్‌కు కానీ, అసెంబ్లీకి కానీ ఇమ్రాన్ పోటీ చేయరాదు. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సికందర్ సుల్తాన్ రాజా నేతృత్వంలోని నలుగురు సభ్యులు బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఏకగ్రీవంగా బెంచ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
తోషాఖానా శాఖను 1974లో ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు ఇచ్చే ఖరీదైన బహుమతుల్ని ఆ శాఖ తమ ఆధీనంలో ఉంచుకుంటుంది. ఎవరికి గిఫ్ట్స్ వచ్చినా ఆ విషయాన్ని కేబినెట్‌కు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇమ్రాన్‌కు వచ్చిన బహుమతులలో నాలుగు బహుమతుల్ని అమ్ముకున్నట్లు ఇమ్రాన్ కేసు విచారణ సందర్భంగా ఒప్పుకున్నారు. ఇమ్రాన్ అమ్మినవాటిలో రిస్ట్ వాచ్‌లు, ఖరీదైన పెన్, రింగ్‌తో పాటు రోలెక్స్ వాచీలు ఉన్నాయి. ఇక ఇమ్రాన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. ఇమ్రాన్‌ను ఎవరూ అనర్హుడిగా ప్రకటించలేరని, కేవలం ప్రజలు మాత్రమే ఆ తీర్పు ఇవ్వగలరని పీటీఐ విభాగం తెలిపింది.