కశ్మీర్ అంశం పై పాకిస్థాన్ నేతలు ఎప్పటికప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంటారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పీవోకేలోని తరార్ ఖాల్ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారా? లేదంటే పాకిస్థాన్‌లో కలిసిపోవాలనుకుంటున్నారా? అనేది అక్కడి ప్రజల ఇష్టమని అన్నారు. దీనిపై తాము ఎటువంటి బలవంత చర్యలను దిగబోమని అన్నారు. కశ్మీర్‌ను పాక్‌లో కలిపేయాలన్న ప్రయత్నాలు తామే చేయట్లేదని అన్నారు.
పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) నాయకుడు మరియం నవాజ్ జూలై 18 న పీవోకేలో జరిగిన ఎన్నికల సమావేశంలో ప్రసంగిస్తూ కశ్మీర్ స్థితిని మార్చడానికి.. దానిని ఒక ప్రావిన్స్‌గా మార్చడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ పాక్ విపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.”ఈ చర్చ (ప్రావిన్స్ గురించి) ఎక్కడ నుండి పుట్టుకొచ్చిందో నాకు తెలియదు” అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అలాంటి ఆలోచనను తోసిపుచ్చారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం కశ్మీరీలను వారి భవిష్యత్తును నిర్ణయించడానికి అనుమతించే రోజు వస్తుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఆ రోజున కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ లో చేరాలని నిర్ణయించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఐక్యరాజ్యసమితి ఆదేశించిన ప్రజాభిప్రాయ సేకరణ తరువాత, కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ లో నివసించడానికి లేదా స్వతంత్ర రాష్ట్రంగా మారే అవకాశం ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కశ్మీర్‌పై పాకిస్తాన్ ప్రకటించిన విధానం ప్రకారం, కశ్మీరీలను పాకిస్తాన్ లేదా భారతదేశాన్ని ఎన్నుకోవటానికి అనుమతించే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఐరాస తీర్మానం ప్రకారం సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు.
జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన సమస్యలు తమ అంతర్గత విషయమని, దేశం తన సొంత సమస్యలను పరిష్కరించగలదని భారత్ ఇప్పటికే పాకిస్థాన్ కు.. ఆ దేశ నాయకులకు తేల్చి చెప్పింది. అయినా కూడా ఎప్పటిలాగే పాక్ నాయకులు విషం చిమ్ముతూ ఉన్నారు. మరో వైపు కశ్మీరీలను తీవ్రవాదం వైపు మళ్లేలా పాక్ కుట్రలు పన్నుతూనే ఉంది.