More

  ఇక బాలీవుడ్, హాలీవుడ్ లపై పడ్డ ఇమ్రాన్ ఖాన్

  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలి కాలంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూ ఉన్న సంగతి తెలిసిందే..! కొద్దిరోజుల కిందట మహిళల వస్త్ర ధారణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. ఆ తర్వాత తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను ఏకంగా అమరుడంటూ వ్యాఖ్యలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహానికి గురయ్యారు. ఇక పాకిస్తాన్ లో బాలీవుడ్ సినిమాలకు ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. పాక్ సినీ అభిమానులకు పండగే..! అలాగే పాకిస్తాన్ చిత్ర పరిశ్రమ కూడా అంతో.. ఇంతో బాలీవుడ్ సినిమాలను చూసి నేర్చుకుంది.

  ఇకపోతే తాజాగా ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చిత్ర పరిశ్రమలో అసభ్యతకు కారణం బాలీవుడ్, హాలీవుడ్ అంటూ చెప్పుకొచ్చారు. వీటిని చూసి పాక్ చిత్ర పరిశ్రమ ప్రభావితమైందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాకిస్తాన్‌లో చిత్ర పరిశ్రమ పరిణామ క్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు.. పాకిస్తాన్ చిత్ర పరిశ్రమ ఒరిజినాలిటీని మిస్ అయ్యిందని అన్నారు. ఒరిజినల్ కంటెంట్‌కు కట్టుబడి ఉండమని పిఎం చిత్రనిర్మాతలను కోరారు. హాలీవుడ్, బాలీవుడ్‌లోని “అసభ్యత” వల్ల పాకిస్తాన్ చిత్ర పరిశ్రమ ప్రభావితమైందని అన్నారు. “నేను మా చిత్ర పరిశ్రమలో వాస్తవికతను కోరుకుంటున్నాను. అది కొత్త ఆలోచనా విధానాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని ఇమ్రాన్ ఖాన్ ఖాన్ అన్నారు. “హాలీవుడ్ నుండి అసభ్యత మొదలైంది, బాలీవుడ్‌కు వచ్చింది.. అక్కడి సంస్కృతి ఇక్కడకు కూడా వచ్చేసింది” అని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఈ రెండు సినీ ఇండస్ట్రీలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయని దుయ్యబట్టారు. వీటి వల్ల పాకిస్థాన్ లో కూడా అశ్లీలత పెరిగిపోతోందని అన్నారు. ఆలోచనలు సరికొత్త పంథాలో ఉన్నప్పటికీ… దానికి సహజత్వం ఉండాలని ఇమ్రాన్ అన్నారు. హాలీవుడ్ లో విపరీతమైన అశ్లీలత ఉందని, అది క్రమంగా బాలీవుడ్ కు పాకుతోందని.. ఆ రెండు సినీ రంగాలు పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు.

  ఇస్లామాబాద్‌లో జరిగిన నేషనల్ అమెచ్యూర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఎన్‌ఎఎస్‌ఎఫ్) బహుమతి పంపిణీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ పిటిఐ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ చిత్రనిర్మాతలో కొత్త విధానాలను అవలంబించాలని ఆయన చిత్రనిర్మాతలను కోరారు.

  వెంటాడుతున్న వివాదాలు:

  “ఆక్సియోస్ ఆన్ హెచ్‌బిఓ” కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ “ఒక మహిళ చాలా తక్కువ బట్టలు ధరిస్తే పురుషులపై ప్రభావం చూపుతుంది.” అని అన్నారు. ‘‘మహిళలు గుడ్డపీలికలు కట్టుకుంటే మగవారిపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఆ మగవారు రోబోలైతే తప్ప. ఇది మనకు ఉండాల్సిన ఇంగిత జ్ఞానం అంతే’’ అని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. పాకిస్థాన్ లో పెరిగిపోతున్న అఘాయిత్యాలను మహిళల వస్త్రధారణతో ప్రధాని ఇమ్రాన్ మరోసారి ముడిపెట్టడం చాలా దారుణం అని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అసహనం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెలలో ఇమ్రాన్ ఖాన్ లైవ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “పర్దా యొక్క అవసరం టెంప్టేషన్‌ను నివారించడమే. ప్రతి ఒక్కరికీ కోరికలను అదుపులో పెట్టుకునే సంకల్ప శక్తి లేదు.” అని చెప్పుకొచ్చారు. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులను నివారించడానికి తన ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.

  జూన్ లో పార్లమెంటులో ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. అమెరికా అబ్బొట్టాబాద్ లో ఆపరేషన్ నిర్వహించి ఒసామా బిన్ లాడెన్ ను చంపేసిందని, దాంతో ఆయన అమరవీరుడయ్యారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక తీవ్రవాదిని అమరవీరుడంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను అంతర్జాతీయంగా తప్పుబడుతూ ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడిగా ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడంపై పాక్ మంత్రి ఫవాద్ చౌదరి వివరణ ఇచ్చారు. పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి మాట్లాడుతూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరబాటున ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చారు. ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికీ ఓ ఉగ్రవాదిగానే భావిస్తుందని తెలిపారు.

  Related Stories