మహిళల వస్త్రధారణపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. మహిళలు పొట్టి బట్టలు ధరిస్తే అది మగవారిపై ప్రభావం చూపుతుందని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల వస్త్రధారణపై ఇమ్రాన్ ఖాన్ ఏకంగా అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారు ధరించే దుస్తుల వల్లే పాక్ లో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ ను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పాక్ లో లైంగిక వేధింపుల కేసుల పెరుగుదలకు.. మహిళల దుస్తులకు ముడిపడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.”ఆక్సియోస్ ఆన్ హెచ్‌బిఓ” కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ “ఒక మహిళ చాలా తక్కువ బట్టలు ధరిస్తే పురుషులపై ప్రభావం చూపుతుంది.” అని అన్నారు. ‘‘మహిళలు గుడ్డపీలికలు కట్టుకుంటే మగవారిపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఆ మగవారు రోబోలైతే తప్ప. ఇది మనకు ఉండాల్సిన ఇంగిత జ్ఞానం అంతే’’ అని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనూ ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి బాగా తిట్లు తిన్నారు.
ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆగ్రహానికి దారితీశాయి. ప్రతిపక్ష నాయకులు మరియు పాత్రికేయులు ఆయనను విమర్శించారు. పాకిస్థాన్ లో పెరిగిపోతున్న అఘాయిత్యాలను మహిళల వస్త్రధారణతో ప్రధాని ఇమ్రాన్ మరోసారి ముడిపెట్టడం చాలా దారుణం అని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అసహనం వ్యక్తం చేశారు. మరో వైపు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని ఇమ్రాన్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే అధికార ప్రతినిధి డాక్టర్ అర్ స్లాన్ ఖాలిద్ అన్నారు. ఆయన అన్నదానిని పూర్తిగా చెప్పకుండా కేవలం ఒక వాక్యాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో.. లైంగిక వాంఛలు ఏ స్థాయికి వెళ్లాయో ప్రధాని చెప్పారన్నారు.
పాకిస్తాన్‌లో లైంగిక హింస కేసులు పెరగడానికి మహిళలు అభ్యంతకరంగా బట్టలు వేసుకోవడమేనని ఏప్రిల్ నెలలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. లైవ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, “పర్దా యొక్క అవసరం టెంప్టేషన్‌ను నివారించడమే. ప్రతి ఒక్కరికీ కోరికలను అదుపులో పెట్టుకునే సంకల్ప శక్తి లేదు.” అని చెప్పుకొచ్చారు. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులను నివారించడానికి తన ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. అసలు అక్కడ అడిగిన ప్రశ్నలకు, ఆయన చెప్పిన సమాధానాలకు సంబంధం అన్నదే లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వినిపించాయి. ఏప్రిల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యల తరువాత క్షమాపణ చెప్పాలని వేల మంది డిమాండ్ చేశారు.
అత్యాచార నిందితులకు శిక్షలు తక్కువే:
ప్రతి 24 గంటలకు పాకిస్తాన్ లో కనీసం 11 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని పాకిస్తాన్ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. గత ఆరేళ్లలో 22,000 కేసులు పోలీసు స్టేషన్ లో నమోదయ్యాయి. కానీ దోషులకు శిక్ష మాత్రం పడడం లేదు. పాక్ లో అత్యాచార దోషుల శిక్షా రేటు 0.3 శాతం తక్కువగా ఉంది. మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి 2020 రేప్ వ్యతిరేక ఆర్డినెన్స్‌ను ఆమోదించారు. అటువంటి కేసులలో చట్టపరమైన చర్యలను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని చట్టం ఆదేశించింది. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇక మైనార్టీలుగా ఉన్న హిందూ యువతులపై అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి కేసులు రికార్డుల్లో కూడా లేకుండా పోయాయని పలువురు జర్నలిస్టులు గతంలో ఆరోపించారు.