Bharateeyam

విశ్వ’యోగం’..!

ఒంట్లో బాగోలేదంటే.. డాక్టర్..! మనసుకు బాగోలేదంటే.. డాక్టర్..!! శరీరంలో ఏమాత్రం తేడా వచ్చినా.. డాక్టర్.. డాక్టర్.. డాక్టర్..!!! ఇప్పుడంటే మెడిసిన్ చదివిన మహానుభావులున్నారు. మరి, వందల ఏళ్ల క్రితం ఎవరున్నారు..? మన దేశాన్ని.. దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడింది ఎవరు..? ఆ దివ్యశక్తి ఎక్కడిది..? వీటికి సమాధానమే యోగా. అవును, వేల ఏళ్ల క్రితం మన మహనీయులు అందించిన జీవన యోగ భాగ్యాలే.. ఇప్పటి సమాజానికి అమృత భాండాగారాలయ్యాయి.

రోగం వస్తే ఆసుపత్రికి పరుగులు పెడతాం. కానీ, శరీరానికి రోగమే రాకుండా కాపాడే దివ్య ఔషధమే యోగా. భవిష్యత్ లో ఆస్పత్రుల కంటే.. యోగా సెంటర్లకే ఎక్కువమంది వెళ్తారంటే అతిశయోక్తి కాదు. మందులేని కరోనా మహమ్మారితో నేడు ప్రపంచం మొత్తం ఎంతగా అతలాకుతమవుతున్నదో మనం చూస్తూనేవున్నాం. కరోనా అంతానికి రోగనిరోధశక్తి ఒక్కటే నివారణామార్గం. అలాంటి రోగ నిరోధకశక్తికి వెలకట్టలేని మూలధనం యోగా. యోగాభ్యాసం వల్ల రోగనిరోధకశక్తితో పరిపుష్టమైన శరీరాన్ని కరోనా ఏమీ చేయలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే, ఇప్పుడు ప్రపంచం మొత్తం యోగావైపే చూస్తోంది.

వేల సంవత్సరాల మన జీవన విధానం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఆదర్శమైంది.. ఆచరణీయమైంది.. అద్భుతాలు సృష్టిస్తోంది. భారతీయ సనాతన ధర్మం.. సంస్కృతిలో భాగమే యోగా. మన పూర్వీకులు, మహర్షులు, యోగ గురువులు అందించిన అద్భుతమైన సాధనం. యోగా. మన ప్రాచీన దివ్య ఆరోగ్య సూత్రం యోగా.

ప్రధాని మోదీ సంకల్పంతో నేడు యోగా విశ్వవ్యాప్తమైంది. యోగా డే సందర్భంగా..న్యూఢిల్లీ నుంచి న్యూజెర్సీ వరకు, చెన్నై నుంచి చికాగో వరకు.. యోగా సంబరాలు జరుగుతున్నాయి. మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి జూన్ 21ని వరల్డ్ యోగా డేగా ప్రకటించింది. 2015 నుంచి వరుసగా ఏడో ఏడాది ప్రపంచ దేశాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఇందులో ఇస్లామిక్ దేశాలు కూడా వున్నాయి. మోదీ కృషితో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం యోగాను గుర్తించింది. భారత ప్రభుత్వంతో కలిసి ఈ ఏడాది యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇదంతా మన దేశం, మన సంస్కృతి గొప్పదనమే. ఎన్నో దేశాలు.. ఎంతోమంది మేధావులు.. భారతీయ యోగా గొప్పదనాన్ని గుర్తించారు. యోగాతో కలిగే సత్ ప్రయోజనాలను కళ్లకు కట్టారు. అద్భుతాలు సృష్టించగల శక్తి యోగాకు వుంది. అందుకే.. రోజూ సాధనతో మనిషి మహోన్నత వ్యక్తిత్వాన్ని, అమోఘమైన శక్తిసామర్థ్యాలను పొందగలరని పరిశోధకులు సైతం తేటతెల్లం చేశారు.

చక్కటి ఆరోగ్యం, మంచి రోగనిరోధకశక్తి, బరువు అదుపులో ఉండటం, మది నిండా ఆహ్లాదం, ఆనందం.. రోజువారీ జీవితంలో మనిషికి ఇంతకన్నా ఏం కావాలి..? ఇలాంటివన్నీ ఒక్క యోగాభ్యాసంతోనే దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు. మన రోజువారీ జీవితంలో యోగా ద్వారా ఎన్నెన్నో ప్రయోజనాలు సొంతం అవుతాయని సూచిస్తున్నారు. శారీరక సామర్థ్యం కలిగి వుండటమే కాదు, మానసికంగా దృఢంగా, భావోద్వేగాల విషయంలో సమతుల్యతను సాధించినప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులతో కూడిన యోగా వీటన్నింటినీ సాధించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఒత్తిడి తగ్గటానికి దోహదం చేస్తాయి. అందువల్ల ప్రతి రోజూ కాసేపు యోగా చేసినా శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అధిక బరువును తగ్గించుకోవటానికీ యోగా ఉపయోగపడుతుంది. సూర్య నమస్కారాలు, కపాల భాతి ప్రాణాయామం వంటివి ఇందుకు తోడ్పడతాయి. యోగావల్ల మన శరీరానికి ఎప్పుడు, ఎలాంటి ఆహారం అవసరమనే దాన్ని గ్రహించే గుణం అలవడుతుంది. ఇది కూడా బరువు తగ్గేందుకు తోడ్పడేదే.

అందమైన ప్రదేశాలను చూడటం ద్వారా ఆనందాన్ని పొందటానికి మనం ఆసక్తి చూపుతుంటాం. కానీ ప్రశాంతత అనేది మన మనసులోనే ఉందన్న సంగతిని గుర్తించం. యోగా ద్వారా దీన్ని సొంతం చేసుకోవచ్చు. కల్లోలానికి గురైన మనసు తిరిగి ప్రశాంతంగా మారటానికి యోగా చక్కటి మార్గం. శరీరంలో ఏదైనా సమస్య బయలుదేరితే అది మనసుపైనా ప్రభావం చూపుతుంది. అలాగే మనసులోని అశాంతి, అసంతృప్తి వంటివీ శరీరాన్ని ప్రభావితం చేసి జబ్బుల రూపంలో బయటపడతాయి. యోగా ద్వారా ఈ రెంటినీ నివారించుకోవచ్చు. ఫలితంగా రోగనిరోధకశక్తి పెంపొంది జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

18 + nineteen =

Back to top button