అనుకున్నంత పనీ జరిగింది. మే 29న నేషనలిస్ట్ హబ్ చెప్పినట్టుగానే ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. యుద్ధానికీ, సంధికీ మధ్య వ్యవధి ఆ రెండు దేశాలకు కేవలం క్షణాలు మాత్రమే! కాకపోతే కొన్ని గంటలు, లేదా రోజులు.
మే21న ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం జూన్ 16 తెల్లవారు ఝామున పటాపంచలైంది. హమాస్ తమ దేశంపై అగ్నికీలలు రాజేసే ఊపిరి బుగ్గల్ని వదులుతోందని గుర్తించిన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ గాజా, ఖాన్ యూనస్ నగరాలపై శతఘ్నులతో విరుచుకుపడింది. ఇజ్రాయిల్ దాడులు జరిగిన మాట నిజమేనని పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్ అంగీకరించింది.
హమాస్ ప్రాంగణాల్లో తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయనీ, గాజా స్ట్రిప్ నుంచి కొనసాగుతున్న తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోడానికి, మళ్లీ యుద్ధం ప్రారంభించడంతోపాటు, అన్నిరకాల పరిస్థితులనూ ఎదుర్కోడానికి ఐడీఎఫ్ సిద్ధమంటూ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ విస్పష్టమైన ప్రకటన చేసింది.
ఇజ్రాయెల్‌లో ఇటీవల కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇజ్రాయెల్-హమాస్ మధ్య హింసాత్మక ఘర్షణలు జరగడం ఇదే తొలిసారి. ఇజ్రాయిల్ ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసిన బెంజిమిన్ నెతన్యాహు గద్దెదిగి, నఫ్తాలీ బెన్నెట్ అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది గంటలకే తాజా దాడులు చోటు చేసుకున్నాయి.
ఈ రెండు దేశాలమధ్య ఎందుకీ వైరం? ప్రస్తుత వివాదం ఎక్కడ మొదలైంది? వందేళ్లుగా రగులుతున్న ఆరని కార్చిచ్చు వెనుక ఉన్న చరిత్రేంటి? 1917-2017 యుద్ధ శతాబ్ది గడిచిపోయినా పరస్పరం సాయుధ ఉద్రిక్తతకు కారణం దేనికి? ఏ రాజకీయ పరిణామాలు ‘అల్ నక్బా’లో లక్షమంది పాలస్తీనియన్లు పారిపోవడానికి కారణమయ్యాయి? అమెరికా ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయమేంటి? ఇజ్రాయిల్ ఏర్పాటు పునాదులు చరిత్రేంటి?పారిభాషిక పదాల సృష్టి చారిత్రక వైషమ్యం కొనసాగింపునకు కారణమవుతుందా? బీరుట్ ప్రొఫెసర్ కాన్ స్టంటైన్ జూరిఖ్ చరిత్రకు చేసిన ద్రోహమేంటి? ఇజ్రాయిల్ ఆవిర్భావాన్ని ‘పాలస్తీనా’ విషాదంగా సూత్రీకరించడం భావ్యమేనా? అల్ నక్బాను సాకుగా చూపి ‘బ్లాక్ సెప్టెంబర్ లను సమర్థించగలమా? అరబ్బు జాతీయవాదమంటే యూదు జాత్యాహంకారమా?
ఇలాంటి చారిత్రక ప్రశ్నలకు అరబ్బు-యూదు యుద్ధ చరిత్రలో నుంచే జవాబులు వెతికే ప్రయత్నం చేస్తాను.
‘సంశయాత్మా వినశ్యతి’ అంటుంది భగవద్గీత. అంటే సంశయించినవాడు నశిస్తాడు అని అర్థం. కానీ, అరబ్బుల యుద్ధకాంక్ష నుంచి యూదులను నిరంతరం రక్షిస్తున్నది అనుమానం మాత్రమే! చిన్న శంక కలిగిందా అంతే! శతఘ్ని ప్రయోగించడమే! తప్ప ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ కు మరో మార్గం లేదు.
వివాదం ఎక్కడ మొదలైంది?
తూర్పు జెరూసలేంలో ఓ భాగమైన షేక్‌జరాలోని కొన్ని కుటుంబాలకు సంబంధించిన అద్దె చెల్లింపు వివాదం పెరిగి పెద్దదై ఇజ్రాయెల్-పాలస్తీనాలను కుదిపేస్తోంది. ఇరు దేశాల అంతర్గత రాజకీయాల్లోని ఆధిపత్యపోరు తోడు కావడంతో వివాదం ముదిరింది. అంతర్జాతీయ రాజకీయాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
కొత్త సైనిక కూటముల ఏర్పాటు ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. ఫలితంగా ఈ ఘర్షణ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. జోర్డాన్ 1948లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం తరవాత షేక్‌జరా ప్రాంతంలో కొన్ని పాలస్తీనా శరణార్థి కుటుంబాలకు ఐరాస సహకారంతో నివాస ప్రాంగణాలను నిర్మించింది. కానీ, 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొంది.
1876లో ఒట్టొమాన్ చక్రవర్తి పరిపాలన కాలంలోనే తాము షేక్‌జరాలో అరబ్‌ల నుంచి కొనుగోలు చేసిన స్థలాల్లో జోర్డాన్ పాలస్తీనా శరణార్థులకు ఇళ్లను నిర్మించిందంటూ కొందరు యూదులు నాటి పత్రాలతో న్యాయస్థానాలను ఆశ్రయించారు. దిగువ న్యాయస్థానాల్లో యూదులకు అనుకూలంగా తీర్పు రావడంతో పాలస్తీనీయులు అద్దె చెల్లించడమో లేదా ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కేసు ఆ దేశ సుప్రీంకోర్టుకు చేరింది. మే 10న తీర్పు వెలువడాల్సింది. అయితే, ఉద్రిక్తతల కారణంగా కోర్టు తీర్పును వాయిదా వేసింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న సాయుధ ఘర్షణ “యుద్ధానికి” దారితీయవచ్చని హెచ్చరికలు వెలువడుతున్నాయి. గత నెలన్నర రోజులుగా జెరూసలెంలో జరుగుతున్న గొడవలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. పాలస్తీనా-ఇజ్రాయిల్ పరస్పర హనన కాండకు శతాబ్దం చరిత్ర ఉంది.
ఇది వందేళ్ల రక్తసిక్త చరిత్ర. అనేక వక్రీకరణలకు-తప్పుడు వ్యాఖ్యానాలకు గురైన గతం. ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదం గురించి వైఖరి వెల్లడించని దేశం, అభిప్రాయం ప్రకటించని సంస్థ లేదు.
ప్రస్తుత ఇజ్రాయిల్ ను దేవుడు తమ పూర్వీకుడైన అబ్రహంకు, ఆయన వారసులకు ఇస్తానని వాగ్దానం చేసినట్లు యూదులు విశ్వసిస్తారు. అందుకే దీన్ని వాగ్దత్త భూమిగా పేర్కొంటారు. ఈ ప్రాంతంపై పూర్వం అసిరియన్లుగా చరిత్రకారులు పేర్కొన్న విధంగా ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియా గిరిజనులు-బాబిలోనియన్లు, పర్షియన్లు, మాసిడోనియన్లు, రోమన్లు దాడి చేశారు. రోమన్ పాలనలోనే ఈ ప్రాంతానికి పాలస్తీనా అనే పేరు వచ్చింది. క్రీస్తు శకంలో ఏడు దశాబ్దాల తరువాత ఈ ప్రాంతం నుంచి యూదు ప్రజలను బహిష్కరించారు. ఇస్లాం విస్తరించిన ఏడో శతాబ్దంలో పాలస్తీనా అరబ్బుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత యూరోపియన్ల ఆధీనమైంది.
1516లో పాలస్తీనా టర్కీ ఆధీనంలోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ ఆధీనంలో వెళ్లింది. 1947 సెప్టెంబర్ 3న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ పాలస్తీనాపై తన నివేదికను జనరల్ అసెంబ్లీకి సమర్పించింది. ఈ నివేదికలో పశ్చిమాసియాలో యూదుల ప్రత్యేక రాజ్యం స్థాపించడానికి మతపరమైన, చారిత్రక కారణాలను కమిటీ అంగీకరించింది.
1917లో ‘బాల్‌ఫోర్ డిక్లరేషన్’లో పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ డిక్లరేషన్‌లో పాలస్తీనాకు, యూదులకు ఉన్న చారిత్రక సంబంధాన్ని అంగీకరించారు. దీంతో, ఇక్కడ యూదుల ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు పునాది పడింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో, పశ్చిమాసియాలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్యం ఓటమి పాలైన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ అనుమతితో బ్రిటన్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అప్పటికి ఆ ప్రాంతంలో అరబ్బులు-యూదులు ఉండేవారు. నిష్పత్తిలో తేడాలు ఉండవచ్చు. పాలస్తీనాలో యూదులకు ‘ప్రత్యేక దేశం’ ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్‌కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.
1920 – 1940 మధ్య కాలంలో దేశదేశాల్లో తలదాచుకున్న యూదులు క్రమంగా తమ వాగ్దత్తభూమిలోకి అడుగుపెట్టనారంభించారు. ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో యూరప్ లో యూదులు లక్ష్యంగా హింస ప్రజ్వరిల్లింది. అలాంటి విపత్కర స్థితుల్లో యూదులకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ ఊపందుకుంది. మధ్యధరా సముద్రం, జోర్డాన్ నదికి మధ్య ఉన్న పాలస్తీనా ప్రాంతాన్ని యూదులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా పవిత్ర స్థలంగా భావిస్తారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ పాలకులు యూదులకు, అరబ్బులకు అనేక అబద్ధపు వాగ్దానాలు చేశారు. చాలా వాగ్దానాలను బ్రిటన్ నెరవేర్చలేకపోయింది. అంతే కాకుండా, పశ్చిమాసియాను ఫ్రాన్స్ తో ముందే పంచేసుకుంది. ఈ పరిణామాలే యూదులు, అరబ్బుల మధ్య సుదీర్ఘ ఉద్రక్తతకు, రక్తపాతానికి కారణమయ్యాయి.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూరప్ లో హిట్లర్ మారణకాండ నుంచి తప్పించుకున్న యూదులు వేల సంఖ్యలో పారిపోయి పాలస్తీనా చేరుకున్నారు. క్రమేపి యూదులు, అరబ్బుల మధ్య హింస పేట్రేగడం మొదలైంది.
1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలెంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి సిఫారసు చేసింది. నిజానికి ఐక్యరాజ్య సమితి జోక్యమే వివాదం ముదిరడానికీ, చరిత్ర నుంచి వర్తమానంలోకి ప్రవేశించడానికీ కారణమంటారు నిపుణులు. ఆరోజు జరిగిన అన్ని ఒప్పందాలకూ యూదులు అంగీకరించినా అరబ్బులు నిరాకరించారు.
1948లో బ్రిటిష్ పాలకులు వెళ్లిపోయిన తర్వాత ‘ఇజ్రాయిల్’ ఆవిర్భావం జరిగింది. ఈ నిర్ణయాన్ని పాలస్తీనియన్లు తిరస్కరించడంతో యుద్ధం అనివార్యమైంది. చుట్టుపక్కల అరబ్ దేశాలు-ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్ సైనిక దళాలు ఇజ్రాయిల్ పై దాడి చేశాయి.
ఈ దాడిని ఇజ్రాయిల్ తిప్పికొట్టింది. పరస్పర హననంలో వేలాది మంది మరణించారు. సాయుధ ఘర్షణల నేపథ్యంలో సుమారు లక్ష మంది పాలస్తీనియన్లు ఇతర దేశాలకు పారిపోయారు. దీన్నే అరబ్బు చరిత్రకారులు ‘అల్ నక్బా’గా పిలుస్తారు. అంటే ఘోరకలి అన్నమాట.
1948 దాడులను పాలస్తీనీయులు ఘోరకలిగా పేర్కొంటే ఇజ్రాయిల్ ‘స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణిస్తుంది. చరిత్రను ఎటువైపు నిలబడి చూస్తున్నామన్నదే ప్రధానం. ఉదాహరణకు మన దేశంలో జరిగిన 1857 స్వాతంత్ర్యోద్యమాన్ని బ్రిటీష్ పాలకులు ‘సిపాయి పితూరీ’ అంటూ కొట్టి పారేశారు. మన చరిత్రకారులు ‘ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అన్నారు.
అరబ్బు జాతీయవాదానికి యూదు వ్యతిరేకత జోడించడమే అసలు సమస్య. అరబ్బు జాతీయ చరిత్రకారుడు, బీరుట్ ప్రొఫెసర్ కాన్ స్టంటైన్ జూరిఖ్ 1948 పరిణామాలకు ‘అల్ నక్బా’ అంటూ నామకరణం చేశారు. అల్ నక్బా అంటే ‘విపత్తు అర్థం’ అనొచ్చు. అదే పేరుతో ఓ పుస్తకం రాశారు జూరిఖ్. ఈ పారిభాషిక పదాల సృష్టి జాతి విద్వేశానికి ఆజ్యం పోసింది.
మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల పరిణామాల నేపథ్యంలో నిరాశ్రయులై, హిట్లర్ దమనకాండలో వేలాదిగా ప్రాణాలు కోల్పోయిన యూదులు తమ వాగ్దత్త భూమిని ఎందుకు కోరుకోకూడదు? అరబ్బులు ఆ చిన్న ప్రాంతం విషయంలో ఎందుకు పట్టుదలకు వెళ్లి మారణహోమానికి దిగాలి? అనే ప్రశ్నలకు ఎక్కడా జవాబు లభించదు.
1948 యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయిల్ తన భూభాగాన్ని స్థిరం చేసుకుంది. వెస్ట్ బ్యాంక్ ను జోర్డాన్, గాజాను ఈజిప్ట్ ఆక్రమించుకున్నాయి. జెరూసలెంను రెండుగా విభజించి పశ్చిమ దిక్కున ఇజ్రాయిల్, తూర్పు వైపు జోర్డాన్ పంచుకున్నాయి.
1956లో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. సూయజ్ కాలువ విషయంలో వివాదం ఏర్పడింది. మరోసారి ఇజ్రాయెల్, ఈజిప్ట్ కయ్యానికి కాలుదువ్వాయి. అయితే, ఈ వివాదం యుద్ధం లేకుండా పరిష్కారమైంది.
1967లో ఆరు రోజులపాటు జరిగిన ‘జూన్ సంగ్రామం’లో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెం ఇజ్రాయిల్ స్వాధీనమయ్యాయి. గోలన్ హైట్స్, గాజా, ఈజిప్షియన్ సినాయ్ ద్వీపకల్పాన్ని కూడా వశపరుచుకుని విజయపతాకాన్ని ఎగరేసింది ఇజ్రాయిల్. ఈ తెగువ మాత్రమే తమ మనుగడకు కారణమంటారు ఇజ్రాయిలీలు. వెస్ట్ బ్యాంక్ ఇప్పటికీ ఇజ్రాయిల్ ఆధీనంలోనే ఉంది.
1973లో అరబ్ దేశాలకు, ఇజ్రాయిల్‌కు మధ్య ‘యోం-కిప్పుర్’ యుద్ధం జరిగింది. ఈజిప్ట్, సిరియా కలిసి ఇజ్రాయిల్‌పై దండెత్తి వచ్చాయి. ఈ యుద్ధంలో ఈజిప్ట్ సినాయ్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుంది. 1982లో ఇజ్రాయిల్ సినాయ్ ప్రాంతం నుంచి వైదొలగింది. కానీ, గాజా ప్రాంతపై పట్టు వదల్లేదు. ఆరేళ్ల తర్వాత ఈజిప్ట్, ఇజ్రాయిల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇజ్రాయిల్‌తో సమస్యలను పరిష్కరించుకున్న తొలి అరబ్బు దేశం ఈజిప్ట్. తర్వాత, జోర్డాన్ కూడా ఈజిప్ట్ బాటలో నడిచింది.
2005లో గాజా నుంచి ఇజ్రాయిల్ వైదొలిగినప్పటికీ, ఐక్యరాజ్యసమితి మాత్రం ఆ భూమిని ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగా పరిగణించడమే వైచిత్రి. జెరూసలెంను తమ రాజధానిగా ఇజ్రాయిల్ ప్రకటించుకుంది.
మరోవైపు పాలస్తీనియన్లు తూర్పు జెరూసలెంను భవిష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా పేర్కొంటున్నారు. గడచిన 50 ఏళ్లల్లో ఇజ్రాయిల్ ఈ ప్రాంతాల్లో అనేక నివాసాలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం 6,00,000 మందికి పైగా యూదులున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవన్నీ అక్రమంగా కట్టినవని, శాంతికి భంగం కలిగిస్తున్నాయంటారు పాలస్తీనియన్లు.
ఇజ్రాయిల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతుంది. ఇజ్రాయిల్ ఈపాటి తెగువ కనపరచకపోతే ఇజ్రాయిల్ మొత్తాన్ని అరబ్బు దేశాలు కబళించేవన్నది యూదు చరిత్రకారుల అంచనా. ఇప్పటికీ ఈజిప్ట్, ఇజ్రాయిల్ దేశాలు హమాస్ ను నిలువరించకపోతే యూదు రాజ్యమే రద్దయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఇజ్రాయిల్ చేస్తున్నది ప్రతిఘటన మాత్రమే అంటారు పరిశీలకులు.
1948లో జరిగిన అల్ నక్బాకు ప్రతీకారంగా పాలస్తీనియన్లు దశాబ్దాల తరబడి హింసకు పాల్పడుతూనే ఉన్నారు. బ్లాక్ సెప్టెంబర్ పేరుతో హమాస్ హంతక ముఠాలు ఇజ్రాయిల్ పౌరులను వెంటాడి హతమార్చాయి. చివరకు ఒలంపిక్స్ కు వెళ్లిన అథ్లెట్లను సైతం హత్య చేశాయి హమాస్ డెత్ స్వ్కాడ్లు.
అమెరికా ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయమేంటి?
తాజా ప్రతిపాదన ప్రకారం ఇజ్రాయిల్, పాలస్తీనా రెండు కూడా పూర్తి స్వతంత్ర, సార్వభౌమ దేశాలుగా మారాల్సి వుంటుంది. ఈ రెండు దేశాలకు జెరూసలేం ఉమ్మడి రాజధానిగా వుంటుంది. ఇదే ఏకైక, శాశ్వత శాంతి పరిష్కారమని బైడెన్ విశ్వసిస్తున్నారు.
అలాగే జెరూసలేంలో ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న అంతర్గత ఘర్షణలు తక్షణమే ముగిసేలా చర్యలు తీసుకోవాలని బైడెన్ ఇజ్రాయిల్ ను కోరారు. ఇజ్రాయిల్ భద్రతకు అమెరికా హామీ ఇచ్చింది. తాము సూచిస్తున్నట్లు రెండు సార్వభౌమ దేశాలుగా ఏర్పడినప్పటికీ.. భవిష్యత్తులోను ఇజ్రాయిల్ భద్రతకు అమెరికాదే బాధ్యత అన్నది వైట్ హౌస్. అరబ్బు దేశాలు ఇజ్రాయిల్ ఉనికిని గుర్తిస్తే.. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని అమెరికా భావిస్తోంది.
నిజానికి ఈ ప్రతిపాదన కొత్తదేమీ కాదు.. కానీ బైడెన్ తనదైన శైలిలో పాత ప్రతిపాదనకు ఓ మార్పు చేసి తెరమీదికి తెచ్చారు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి రెండు రాజ్యాల ప్రతిపాదనతో ముగింపు పలకవచ్చని అమెరికా విశ్వసిస్తోంది. ఈ ప్రతిపాదన గతంలోనే వచ్చిన ఇతరేతర కారణాల వల్ల మరుగున పడింది.
అప్పట్లో ట్రంప్ ఏకపక్షంగా ఇజ్రాయిల్‌కు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. ఈ వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. అప్పట్లో ట్రంప్ సలహాదారుగా వ్యవహరించిన జేర్డ్ కుష్నర్ రెండు దేశాల ప్రతిపాదనకు అంగీకరిస్తూ ఓ బిల్లును తయారు చేశారు. నాటి బిల్లులో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా పేర్కొంటూనే దాని భద్రతను ఇజ్రాయిల్ చేతిలో పెట్టేలా ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనను బెంజమిన్ నెతన్యాహూ స్వాగతించగా.. పాలస్తీనా నేతలు వ్యతిరేకించారు. తాజాగా బైడెన్ రెండు స్వతంత్ర దేశాలు, ఉమ్మడి రాజధానిగా జెరూసలేం అంటూ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
ఇంత ఘర్షణాయుత వాతావరణంలో ఏర్పడిన ఇజ్రాయిల్ తనను తాను అరబ్బు దేశాల నుంచి ఎలా రక్షించుకుంది? రక్షణలో ఆదేశ నిఘా సంస్థ ‘మొస్సాద్’ ఎలాంటి పాత్ర పోషించింది? అలాగే మొస్సాద్ కు సంబంధించిన అనేకానేక వీడియోలను గతంలో నేషనలిస్ట్ హబ్ రూపొందించింది. దానికి సంబంధించిన లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీరు వీక్షించవచ్చు.
అంతేకాకుండా మొస్సాద్ ఏజెంట్ సిల్వియా రాఫెల్ ను ఆలీ హసన్ సాలెమ్ నాయకత్వంలోని హమాస్ డెత్ స్వ్కాడ్స్ ఎలా వెంటాడాయి? బ్లాక్ సెప్టెంబర్ దాడుల్లో అరాఫత్ మానస పుత్రులు సాలెమ్ ఎన్ని దారుణ హత్యలకు పాల్పడ్డాడు? మైఖెల్ బార్ జోహర్-నిసిమ్ మిషల్ లు రాసిన ‘ నో మిషన్ ఇంపాజిబుల్’ పుస్తకంలో ఏముంది?