థర్డ్ వేవ్ ను ప్రజలు వాతావరణ అప్డేట్గా తేలికగా తీసుకుంటున్నారు: ఐఎంఏ

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భారత్ లో ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని, పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి కొవిడ్ మార్గదర్శకాలు పాటించడంలేదని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో, అంకితభావంతో పనిచేసే వైద్య సిబ్బంది, ఆధునిక వైద్య సదుపాయాల సాయంతో ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ ను దాటుకుని వస్తున్నామని ఐఎంఏ వివరించింది. వైరస్ మహమ్మారుల సంబంధించిన ప్రపంచవ్యాప్త చరిత్రను ఓసారి పరిశీలిస్తే థర్డ్ వేవ్ అనివార్యమన్నది స్పష్టమవుతుందని తెలిపింది. అత్యధిక సంఖ్యలో ప్రజలకు వ్యాక్సినేషన్ చేస్తున్నారని, అందువల్ల కరోనా థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఐఎంఏ అభిప్రాయపడింది. కరోనా థర్డ్ వేవ్ ప్రభావాన్ని ప్రపంచం చవిచూస్తోందని కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘిస్తే ఇప్పటి వరకూ వైరస్‌పై చేసిన పోరాటం నీరుకారుతుందని అప్రమత్తం చేసింది. థర్డ్ వేవ్ ప్రపంచాన్ని తాకిందని, భారత్‌లో దాని ప్రభావం లేకుండా మనం జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపింది.
వైరస్‌ను కట్టడి చేసేందుకు కొవిడ్-19 ప్రొటోకాల్స్‌ను విధిగా అనుసరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. థర్డ్ వేవ్ గురించి తాము మాట్లాడుతుంటే ప్రజలు దాన్ని వాతావరణ అప్డేట్గా తేలికగా తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జులైలో వెలుగుచూస్తున్న మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 73.4 శాతం కేసులు కేరళ, మహారాష్ట్ర , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక నుంచే నమోదవుతున్నాయని తెలిపారు. దేశంలో 55 జిల్లాల్లో ఇప్పటికీ పాజిటివిటీ రేటు పది శాతం పైగా ఉందని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొవిడ్-19 పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని తెలిపారు. అసోం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ సహా పది రాష్ట్రాలకు కేంద్ర బృందాలు వెళ్లాయని అక్కడ కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై స్ధానిక అధికారులతో వారు సంప్రదింపులు జరుపుతారని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న దృశ్యాలు బాధాకరమని, కొవిడ్ నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవని ఐఎంఏ పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వాలు, ప్రజలు కరోనా పట్ల తేలిక భావంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఇప్పట్లో పర్యాటక కార్యక్రమాలు, భక్తి యాత్రలు, మతపరమైన సమ్మేళనాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది.
కరోనా మార్గదర్శకాలు పాటించడం వల్ల కలిగే ఆర్థిక నష్టం ఏమంత పెద్దది కాదని ఐఎంఏ అభిప్రాయపడింది. మరికొన్ని నెలల పాటు ప్రజలు ఓపిక పట్టాలని, అప్పటివరకు కఠినమైన రీతిలో కరోనా మార్గదర్శకాలు అనుసరించాలని సూచించింది. కనీసం మూడు నెలల పాటు కచ్చితంగా ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఐఎంఏ వెల్లడించింది.