పశువులను మేపేందుకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలోని జీసస్ విగ్రహాన్ని కూల్చేసిన అధికారులు

0
766

కోలార్ జిల్లా ముల్బాగల్ పట్టణంలోని స్థానిక యంత్రాంగం గోకుంటె గ్రామంలో ఉన్న ఏసుక్రీస్తు అక్రమ విగ్రహాన్ని కూల్చివేసింది. నివేదికల ప్రకారం, ముల్బాగల్ తహశీల్దార్ శోభితా ఆర్ ఆదేశాల మేరకు తాలూకా అధికారులు 20 అడుగుల అక్రమ జీసస్ విగ్రహాన్ని కూల్చివేయించారు. పశువులను మేపేందుకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన విగ్రహాన్ని అధికారులు కూల్చివేశారు. సోమవారం వందలాది మంది పోలీసులతో అధికారులు గోకుంటెకు వచ్చారు. ఆక్రమిత భూమిలో నిర్మించిన ఏసుక్రీస్తు అక్రమ విగ్రహాన్ని తీసివేయడాన్ని కొందరు స్థానికులు వ్యతిరేకించినప్పటికీ తెల్లవారుజామున 3 గంటలకు కూల్చివేశారు. ఆ విగ్రహాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించిందని శోభిత తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని కూల్చివేశామని శోభిత తెలిపారు. పలు విచారణల తర్వాత కూల్చివేత జరిగిందని అధికారి తెలిపారు. కూల్చివేత ఉత్తర్వు మార్చి 2021లో జారీ చేయబడిందని అధికారి తెలిపారు.

విగ్రహం కూల్చివేత చట్టవిరుద్ధమని స్థానిక క్రైస్తవులు పేర్కొన్నారు. కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. స్థానిక మీడియాతో వారు మాట్లాడుతూ.. ఈ ఘటన సమాజ మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. స్థానిక పాలనా యంత్రాంగం తమకు ఎలాంటి ఆదేశాలివ్వలేదని ఆర్చ్ బిషప్ తెలిపారు. “విగ్రహాన్ని కూల్చివేయవలసిన పద్ధతి ఇది కాదు. దీన్ని తొలగించడానికి వేరే మార్గాలు ఉన్నాయి. విగ్రహాన్ని తొలగించమని వారు మమ్మల్ని కోరవచ్చు, మేము ఆ పని చేసి ఉండేవాళ్లం. మా వాళ్లను అక్కడికి వెళ్లనివ్వలేదు. వారిని 200 మీటర్ల దూరంలో ఉంచారు. ప్రభుత్వం చేస్తున్న ఈ అనుచిత పనులన్నీ మమ్మల్ని చాలా బాధిస్తున్నాయని” ఆయన చెప్పుకొచ్చారు. హైకోర్టు అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని గోకుంటె చర్చి తరపున వాదిస్తున్న న్యాయవాది సెల్వరాణి చెప్పారు.