More

    గర్ల్ ఫ్రెండ్ కోసం పీఎంనే భయపెట్టాడు..! నిజం తెలిసి షాక్ తిన్న పోలీసులు..!!

    ప్రధానమంత్రి కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ పంపి అడ్డంగా బుక్కయ్యాడో ఐఐటీ విద్యార్థి. బొంబే ఐఐటీకి చెందిన ఆ విద్యార్థి సాగించిన బెదిరింపు నిర్వాకాన్ని చూస్తే.. వెనకటి నాన్న పులి కథ గుర్తుకొస్తోంది. ఆకతాయి చేష్టలతో అబద్ధాలు ఆడితే నిజంగానే పులి వచ్చేసి తినేస్తుంది. ఇలాంటి నీతి కథలు ఎన్నో చదివి.. ఆ నీతి బోధనలు ఎందరికో వల్లెవేసే మేధావి కుర్రాళ్లు సైతం ఆ రాంగ్ రూట్లోనే వెళ్లడం తరచూ జరుగుతోంది. చీప్ ట్రిక్కులు ప్రదర్శించి చిక్కుల్లో పడిన ప్రబుద్దులు మనకు తరచు తారసపడుతూంటారు. ఇప్పుడు ఐఐటీ విద్యార్థి చేసిన నిర్వాకం అలాంటిదే.

    ఏదో మామూలు విషయాల్లో ఇలాంటి వెర్రిమొర్రి వేషాలు వేశారంటే.. పోనీ కుర్రాళ్లని ఊరుకోవచ్చు. ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికే బెదిరింపు ఈ మెయిల్ పంపించేసి ఘనకార్యం చేసినట్టు ఈ ప్రబుద్ధుడు ఫీలైపోయాడు. ఫలితంగా ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నాడు. ఉత్తర ప్రదేశ్ బదౌన్‌ ఆదర్శ్ నగర్ కు చెందిన ఐఐటీ విద్యార్థి అమన్ సక్సేనా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ పంపించాడు.

    గుజరాత్ జామ్ నగర్ పర్యటనలో ప్రధానికి ఓ వ్యక్తి ప్రాణహాని కల్గించనున్నాడని ఐఐటీ స్టూడెంట్ అమన్ సక్సేనా ఈ -మెయిల్ లో తెలిపాడు. దీంతో అప్రమత్తమైన హోం మంత్రిత్వ శాఖ గుజరాత్ ఎటీఎస్‌కు ఈ కేసు విచారణ అప్పగించింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఆ యువకుడిని నిలదీసి అసలు విషయాన్ని రాబట్టారు. తన గర్ల్ ఫ్రెండ్ కు ఎవరో బాయ్ ఫ్రెండ్ దగ్గరవుతున్నాడని, ఆ వ్యక్తిని కేసులో ఇరికించడానికే ఇలా చేశానని సక్సెనా తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం బదౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

    ఐటీ చట్టం కింద అనామక కమ్యూనికేషన్ పైన, బెదిరింపులు జారీ చేసినందుకు సక్సేనాపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో సక్సేనా మాత్రమే ఈ మెయిల్ పంపినట్టు తెలుస్తోందని, విచారణలో ఇంకెవరిదైనా ప్రమేయం వున్నట్టు తేలితే వారిపైనా విచారణ సాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

    Trending Stories

    Related Stories