2024 లో ఏం కానుంది..? కాంగ్రెస్ ను పీకే గట్టెక్కిస్తాడా..?

0
1227

ప్రతివ్యూహం పన్నాలనే ఉబలాటంలో ప్రత్యర్థి ఉచ్చుకు చిక్కడం రాజకీయాల్లో కద్దు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉందా? కమలం విసిరిన వలకు కాంగ్రెస్ చిక్కిందా అనే అనుమానం అంతటా వ్యక్తమవుతోంది. ప్రయాస భరించలేక పీకే శరణు జొచ్చింది. బరిలో నిలవలేక బాహటంగానే చేతులెత్తేసింది. బీజేపీ అపర చాణక్యుడు, హోం మంత్రి అమిత్ షా గీసిన ఆవృత్తంలోనే హస్తం పార్టీ గింగిర్లు కొడుతోంది. తాజాగా పీకేను దత్తత తీసుకునేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో రాజస్థాన్ లో జరగబోయే ఏఐసీసీ సమావేశంలో పీకే చేరికపై తుది నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వెలువడుతున్నాయి.

ఏప్రిల్ 16న టెన్ జన్ పథ్ లో జరిగిన ఆంతరంగీకుల సమావేశంలో ‘‘2024 సాధారణ ఎన్నికల’’ కోసం రూపొందించిన నిర్దిష్ట వ్యూహానికి సంబంధించి బ్లూప్రింట్ ను కూలంకషంగా వివరించినట్టూ కాంగ్రెస్ పెద్దలు పత్రికాముఖంగానే ప్రకటించారు. ఈ ఆంతర్గత సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ముకుల్ వాస్నిక్, మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకెన్ లు పాల్గొన్నారు. తలనెరిసిన నేతలంతా పెద్ద బాలశిక్ష నేర్చుకున్నచందంగా సాగిందట సదరు రహస్య సమావేశం.

రాబోయే సాధారణ ఎన్నికల్లో సుమారు 375 నుంచి 400 స్థానాలు సాధించే విధంగా పీకే వ్యూహాన్ని రూపొందించినట్టూ వార్తలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో వెనకాడకూడదనీ, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాలను పరిపుష్ఠం చేసేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని పీకే సూచించినట్టూ సమాచారం.

వ్యక్తిగతంగా తానేమీ ఆశించడం లేదనీ, అయితే తాను రూపొందించిన వ్యూహాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే స్వేచ్ఛ ఇవ్వాలని పీకే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినట్టూ కాంగ్రెస్ సీనియర్ నేత కే.సీ.వేణుగోపాల్ తెలిపారు. మొత్తంగా రాబోయే వారం రోజుల్లో పీకే చేరికపై ఏఐసీపీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అసలు పీకే రూపొందించిన ‘‘మిషన్ 2024’’లో ఏముంది? 375 నుంచి 4వందల స్థానాలు నిజంగానే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా? ఒక వేళ పీకే పూర్తిస్థాయిలో పార్టీలో పాగావేస్తే సీనియర్లు ఏం చేస్తారు? బీజేపీ వేసిన ఉచ్చులో కాంగ్రెస్ పడిందా? పీకే కాంగ్రెస్ లో చేరడం బీజేపీకి లాభంగా మారే అవకాశం ఉందా?

సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీకి ఏది మాట్లాడితే అవమానమో, ఎలా మాట్లాడితే గాంభీర్యమో తెలియకపోవడమే విషాదం. పిల్లకాకి-పీకేను నమ్మి ప్రచండ శక్తితో తలపడాలనుకోవడమే తారా స్థాయికి చేరిన అఙ్ఞానానికి తార్కాణం.

గెలిచే మూకలో చేరి విజయం తన ఖాతాలో వేసుకునే పీకే,  జేడీ(యూ)లో చేరి తన వైఫల్యాన్ని నిరూపించుకుని-తాను విఫల రాజకీయ నాయకుణ్నని బహిరంగంగానే ప్రకటించాక కూడా కాంగ్రెస్ పార్టీ పిల్లకాకిని నమ్ముకుంటోందంటే ఆ పార్టీ దుస్థితి ఏ స్థాయిలో ఉందో ఇంగితం ఉన్న వారికి సులభంగానే అర్థమవుతుంది.

టెన్ జన్ పథ్ సీక్రెట్ మీటింగ్ లో ‘‘2024 స్ట్రాటజీ’’ ప్రజెంటేషన్ ఆరంభంలోనే పీకే కాంగ్రెస్ పెద్దలకు ఓ ఆసక్తికరమైన సూచన  చేశారు. అదేంటంటే….“You cannot play politics just around the elections. If you want to survive in this politics, you have to speak the same language, operate within the same framework that the BJP works in”.

‘‘కేవలం ఎన్నికలే కేంద్రంగా రాజకీయ ప్రాంగణాన్ని పుక్కిటపట్టలేం. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే…ప్రత్యర్థి వాడే పరిభాషను గుర్తించి దాన్నే అస్త్రంగా సంధించాలి. బీజేపీ అనుసరిస్తున్న చట్రం గుట్టును పసిగట్టి అలాంటి చట్రాన్నే ఆశ్రయించాలి’’.

అంతే కాదు, యూపీ ఎన్నికల విషయంలో ఆసక్తికరమైన పరిశీలనలు చేశారు. అవేంటో చూద్దాం…

  1. The absence of a continuous Opposition narrative over the last five years helped the BJP. Structurally too, both the Congress and BSP are virtually non-existent. So UP suddenly became a two-party contest in which the SP appeared inadequate to take on the BJP.-యూపీలో ఐదేళ్ల కాలం పాటు ప్రతిపక్షాల నిర్లిప్తత కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం లుప్తం కావడమే బీజేపీకి అనుకూలించింది.  బీఎస్పీ-కాంగ్రెస్ లు దాదాపు ఉనికిలో లేకుండా పోయాయి. దీంతో యూపీ రాజకీయ మైదానం రెండు పార్టీలకు కేంద్రంగా మారింది. సమాజ్ వాదీ పార్టీ బీజేపీని సవాలు చేసే స్థితిలో లేకుండా పోయింది.
  2. low-intensity, low-volume campaign of five years- తక్కువ తీక్షణత, మంద్ర స్థాయి ప్రచారాన్ని బీజేపీ ఆశ్రయించింది.

కాంగ్రెస్ పెద్దలకు ప్రశాంత్ కిషోర్ చేసిన ఒక సూచన, రెండు పరిశీలనలు అతి ముఖ్యమైనవి.  పీకే తన బ్లూ ప్రింట్ లో సుహాస్ పాల్సికర్ లాంటి పొలిటికల్ సైంటిస్టుల పరిశీలనలను సైతం ఊటంకించినట్టూ సమాచారం. ఆసక్తికరమైన పరిశీలనలను పీకే తన వ్యూహంలో భాగం చేసి ఉండవచ్చంటారు రాజకీయ నిపుణులు.

డెబ్భయ్యో దశకంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎలాంటి వ్యూహాలను రూపొందించిందీ, మార్పుల అనివార్యతను గుర్తించిందో ఒక చోట ఉదహరించారు. అదేంటో చూద్దాం.. ‘‘in the 1970s when RSS chief BalasahebDeoras aligned the organisation with politics on the one hand and expanded its caste base on the other. Govindacharya and “social engineering” came much later but it was Deoras who started the internal transformation of the RSS outlook. Besides, the Jana Sangh merged with the Janata Party experiment in the 1970s and the Right became a part of the mainstream. The second shift came in the 1990s when BJP leaders Atal Bihari Vajpayee and Pramod Mahajan mooted the idea of a coalition to exercise power. So, this became an important aspect of the BJP’s politics with its leaders saying they would keep aside their core agenda and go along with concerns of coalition partners.

‘‘1970లో నాటి ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలాసాహెబ్ దేవ్ రస్ సంఘ్ ని రాజకీయాలతో సమన్వయం చేశారు. మరోవైపు సామాజిక వర్గాల ప్రాధాన్యతను గుర్తించి అటువైపు దృష్టిసారించారు. ఆ తర్వాత కాలంలో గోవిందాచార్య ‘‘సోషల్ ఇంజనీరింగ్’’ ప్రాధాన్యతను గుర్తించారు. ఆర్ఎస్ఎస్ దృక్కోణం అలా పరివర్తన పొందింది. ఆ తర్వాత కాలంలో జన్ సంఘ్ జనతా పార్టీలో విలీనమైంది. ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. రెండో దశ మార్పు తొంభయ్యో దశకంలో వాజ్ పేయి, ప్రమోద్ మహాజన్ ల ఆధ్వర్యంలో మొదలైంది. కూటమి రాజకీయాల ప్రాముఖ్యతను, అనివార్యతను గుర్తించి అధికారంవైపు అడుగులు వేసింది. తాత్కాలికంగా బీజేపీ తన మౌలిక సిద్ధాంతాలను కూటమి రాజకీయాలకోసం పక్కనబెట్టింది.’’

మరో దశ గురించి కూడా పీకే ఊటంకించినట్టూ సమాచారం..

‘‘Ramjanambhoomi Andolan, That was the inflection point at which public opinion shifted. The middle ground changed in the 2002-2004 period and, therefore, it became possible for Modi to cultivate this changed public opinion in a very skillful manner over the last 10 years. This shift hasn’t happened overnight; there has been history of three decades.’’

రామజన్మభూమి ఉద్యమం..ప్రజాభిప్రాయాన్ని గుణాత్మకంగా మార్చివేసింది. ఆ తర్వాత 2002-04 మధ్యకాలంగా తీసుకుంటే…దశాబ్ద కాలంలో నరేంద్ర మోదీ అత్యంత నైపుణ్యవంతంగా ప్రజాభిప్రాయాన్ని మార్చేశారు. ఈ మార్పు రాత్రికి రాత్రి జరిగింది కాదు. సుమారు మూడు దశాబ్దాల చరిత్ర ఉంది’’

రాజకీయ నిపుణుల పరిశీలనలను ప్రశాంత్ కిషోర్ ఎందుకు పరిగణలోకి తీసుకున్నారనే శంక కలగవచ్చు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తనపట్ల తీవ్రమైన వ్యతిరేకత కనపరుస్తున్న ప్రాంతీయ పార్టీలతో సైతం పొత్తులు పెట్టుకోవడం వల్ల మాత్రమే తిరిగి అధికారాన్ని సాధిస్తుందనే అంచనాయే కారణమంటారు నిపుణులు. 

కేవలం ఎన్నికలు కేంద్రంగా కాకుండా రాజకీయ పార్టీ తన ప్రయాణంలో ఎలాంటి విస్తరణ వ్యూహాన్ని అనుసరించింది..? అందుకు తగిన ఎత్తుగడలను రూపొందించడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించిందనేది ముఖ్యం. బీజేపీ ప్రస్థాన రహస్యాన్ని పీకే సరిగ్గానే పసిగట్టినా… భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే సన్నద్ధత కాంగ్రెస్ కు లేదనేది నిర్వివాదాంశం.

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను పీకే ఎలా గట్టెక్కిస్తాడనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతున్న ప్రశ్న.

మరి పీకే ఎలాంటి వ్యూహం-ఎత్తుగడలను అనుసరించనున్నాడో చూద్దాం….

రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాటిదార్ సామాజిక వర్గాన్ని చేరదీయాలనే ఆలోచనను పీకే కాంగ్రెస్ పెద్దల ముందుంచినట్టూ సమాచారం. ఇందుకోసం ప్రభావశీల పాటిదార్ నేత నరేష్ పటేల్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని సూచించినట్టూ సమాచారం. గడచిన ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధం కావాలనీ, అందుకు శ్రేణులను సమాయత్తం చేయాలని సూచించినట్టూ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, కొత్త కమిటీలు వేయాలని సూచించారట.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మేలో కర్ణాటక, నవంబర్ లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, డిసెంబర్ లో రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల విషయంలో సైతం పీకే స్థూలమైన బ్లూ ప్రింట్ రూపొందించినట్టూ సమాచారం.

ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని…లోక్ సభ స్థానాల సంఖ్యను పెంచుకోవడంతో పాటు ప్రాంతీయ పార్టీల తరపున గెలిచి ఎంపీల మద్దతు తీసుకోవాలని సూచించినట్టూ సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న విభేదాలు సమసిపోయేలా తాను చొరవ తీసుకుంటానని కూడా పీకే హామీ ఇచ్చినట్టూ సమాచారం. రాష్ట్రాల్లో అధికారం ప్రాంతీయ పార్టీలదే అయినా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమనేది ముఖ్యమని వివరించినట్టూ సమాచారం. 2023లో జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పీకే వ్యూహం గ్రౌండ్ అయ్యే అవకాశముందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.

పీకే కాంగ్రెస్ లో చేరడం బీజేపీకి ఎలా లాభం?

టెన్ జన్ పథ్ లో ప్రశాంత్ కిషోర్ తో జరిగిన ఆంతరంగీక సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒకరిద్దరు మినహా ఎవరూ లేరు. పైగా గాంధీ కుటుంబంపై గుర్రుగా ఉన్న జి-23 నేతలెవరినీ ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. దీంతో ఇప్పటికే ముసురుకున్న విభేదాలు మరింత పెరిగి అసమ్మతి స్వరాలు బహటంగానే వినిపించే అవకాశాలున్నాయి. ఈ పరిణామాలన్నీ బీజేపీకి అనుకూలించే ఛాన్స్ ఉంది. పుట్టిమునిగి…ఊపిరి సలపని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ ను ప్రశాంత్ కిషోర్ గట్టెక్కిస్తాడా? హస్తం పార్టీతో పాటు పీకే కూడా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతాడా? వేచి చూద్దాం..

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

seventeen + five =