More

    భారత్ ప్రధాని అనుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కుప్పకూల్చగలరు

    పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా భారత ప్రధాని నరేంద్ర మోదీ తలచుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కుప్పకూలిపోయేలా చేయగలరని వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తిగా ఐసీసీ మీదనే ఆధారపడి ఉందని.. అక్కడి నుండే మనకు ఆదాయం వస్తోందని రమీజ్ రాజా వ్యాఖ్యలు చేశారు. ఐసీసీకి భారత్ నుండి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోందని.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కుప్పకూలిపోతుందని అన్నారు. భారత ప్రభుత్వం ఏ క్షణంలోనైనా మన బోర్డుకు నిధులు నిలిపేయాలని నిర్ణయించుకుంటే పీసీబీ కుప్పకూలిపోతుందని చైర్మన్ రమీజ్ రాజా అన్నారు.

    ఐసీసీకి భారత్ నుంచే 90శాతం నిధులు సమకూరుతాయని, ఐసీసీ నుంచి పీసీబీకి 50శాతం నిధులు అందుతున్నాయని చెప్పారు. పరోక్షంగా భారత్‌లోని వ్యాపార సంస్థలే పాకిస్తాన్ క్రికెట్‌ను నడుపుతున్నాయని అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీకి చేరే నిధులు సున్నా అని తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తలుచుకుంటే చాలు.. మన బోర్డు మూతపడిపోతుందని రమీజ్ రాజా అన్నారు. ఇంటర్ ప్రావిన్షియల్ కోఆర్డినేషన్‌పై వేసిన సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా ఈ మాటలు అన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు మొత్తంగా ఐసీసీ మీదే ఆధారపడి ఉందని.. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు.

    పాక్ టూర్ నుండి న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ జట్లు వెళ్ళిపోయిన విషయాన్ని రమీజ్ రాజా ప్రస్తావించారు. “వారు 2 నిమిషాల్లో ప్యాక్ చేసి వెళ్లిపోయారు. మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా లేనందున వారు పాక్ లో సిరీస్ లపై ఆసక్తి చూపడం లేదు” అని అన్నారు. ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కరాచీ వ్యాపార సంఘంతో మాట్లాడుతూ, క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్ సూపర్ పవర్‌గా మారడానికి మీ సహకారం కావాలని రాజా అన్నారు. “మా క్రికెట్ ప్రస్తుతం ఐసిసి నిధులపై ఆధారపడుతోంది మరియు నేను పుస్తకాలను చూసినప్పుడు, స్థానిక పారిశ్రామికవేత్తల సహకారం చాలా తక్కువగా ఉన్నందున నేను చాలా భయపడ్డాను” అని పీసీబీ చీఫ్ అన్నారు.

    ‘భద్రతా ముప్పు’ ఉందంటూ న్యూజిలాండ్ జట్టు క్రికెట్ టూర్ నుండి వైదొలిగిన తర్వాత.. తన పర్యటనను రీషెడ్యూల్ చేయాలని న్యూజిలాండ్‌పై ఒత్తిడి తీసుకుని వస్తున్నామని రాజా అన్నారు. కొన్ని వారాల వ్యవధిలో శుభవార్త ఉంటుందని చెప్పుకొచ్చారు.

    Trending Stories

    Related Stories