లడఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా తోక జాడిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో చైనాకు రాజ్ నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ను ఇచ్చారు. చైనాకు గట్టి జవాబిచ్చేలా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. హాని కలిగిస్తే, భారతదేశం ఎవరినీ విడిచిపెట్టదని, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించిందని అన్నారు. ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం ఉందని ఆయన చెప్పారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూ ఢిల్లీ “జీరో-సమ్ గేమ్” దౌత్యాన్ని విశ్వసించదని అన్నారు. వాషింగ్టన్ డీసీలో భారతదేశం-అమెరికా 2+2 మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు రక్షణ మంత్రి చేరుకున్నారు. ఆయన IndoPACOM ప్రధాన కార్యాలయంలో సమావేశాల కోసం హవాయికి, తరువాత శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లారు.
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ మంత్రి చైనా సరిహద్దులో భారత సైనికులు చూపిన పరాక్రమాన్ని ప్రశంసించారు. “వారు (భారత సైనికులు) ఏమి చేశారో.. మేము (ప్రభుత్వం) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో నేను బహిరంగంగా చెప్పలేను. కానీ భారతదేశానికి హాని కలిగిస్తే భారతదేశం ఎవరినీ విడిచిపెట్టదని (చైనాకు) సందేశం వెళ్ళిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. (భారత్ కో అగర్ కోయి చెరేగా టు భారత్ చోడేగా నహీ)” అని ఆయన చెప్పారు. మే 5, 2020న పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత భారత్-చైనా మిలిటరీల మధ్య లడఖ్ సరిహద్దు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. జూన్ 15, 2020న గాల్వాన్ వ్యాలీ ఘర్షణల తర్వాత మరింత తీవ్రమైంది. ఈ ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు మరణించగా.. చైనా సైనికులు భారీ సంఖ్యలో మరణించారు. తూర్పు లడఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారతదేశం- చైనా ఇప్పటివరకు 15 రౌండ్ల సైనిక చర్చలు జరిపాయి. చర్చల ఫలితంగా, పాంగోంగ్ సరస్సు ఉత్తర మరియు దక్షిణ ఒడ్డున, గోగ్రా ప్రాంతంలో గత సంవత్సరం ఇరుపక్షాల సైన్యాలు వెనక్కు వెళ్లే ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి.
ఉక్రెయిన్ సంక్షోభంపై భారతదేశం యొక్క వైఖరిపై కూడా రాజ్ నాథ్ సింగ్ స్పష్టత ఇచ్చారు. “భారతదేశం స్వరూపం మారిపోయింది. భారతదేశ ప్రతిష్ట మెరుగుపడింది. రాబోయే కొద్ది సంవత్సరాలలో, ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారతదేశం ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారడాన్ని నిరోధించలేదు” అని సింగ్ అన్నారు. భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి రాజ్ నాథ్ సింగ్ తన ప్రసంగంలో.. గతంలో, ప్రపంచంలోని ఏదైనా దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటే, వారు భారతదేశంతో శక్తివంతమైన వాణిజ్యాన్ని స్థాపించాలని ఆలోచిస్తున్నారు. 2047లో 100వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే నాటికి భారతదేశంలో ఇలాంటి పర్యావరణ వ్యవస్థ నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.