ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు.. నో టెన్షన్

కరోనా టెస్టుల విషయంలో ఎంతో టెన్షన్ పడుతున్న సంగతి తెలిసిందే..! కరోనా లక్షణాలు ఏవైనా కనిపిస్తే చాలు.. ఎక్కడ టెస్టులు చేస్తున్నారు.. ఈరోజు వెళ్తే టెస్టులు చేస్తారా లేదా..? లాంటి ఎన్నో అనుమానాలు వెంటాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా టెస్టింగ్ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున జనం గూమికూడి ఉండడం కూడా తెలియని భయాలను రేకెత్తిస్తుంది. అందుకే ఇంట్లోనే టెస్టులు చేసుకునేలా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఓ కొత్త పరికరానికి ఆమోద ముద్ర వేసింది. ఇంట్లోనే.. మనకు మనమే టెస్ట్ చేసుకోవచ్చు. మహారాష్ట్రలోని మైల్యాబ్ అనే సంస్థ తయారు చేసిన ‘కొవిసెల్ఫ్’ అనే స్వీయ ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్ కు అనుమతులను ఇచ్చింది. దీనితో ర్యాపిడ్ టెస్ట్ ఫలితం వస్తుంది.

లక్షణాలున్న వారు లేదా కరోనా సోకిన వారిని ఇటీవలే కలిసిన వారు టెస్ట్ చేసుకోవచ్చని ఐసీఎంఆర్ తెలిపింది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ వచ్చి శాంపుల్స్ ను కలెక్ట్ చేసుకోవడం వంటివేవీ ఉండవు.. కేవలం మీరే మీ చేతులతో టెస్టును చేసుకోవచ్చు. దీన్నే ప్రామాణికంగా తీసుకోకుండా.. కరోనా లక్షణాలు ఉన్నా ఇందులో నెగటివ్ గా వస్తే మాత్రం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.
సంస్థ టెస్ట్ కిట్ లోని యూజర్ మాన్యువల్ లో నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్ష చేసుకోవాలి. టెస్టులు చేసుకునేవారంతా గూగుల్ ప్లే స్టోర్ నుంచి హోం టెస్టింగ్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే.. అందులో పరీక్షా పద్ధతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ యాప్ లో ఉంటాయి. పరీక్ష ఫలితాల్లో నెగెటివ్/పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవచ్చు.టెస్ట్ పూర్తయిన తర్వాత.. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న, టెస్ట్ చేసుకున్న వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ లోనే ఆ టెస్ట్ పేపర్ ను ఒక ఫొటో తీసుకోవాలి. టెస్ట్ లో పాజిటివ్ వస్తే కరోనా ఉన్నట్టు.. ఒకవేళ లక్షణాలుండి నెగెటివ్ వస్తే కచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్ వచ్చి.. లక్షణాలు తక్కువగా ఉన్నవారు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గనిర్దేశాల ప్రకారం ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాల్సి ఉంటుంది.
లక్షణాలుండి యాంటీ జెన్ టెస్ట్ లో నెగెటివ్ వచ్చిన వారిని కరోనా అనుమానిత పేషెంట్ గానే భావించాలి. అలాంటి వారు ఇంట్లో ఐసోలేట్ అవ్వాలి. యాప్ లోని యూజర్ వివరాలు ఐసీఎంఆర్ కొవిడ్ 19 టెస్టింగ్ పోర్టల్ లో భద్రంగా దాస్తారు. టెస్ట్ అయిపోయిన తర్వాత సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ కిట్ ను భద్రంగా పారేయాలి.
ఒక్కో కిట్ లో అన్ని టెస్టింగ్ మెటీరియల్స్ కూడా ఉండాయి. బయో హజార్డ్ బ్యాగ్ ను ఉపయోగించి టెస్టింగ్ అయ్యాక కిట్ ను పారవేయాల్సి ఉంటుంది. కోవి సెల్ఫ్ లో 15 నిమిషాల్లో ఫలితం రానుంది. దీని ధర కంపెనీ 250 రూపాయలుగా నిర్ణయించింది. కొద్దిరోజుల్లోనే షిప్పింగ్ చేయనున్నారు. మెడికల్ షాపుల్లో లభిస్తాయని సంస్థ తెలిపింది.

ప్రస్తుతం భారత దేశంలో టెస్టింగ్ అన్నది పెద్ద సమస్యగా మారిందని.. కొవిసెల్ఫ్ ద్వారా పరిస్థితుల్లో చాలా మార్పులు రాబోతున్నాయని మైల్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ హస్ముఖ్ రావల్ తెలిపారు. తాము కొన్ని మిలియన్ల టెస్ట్ కిట్లను రూపొందించామని.. ఎవరికి వారు టెస్ట్ చేసుకుని.. వీలైనంత త్వరగా అలర్ట్ అవ్వొచ్చని రావల్ చెప్పుకొచ్చారు. అలా చేస్తే కరోనా ఇతరులకు సోకడం చాలా వరకూ తగ్గుతుందని అన్నారు. ఐసీఎంఆర్ కు రిజల్ట్ అన్నది డైరెక్ట్ గా చెప్పే అవకాశం ఉండడం వలన ప్రభుత్వం కూడా మిమ్మల్ని సులువుగా ట్రేస్ చేసే అవకాశం ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.