Sports

మనకు దక్కలేదు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ ను చిత్తు చేసి న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. అద్భుతమైన బౌలింగ్ తో భారత బ్యాట్స్మెన్ ను కంగారు పెట్టిన కివీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లీ సేన కంటే న్యూజిలాండ్‌ బలంగా నిలవడంతో టైటిల్ ను సొంతం చేసుకుంది. రిజర్వుడే రోజు భారత్ కు పరాజయం ఎదురైంది. అభిమానులు మరోసారి భారత్ విజయాన్ని ఆశించి భంగపడ్డారు. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలడంతో కివీస్ విజయ లక్ష్యం 139 పరుగులు అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఐసీసీ తొలి టెస్టు చాంపియన్‌షిప్ ట్రోఫీ అందుకుంది. కెప్టెన్ విలియమ్సన్ 52 పరుగులు, రాస్ టేలర్ 47 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

టీమిండియా రెండో ఇన్నింగ్స్ 170 పరుగుల వద్ద ముగిసింది. భారత బ్యాట్స్‌మెన్ చివరి 4 వికెట్లను 14 పరుగుల తేడాతో చేజార్చుకున్నారు. భారత ఆటగాళ్లలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన 41 పరుగులే అత్యధికం. రోహిత్ శర్మ 30 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. కివీస్ బౌలర్లలో సౌథీ నాలుగు, బౌల్ట్ మూడు వికెట్లు తీసుకోగా, జెమీసన్ రెండు, నీల్ వాగ్నర్ ఒక వికెట్ పడగొట్టారు.

మ్యాచ్ ముగిసిన అనంతరం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ కేన్ విలియమ్సన్, అతని జట్టుకు అభినందనలు తెలిపాడు. వాళ్లు అద్భుతంగా ఆడి మూడు రోజుల్లో ఫలితం సాధించారు. ఈ విజయానికి వారు అన్ని విధాలుగా అర్హులని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ లో వర్షం అంతరాయం మా అవకాశాలను దెబ్బతీసింది. తొలి రోజు ఆట పూర్తిగా వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని కఠిన పరిస్థితి.. ఇక ఆట ప్రారంభమైన తర్వాత మేం కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మెరుగైన స్థితిలో నిలిచాం. కానీ బ్యాడ్ లైట్ కారణంగా ఆట ఆపేయాల్సి వచ్చింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్ జరిగుంటే మేం మరిన్ని పరుగులు చేసేవాళ్లమేమో అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ బౌలర్లు ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసి మమ్మల్ని గెలుపు రేస్ నుంచి వెనక్కు నెట్టారు. మేం 30, 40 పరుగులు తక్కువగా చేశాం.. వరుసగా వికెట్లు కోల్పోయాం. జట్టులో ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఉండటం చాలా ముఖ్యం. ఇదే మా బెస్ట్ కాంబినేషన్ అనుకున్నాం.. అలాగే బ్యాటింగ్ డెప్త్ కూడా ఉందనుకున్నాం. ఆట ఇంకా ఎక్కువగా జరిగి ఉంటే స్పిన్నర్లు ప్రభావం చూపేవారని కోహ్లీ చెప్పుకొచ్చాడు. జెమీసన్ ఓ నాణ్యమైన క్రికెటర్. అతను అద్బుతమైన ఏరియాల్లో బంతిని వేసాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు అతను అన్ని విధాల అర్హుడు. అంతర్జాతీయ క్రికెట్‌కు టెస్ట్‌ ఫార్మాట్ హార్ట్ బీట్. ఈ మ్యాచ్‌ నుంచి ఎంతో నేర్చుకున్నాం. మా లోపాలను సవరించుకుంటాం. ఇంగ్లండ్ సిరీస్ లో రాణించాలి అని కోహ్లీ చెప్పాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

ten + 5 =

Back to top button