అరవింద్ కేజ్రీవాల్ అబాసుపాలు అయ్యారు. ఢిల్లీ సర్కార్ పై సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్‌పై.. సోషల్‌మీడియాలో తాజాగా కొందరు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఓ అధికారి తన కుక్కతో వాకింగ్ చేసేందుకు వీలుగా స్టేడియం వేళల్ని సవరించినందుకు మండిపడుతున్నారు. ఢిల్లీలో స్టేడియాల వేళల్ని పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. రాత్రి పది గంటలకు వరకు అథ్లెట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాల జారీ వెనుక ఉన్న వ్యవహారమే విమర్శలకు దారి తీస్తోంది.
ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో ఓ ఐఏఎస్ అధికారి పెంపుడు కుక్కతో నిత్యం వాకింగ్‌కు వస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన కోసం స్టేడియం నిర్వాహకులు.. అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే సమయం తగ్గించారు. త్వరగా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తగా.. రాత్రి పది గంటల వరకు స్టేడియాలను తెరిచి ఉంచాలని తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ రెవెన్యూ సెక్రెటరీ సంజీవ్ ఖీర్వార్ తన పెంపుడు కుక్కతో ఈ స్టేడియంలోనే వాకింగ్ చేస్తున్నారు. ఈయన కోసమే అథ్లెట్లను బయటకు పంపించి వేస్తున్నారంటూ.. ఫొటో ఆధారాలతో సహా విమర్శిస్తున్నారు కొందరు. అయితే స్టేడియం నిర్వాహకుడు అనిల్ చౌదరి మాత్రం విమర్శలను ఖండిస్తున్నారు. స్టేడియం అధికారిక టైమింగ్ రాత్రి ఏడువరకే. ఆ తర్వాత ఎవరినీ ఎవరూ బయటకు వెళ్లిపోమనట్లేదు. స్వచ్చందంగా అథ్లెట్లు వెళ్లిపోతున్నారంటూ చెప్పారు. మరి సంజీవ్ ఈ స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు. Delhi Staduim Dog Walk Row ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో .. ఇప్పుడు స్టేడియం వేళల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కేజ్రీవాల్.