కరోనా మహమ్మారి ప్రభావం చాలా ప్రాంతాల్లో తగ్గుతూ వస్తోంది. దీంతో పలు కంపెనీలు తిరిగి ఆఫీసులకు రావాలని ఉద్యోగులను పిలుస్తూ ఉన్నాయి. తిరిగి కార్యాలయానికి రమ్మని పిలుస్తూ ఉంటే.. ఉద్యోగాలకు రాజీనామాలు చేసేస్తూ ఉన్నారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రెండేళ్లుగా మూతపడిన కార్యాలయాలు మళ్లీ తెరుచుకున్నాయి. కొందరు తిరిగి ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి ఉత్సాహం కనబరుస్తూ ఉండగా.. మిగిలిన సగం మంది ఆఫీసు నుండి పని చేయాలనే ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు. తిరిగి ఆఫీసులకు వెళ్లాలంటే ప్రయాణాలు, సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి మహా నగరాలకు చేరుకోవడాలు వంటివి కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికే ఎక్కువ సమయం అవుతుందని ఉద్యోగులు భావించి ఆఫీసులకు వెళ్లాలంటేనే సంశయిస్తూ ఉన్నారు.
చిన్న చిన్న కంపెనీలు అంటే ఏదో అనుకోవచ్చు.. యాపిల్ కంపెనీని కూడా వదిలేయడానికి కొందరు ఉద్యోగులు సిద్ధమయ్యారు. అలాంటి వ్యక్తి గురించే మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. Apple సంస్థ మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్ ఇయాన్ గుడ్‌ఫెలో ఆఫీసుకు తిరిగి రావాలని కోరడంతో.. ఆపిల్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. కంపెనీని విడిచిపెట్టాలనే తన నిర్ణయం గురించి ఇయాన్ తన టీమ్ సభ్యులకు తెలియజేశాడు. కంపెనీని విడిచిపెట్టాలనే ఇయాన్ నిర్ణయం Apple హైబ్రిడ్ వర్క్ పాలసీని ప్రభావితం చేసింది. కొత్త వర్క్ పాలసీ ప్రకారం ఉద్యోగులు ఏప్రిల్ 11 నాటికి వారానికి కనీసం ఒక రోజు, మే 2 నాటికి వారానికి కనీసం రెండు రోజులు, మే 23 నాటికి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి ఉంటుంది. Apple తన ఉద్యోగులను తిరిగి కంపెనీకి రావాలని కోరింది. అయితే కొంతమంది ఉద్యోగులు మాత్రం యాపిల్ సంస్థ కొత్త నిర్ణయంతో సంతోషంగా లేరు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఉద్యోగులు యాపిల్ సీఈవో టిమ్ కుక్ కు లెటర్ రాశారు.