కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల చుట్టూ ఓ రకమైన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మల్లిఖార్జున ఖర్గేను గెలిపించాలని చాలా మంది ఫిక్స్ అయ్యారు.. అదీ కాకుండా గాంధీల మద్దతు కూడా ఆయనకే ఉందనే ప్రచారం కూడా బాగా కొనసాగుతూ ఉంది. ఈ సమయంలో శశిథరూర్ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటున్నారనే ప్రచారం కూడా చాలా ఎక్కువైంది. ఈ వార్తలపై తాజాగా శశి థరూర్ స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికల నుంచి తాను తప్పుకున్నాని వస్తున్న వార్తలన్నీ అబద్దాలే అని థరూర్ చెప్పుకొచ్చారు. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ కాని వారు చేస్తున్న ప్రచారమని ఆయన అన్నారు. “నేను నామినేషన్ ఉపసంహరించుకోబోతున్నాననే పుకార్లు అబద్ధం. నాకు చాలా మద్దతు లభిస్తోంది, నేను ప్రజాస్వామ్యబద్ధంగా మొగ్గు చూపకపోతే, ఇతర అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని కోరి ఉండేవాన్ని.” అని అన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి దేశంలో బలమైన కాంగ్రెస్ పార్టీ అవసరమని, కాంగ్రెస్‌ను యువ భారత పార్టీగా మార్చాలని చెప్పుకొచ్చారు. దేశానికి భవిష్యత్తుగా నిలిచే యువత తనకు అండగా నిలుస్తోందని, దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు ఉన్నారని, తన అంచనాలు ఈ యువ తరంపైనే ఉన్నాయని అన్నారు. అధ్యక్ష పోరు ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరుగుతన్నది కాదని, ఇది పార్టీ భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికని తేల్చేశారు శశి థరూర్.