నా కులం కారణంగా తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు పోలీసులు: నవనీత్ రాణా

0
721

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే ఇంటి ముందు హ‌నుమాన్ ఛాలీసా ప‌ఠిస్తామని ప్ర‌క‌టించి అరెస్టయిన అమ‌రావ‌తి ఎంపీ న‌వ‌నీత్ కౌర్ రాణా, ఆమె భ‌ర్త, ఎమ్మెల్యే ర‌వి రాణాల‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. త‌మ‌పై న‌మోదు చేసిన విద్రోహ కేసును కొట్టివేయాల‌న్న న‌వ‌నీత్ దంప‌తుల పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. న‌వనీత్ కౌర్ దంపతుల వ్య‌వ‌హార స‌ర‌ళిపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉన్న‌ప్పుడు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని హిత‌వు చెప్పిన కోర్టు… ఇష్ట‌మొచ్చిన చోట హ‌నుమాన్ ఛాలీసా ప‌ఠిస్తారా? అంటూ ప్ర‌శ్నించింది.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త, శాసనసభ్యుడు రవి రాణా సోమవారంనాడు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రైవేటు నివాసమైన ‘మాతోశ్రీ’ ఎదుట హనుమాన్ చాలీసా పఠనానికి పిలుపునిచ్చి ఉద్రిక్తతలకు తావిచ్చిన కారణంగా రాణా దంపతులను ముంబై పోలీసులు గత శనివారం అరెస్టు చేశారు. వారిపై ‘దేశద్రోహం’ ఆరోపణలు నమోదు చేసి ఆదివారంనాడు బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది.

ఎంపీ నవనీత్ కౌర్ రాణా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేన కొన్ని నిర్దిష్ట కారణాలతో హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా విస్మరించిందన.. ఓటు ద్వారా తీర్పునిచ్చిన ప్రజలకు నమ్మకద్రోహం తలపెట్టిందని ఆరోపించారు.
శివసేనలో హిందుత్వ భావజాల జ్వాలను మళ్లీ రగిలించాలన్న ఉద్దేశంతోనే తాను సీఎం ఉద్ధవ్ థాకరే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తానని ప్రకటన చేశానని నవనీత్ కౌర్ రాణా స్పష్టం చేశారు. అంతేతప్ప, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలన్నది తన అభిమతం కాదని తెలిపారు. “సీఎం కూడా మాతో కలిసి హనుమాన్ చాలీసా పఠించాలని మేం కోరుకున్నాం. అందుకే ఆయనకు ఆహ్వానం పలికాం. ఇది సీఎం పట్ల వ్యతిరేకతతో తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. అయితే మా కార్యాచరణ ముంబయిలో శాంతిభద్రతలకు భంగం కలిగే రీతిలో ఉన్నాయన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని హనుమాన్ చాలీసా పఠనాన్ని విరమించుకున్నాం. ఈ మేరకు బహిరంగ ప్రకటన కూడా చేశాం. మేం సీఎం నివాసం వద్దకు వెళ్లడంలేదని స్పష్టం చేశాం. నేను, నా భర్త రవి రాణా ఇంటికే పరిమితం అయ్యాం. కానీ, 23వ తేదీన నన్ను, నా భర్తను ఖార్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తాగేందుకు నీళ్లు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పోలీసులు ఒక్కసారి కూడా స్పందించలేదు. రాత్రంతా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఇక, మంచినీళ్లు ఇవ్వకపోవడానికి అక్కడి పోలీసు సిబ్బంది చెప్పిన కారణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మేం షెడ్యూల్డ్ కులానికి చెందినందున అదే గ్లాసుతో నీళ్లు ఇవ్వబోమని చెప్పారు. నన్ను కులం పేరుతో నేరుగానే దూషించారు. కనీసం నేను బాత్రూంను వినియోగించుకోవాలని భావించినప్పుడు కూడా పోలీసుల నుంచి తీవ్ర అభ్యంతరకర పదజాలం ఎదురైంది. పోలీసులు ఎంతో దారుణమైన రీతిలో నన్ను దుర్భాషలాడారు. నిమ్న కులాల వారు మా బాత్రూంలు వినియోగించుకోవడాన్ని మేం అంగీకరించబోమని పోలీసులు చెప్పారు” అంటూ నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ కు రాసిన లేఖలో తెలిపారు.