బీజేపీ షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ వివరణ..!

0
807

కొద్దిరోజుల క్రితం రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. గతంలో హిందూ దేవీ దేవతలను దూషించిన.. స్టాండప్ కమేడియన్ మునావర్ ఫరూఖీకి.. తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో సాదరంగా ఆహ్వానించడంతో వివాదం మొదలైంది. మునావర్ ఫరూఖీకి దీటుగా సమాధానమివ్వాలనే తపనతో రాజాసింగ్ ఓ వీడియోను రికార్డు చేశారు. ఇందులో ఉపయోగించిన కొన్న పదాలు ఓ వర్గాన్ని కించపరిచేవిగా ఉన్నాయని భావించడంతో వివాదం మొదలైంది. దీంతో రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అటు బీజేపీ కూడా అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తక్షణమే పార్టీనుండి సస్పెండ్ చేసింది. అంతేకాదు, పదిరోజుల్లోగా షోకాజ్ నోటీస్ కు సమాధానం చెప్పాలని పార్టీ హైకమాండ్ రాజాసింగ్ ను కోరింది.

దీంతో రాజాసింగ్ తాజాగా పార్టీ షోకాజ్ నోటీస్ కు సమాధానమిచ్చారు. 2014 నుండి తాను బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందాననీ,.. తనకు ఈ అవకాశమిచ్చిన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు 2018లో పార్టీ తరపున గెలుపొందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా తానేననీ అప్పటినుండి తన నియోజకవర్గ అభివృద్దికి ఎంతగానో కృషి చేస్తున్నానని తెలిపారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గం చుట్టూ ఎంఐఎం పార్టీ అధికారంలో ఉందన్నారు. ఈ పార్టీ ప్రజలను కేవలం మత కోణంలోనే ఓట్లను అడుగుతుందని పూర్తి మత రాజకీయాలు చేయడంలో ఎంఐఎం దిట్ట అని వ్యాఖ్యానించారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో కూడా మునావర్ ఫరూఖీకి బుద్ధి చెప్పడానికే అలా చేశానని అన్నారు. అంతేకానీ ఏమతాన్ని కానీ ఏ వర్గాన్ని కానీ కించపరిచేందుకు కాదనీ లేఖలో పేర్కొన్నారు. తాను పార్టీపట్ల ఎంతో విధేయతతో ప్రవర్తిస్తానని చెప్పిన రాజాసింగ్ పార్టీకు నష్టం కలిగించేలా కానీ, పార్టీ విలువలను కానీ ఏమాత్రం జవదాటననీ తెలిపారు.

ఇక తనను అన్యాయంగా అరెస్ట్ చేశారన్న రాజాసింగ్.. కేసీఆర్, ఒవైసీలు కలిసి తనపై కక్షకట్టాయనీ అన్నాడు. తాను ఎంఐఎం పార్టీపై చేసిన విమర్శలను.. మొత్తం ముస్లిం సమాజంపై చేసినట్లు చిత్రీకరిస్తున్నాయని తెలియజేశారు. అంతేకాదు,.. తనపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసిందని లేఖలో స్పష్టం చేశారు. అయినా కూడా కేసీఆర్, ఒవైసీలు కలిసి తనను రాజకీయంగా అణచివేయడానికే తనపై పీడీయాక్టు ప్రయోగించారని తెలిపారు. మొత్తానికీ తాను పార్టీ రాజ్యాంగ నియమాలను ఏమాత్రం ఉల్లంఘించలేదని లేఖలో రాసుకొచ్చారు రాజాసింగ్.

అయితే రాజాసింగ్ వ్యాఖ్యలు సరైనవా కావా అనే విషయంలో ఎవరి వాదన వారిదే. కానీ రాజాసింగ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కాస్తంత సంయమనం పాటించాల్సిన అవసరముందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటపడగానే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తీవ్రంగా విమర్శించే అవకాశముండేది. కానీ ఆ అవకాశం లేకుండా రాజాసింగ్ వ్యాఖ్యలతో అసలు విషయం పక్కకు వెళ్ళినట్టు బీజేపీలో కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, రాజాసింగ్ లాంటి పార్టీ నాయకులు చేసే వ్యాఖ్యలు బీజేపీ మొత్తానికీ చేటు తీసుకొచ్చే అవకాశముందని పార్టీ అధిష్టానం భావించినట్టుుంది. అందుకే తక్షణ చర్యలకు పూనుకుంది.

ఏదైనా విషయం నచ్చకపోతే దానిని విమర్శించవచ్చు. కానీ, అవతలి వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం చాలామందికి రుచించలేదు. ఇక కేసీఆర్ సైతం రాజాసింగ్ పై చూపిన దూకుడుతో బీఆర్ఎస్ పార్టీకి కూడా కాస్తంత నష్టం కలిగించిందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. రాజాసింగ్ పై పెట్టిన కేసుపై కోర్టు బెయిలు ఇచ్చినా,.. పీడీయాక్టు తో మరోసారి అరెస్టు చేయడంతో ఒవైసీ చెప్పుచేతల్లో కేసీఆర్ ఉన్నారనే భావన ప్రజల్లో బలంగా వెళ్ళింది. హిందూ భావజాలం కాస్తంత ఎక్కువగా ఉన్న వారిలో కేసీఆర్ పై పూర్తి వ్యతిరేకత వచ్చినట్లయింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fourteen + 3 =