Just Asking

సెక్యులర్ ముసుగులో యూరప్, అమెరికా మతోన్మాదం..!

సెక్యులరిజం అనేది.. మన దేశంలో కుహనా మేధావులకు, విదేశీ పెంపుడు జర్నలిస్టులకు,.. రాజకీయ పార్టీల ముసుగులో వున్న జాతి వ్యతిరేక శక్తులకు,.. అధికారం కోసం అర్రులు చాచే వారసత్వ రాజకీయ నేతలకు ఓ ఊతపదం. ఈ పదం ఉచ్చరించనిదే వీరికి నిద్రపట్టదు. తామే నికార్సయిన లౌకికవాదులమంటూ.. జాతీయవాదులపై విరుచుకుపడుతూవుంటారు. పైగా పశ్చిమ దేశాలను ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఎగిరెగిరిపడుతుంటారు. అసలు సెక్యులరిజం అంటే ఏమిటి..? పైకి లౌకికవాదమనే అందమైన దుప్పటి కప్పుకున్న దేశాలు.. సెక్యులిజాన్ని ఏమేరకు అనుసరిస్తున్నాయి..? పశ్చిమ దేశాల్లో నిజమైన సెక్యులర్ దేశాలు ఎన్ని..?

అమెరికా, యూరప్ దేశాలను.. సెక్యులరిజానికి గ్లోబల్ రోల్ మోడల్ గా చెబుతూవుంటారు. కానీ, ఒక్కసారి లోతుగా పరిశీలిస్తే.. అవి సెక్యులర్ ముసుగు కప్పుకున్న మతోన్మాద రాజ్యాలని ఇట్టే అర్థమవుతుంది. నేడు సెక్యులర్ దేశాలుగా చెలామణి అవుతున్న దేశాల్లో సెక్యులరిజం అనేది నేతి బీరలో నెయ్యి చందమే. ప్రపంచ దేశాలు సెక్యులర్ పాఠాలు బోధిస్తున్న యూరప్, అమెరికా దేశాలు ఏమేరకు సెక్యులరిజాన్ని పాటిస్తున్నాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

మొదట ప్రపంచంలోనే గొప్ప లౌకికవాద దేశంగా చెప్పుకునే అమెరికా విషయాన్ని చూద్దాం. అమెరికా జాతీయ నినాదం ఏంటో తెలుసా..? ‘In God We Trust’. తాము నమ్మే దేవుడు తప్ప.. వేరే దేవుడు లేడన్నది దీని పరోక్ష సారాంశం. అంటే, ఇతర దేవుళ్లును పూజించేవాళ్లకు, దేవుడిని నమ్మని నాస్తికులకు అక్కడ విలువ లేదనే కదా అర్థం..! దీనిని బట్టి అమెరికా లౌకికవాదానికి ఇచ్చే విలువ ఏపాటిదో మీకు అర్థమయ్యే వుంటుంది.

‘In God We Trust’ నినాదం అమెరికా యొక్క స్వాభావిక క్రైస్తవ మతాన్ని సూచిస్తోంది. అంటే క్రైస్తవేతరులంతా బయటివారేనని అమెరికా చెప్పకనే చెబుతోంది. ‘In God We Trust’ అనే నినాదాన్ని 1938 నుంచే అమెరికా నాణేలపై ముద్రిస్తోంది. 1957 నుంచి పేపర్ కరెన్సీపైనా అచ్చేయిస్తోంది. అంతేకాదు, సీఎన్ఎన్, యూఎస్ టుడే, గాలప్ సర్వే ప్రకారం.. 90 శాతం అమెరికన్లు ‘In God We Trust’ నినాదాన్ని కాయిన్లపై ముద్రించడాన్ని స్వాగతించినట్టు తేలింది. మరోవైపు, ప్రభుత్వ కట్టడాలు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థలపై ఈ నినాదం కచ్చితంగా కనిపిస్తుంది. మరి, సాధారణ ప్రజల దృష్టిలో అమెరికా సెక్యులర్ రాజ్యం ఎలా అవుతుంది..?

‘In God We Trust’ నినాదంపై అక్కడి రాజకీయ నాయకుల దృష్టికోణం ఎలావుందో ఓసారి చూద్దాం. 2011లో అమెరికా దిగువ సభ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 396 మంది సభ్యులు.. ‘In God We Trust’ నినాదానికి అనుకూలంగా ఓటేయగా.. కేవలం 9 మంది మాత్రమే తిరస్కరించారు. దీనిని బట్టి అమెరికన్ల మతోన్మాదం ఏ రేంజిలో వుందో అర్థం చేసుకోవచ్చు. అయినా, అది ప్రపంచం దృష్టిలో గొప్ప సెక్యులర్ దేశం..!

ఇక, లౌకికవాదంలో తానే ప్రపంచానికి ఆదర్శమని చెప్పుకునే యూకే రాజ్యాంగం ఏం చెబుతుందో ఓసారి చూద్దాం.

‘Sitting in both houses begin with prayers. these follow the christian faith and there is currently no multi-faith elements’.. అని వారి రాజ్యాంగంలో స్పష్టంగా రాసుకున్నారు. అంటే, యూకేలో చట్ట సభలు సైతం క్రైస్తవ ప్రార్థనతోనే ప్రారంభమవుతాయన్నమాట. ఉభయ సభలు క్రైస్తవాన్ని మాత్రమే అనుసరిస్తాయి. బహుళ విశ్వాసాలకు అక్కడ చోటు లేదు.

మరి, ఇలా.. ‘క్రైస్తవం మాత్రమే’ అంటూ నిస్సిగ్గుగా రాజ్యాంగంలో రాసుకున్న యూకే.. లౌకిక రాజ్యం ఎలా అవుతుంది..?

కేవలం అమెరికా, యూకే మాత్రమే కాదు.. పలు పశ్చిమ దేశాల రాజ్యాంగం ప్రకారం.. అక్కడ క్రైస్తవ మతమే అధికారిక మతం. సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే పలు స్కాండినేవియన్ దేశాల్లోనూ క్రైస్తవ మతమే అధికారిక మతం. ఇంకా కొన్ని దేశాల్లో పార్లమెంటు సైతం క్రైస్తవ మతానికి కట్టుబడి నడుచుకోవాల్సిందే. ఆ విచిత్రాలను కూడా ఓసారి చూద్దాం..

ఇప్పుడోసారి ఆస్ట్రేలియా వెళ్దాం.. ఇది ఆ దేశ పార్లమెంట్ అధికారిక వెబ్ సైట్. ఇక్కడ వాళ్లు ఏం రాసుకున్నారో చూద్దాం..

‘The president, on taking the chair each day, shall read the following prayer :’ అంటే..

అక్కడి పార్లమెంటులో.. క్రైస్తవ మత ప్రార్థన చదివిన తర్వాతే.. సభాధ్యక్షుడు తన స్థానంలో కూర్చోవాల్సివుటుంది. ఇదీ అక్కడి రాజ్యాంగ నిబంధన.

భిన్న సంస్కృతులు, భిన్న మతాల ప్రజలు నివసిస్తున్న ఆస్ట్రేలియా.. కేవలం మెజారిటీ మతమైన క్రైస్తవ మతానికి మాత్రమే ప్రాధాన్యతనివ్వడం విడ్డూరం. మరి, ఈ దేశాన్ని సెక్యులర్ దేశమని పిలుద్దామా..?

ఇక, నార్వేను తీసుకుందాం. ఈ దేశాన్ని సెక్యులరజానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెబుతుంటారు. కానీ, తమది సెక్యులర్ కంట్రీ కాదని.. సాక్షాత్తు ఆ దేశ రాజ్యాంగమే స్పష్టంగా చెబుతోంది.

నార్వే రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ఏం చెబుతుందో ఓసారి చూద్దాం..

‘Our values will remain our christian and humanist heritage so’. అంటే తాము పాటించే విలువలు.. క్రైస్తవ మతం, మానవతావాద వారసత్వంగా వుంటాయని చెబుతోంది.

ఇదే ఆర్టికల్ 2 లో ఇంకాస్త ముందుకెళ్దాం..

‘The evangelical lutheran religion shall remain the official religion of the state. The inhabitants professing it are bound to bring up their children in the same.

క్రైస్తవ మతమే రాజ్యానికి అధికారిక మతమని నిస్సిగ్గుగా ప్రకటించుకుంది నార్వే. దీనికి ప్రజలంతా కట్టుబడి వుండటమే కాకుండా.. పిల్లల్ని కూడా అలాగే పెంచాలనే నిబంధన విధించుకుంది.

సరే, ఓసారి ఆర్టికల్ 4లో ఏముందో చూద్దాం..

‘The king shall at all times profess the evangelical lutheran religion’.. అంటే, పాలకుడు ఎప్పుడు క్రైస్తవాన్ని ప్రకటిస్తూ వుండాలని దీనర్థం.

ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది..? ఇది క్రిస్టియన్ వదామా..? లేక లౌకికవాదమా..?

నిజానికి, 2012 లో నార్వే రాజ్యాంగాన్ని సవరించారు. అయినా, కొత్త రాజ్యాంగంలో కూడా మతాభిమానం విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. మరి, నార్వే సెక్యులర్ దేశమని ఎలా అంటారు..?

పశ్చిమ దేశాల్లోని రాజ్యంగం, చట్ట సభల్లోనే కాదు.. చివరికి ప్రభుత్వ వ్యవహారాల్లోనూ మత వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ హాలీడే క్యాలెండర్లలో క్రైస్తవ పండుగలకు తప్ప.. ఇతర మతాల పండుగలకు చోటుండదు. మైనార్టీల పండుగలకు అక్కడ ఎప్పుడూ సెకండ్ క్లాస్ స్టేటస్సే.

ఓసారి ఆస్ట్రేలియా హాలీడే క్యాలండర్ చూద్దాం..

Good Friday, Easter Satureday, Easter Monday.. క్యాలెండర్ మొత్తం.. క్రిస్టియన్, క్రిస్టియన్, క్రిస్టియన్.. అన్నీ ఒక మతానికి చెందిన పండుగలే. ఎందుకిలా..? ఆస్ట్రేలియాలో క్రైస్తవులు మాత్రమే నివసిస్తున్నారా..?

ఇప్పుడు కెనడా హాలీడే క్యాలెండర్ చూద్దాం..

ఇది కూడా ఆస్ట్రేలియా క్యాలెండర్ ను మక్కీ టు మక్కీ దింపేసింది. అన్నీ క్రిస్టియన్ ఫెస్టివల్సే. ఇతర మతాలకు చోటు లేదు. ఆస్ట్రేలియా జనాభాలో 1.9 శాతం హిందువులు, 2.4 శాతం బౌద్ధులుంటారు. కానీ, అక్కడి హాలీడే క్యాలండర్‎లో దీపావళి గానీ, బుద్ధ పూర్ణిమ గానీ కనిపిస్తే ఒట్టు..! కానీ, బ్రిటన్, కామన్వెల్త్ దేశాలతో పాటు.. క్వీన్ బర్త్ డేను మాత్రం బ్రహ్మాండంగా జరుపుకుంటారు.

ఇక, స్వీడన్ విషయానికి వద్దాం.. ఇక్కడ హాలీడే క్యాలెండర్ మొత్తం క్రైస్తవ పండుగలతో నిండిపోయింది. బ్యాంక్ హాలీడేస్ లిస్టులోనూ అదే సీన్. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్. మీరు భూతద్దం వేసి వెతికినా.. ఇతర మతాలకు సంబంధించి ఒక్క పండుగ కూడా కనిపించదు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్వీడన్ లో 8 లక్షలకు పైగా ముస్లింలు ఉంటారు. స్వీడన్ మొత్తం జనాభాలో ముస్లిం జనాభా 8.1 శాతం. కానీ, అక్కడి హాలీడే క్యాలెండర్ లో రంజాన్ గానీ, బక్రీద్ గానీ కనిపించవు. అయినా, స్వీడన్ ప్రపంచం దృష్టిలో గ్రేటెస్ట్ సెక్యులర్ కంట్రీ..!

క్రిస్టియన్ దేశాల్లో ఇతర మతాలపైనే కాదు.. క్రిస్టియన్లలోని పలు మైనార్టీ గ్రూపుల పట్ల.. మెజార్టీ గ్రూపుల వివక్ష కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇందుకు, లాత్వియా బలమైన ఉదాహరణ. లాత్వియా క్రిస్టియన్లలోని ఓ మైనార్టీ వర్గంవారు.. క్రిస్మస్ ను డిసెంబర్ 25న కాకుండా.. జనవరి 6 లేదా 7 తేదీల్లో జరుపుకుంటారు. ‘ఆర్థోడాక్స్ క్రిస్మస్’ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ దేశంలో వీరి జనాభా 20 శాతానికి పైనే. అయినా, లాత్వియా హాలీడే క్యాలెండర్‎లో కేవలం డిసెంబర్ 25కు మాత్రమే చోటుంది. జనవరి 6 లేదా 7వ తేదీన నో హాలీడే. అంటే క్రిస్టియన్లయినా కూడా.. గ్రూపులను బట్టి అక్కడ విలువ ఉంటుందన్నమాట..!! నిజానికి, క్రైస్తవ మతంలో అనేక వర్గాలున్నాయి. ఇస్లాంలో షియా – సున్నీ వర్గాలున్నట్టు.. క్రిస్టియానిటీలో పదుల కొద్ది గ్రూపులున్నాయి. వీటిలో ఒక వర్గానికి, మరో వర్గానికి ఎప్పుడూ పొంతన కుదరదు.

ఇక, ఓసారి మన దేశ హాలీడే క్యాలెండర్ ను పరిశీద్దాం..

2011 జనాభా లెక్కల ప్రకారం.. భారత్ లో క్రైస్తవుల జనాభా కేవలం 2.3 శాతం. అయినా, మన హాలీడే క్యాలెండర్ లో గుడ్ ఫ్రైడే వుంటుంది. ఈస్టర్ వుంటుంది. క్రిస్మస్ కూడా వుంటుంది. క్రిస్టియన్లకే కాదు, ముస్లిం, సిక్కు, బౌద్దులు, జైనులు.. ఇలా అన్ని మతాల వారికి.. మన హాలీడే క్యాలెండర్ లో చోటుంటుంది. బ్యాంకు హాలీడేలను పరిగణలోకి తీసుకున్నా.. మన దగ్గర అన్ని మతాలకు చోటుంటుంది. సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. అయినా, భారత్‎ను సెక్యులర్ దేశం అని పిలవడానికి, మన కుహనా లౌకిక లెఫ్ట్ లిబరల్ మేధావులకు నోరు పెకలదు. ఫేక్ సెక్యులర్ కంట్రీలకు బాకాలూదే వారి దృష్టిలో.. అన్ని మతాలను సమానంగా గౌరవించే భారత్ మాత్రం సెక్యులర్ దేశం కాదు..!

నేడు ప్రపంచంలో సెక్యులర్ దేశాలుగా చెలామణి అవుతున్న మెజార్టీ దేశాల్లో.. మతోన్మాద ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి కరుడుగట్టిన క్రిస్టియన్ దేశాలను సెక్యులర్ దేశాలని చెప్పుకోవడం సమజంసమేనా..? 2017లో అమెరికన్ థింక్ ట్యాంక్ PEW రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన ఓ నివేదిక.. అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ.. క్రిస్టియానిటీకి అనుకూలంగా వున్న పశ్చిమ దేశాల సెక్యులర్ ముసుగును తొలగించింది. మిగతా దేశాన్నింకంటే భారత్ మాత్రమే గొప్ప లౌకిక దేశమని ఆ నివేదిక తేల్చి చెప్పింది. క్రిస్టియానిటీ ముసుగు తొడుక్కుని సెక్యులర్ దేశాలని చెప్పుకుంటున్న యూరోపియన్ దేశాలకంటే కూడా భారత్ మెరుగైన లౌకిక రాజ్యంగా గుర్తింపు పొందింది. అయితే, PEW నివేదికను యూరోపియన్, అమెరికా మీడియా కావాలనే తొక్కిపెట్టింది. అయినా, తమకు ప్రతికూలంగా వున్న నివేదికకు పశ్చిమ దేశాల మీడియా ప్రచారం కల్పిస్తుందనుకోవడం పొరపాటే. దీనిని బట్టి పశ్చిమ దేశాలు క్రైస్తవ జాతీయవాదాన్ని ఎంతో తెలివిగా ప్రమోట్ చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయెక్తి లేదు.

యూరప్, అమెరికా దేశాలు ఓవైపు క్రిస్టియన్ జాతీయవాదాన్ని ప్రదర్శిస్తూనే.. సెక్యులర్ రాజ్యాలుగా చెలామణి అవుతున్నా.. కనీసం గుర్తించలేని స్థితిలో మిగతా ప్రపంచ దేశాలున్నాయి. ఇక, మనదేశంలో సదరు సెక్యులర్ దేశాలకు బాకాలూదే కుహనావాదులకు కొదవలేదు. ఇప్పటికైనా మనం అప్రమత్తం కాకపోతే.. ఈ మతోన్మాద దేశాలు.. ప్రపంచానికి క్రైస్తవమే లౌకికవాదం అనే పరిస్థితిని కల్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అసలు లౌకికవాదమంటే ఏమిటి..? అది ఎప్పుడు పుట్టింది..? సెక్యులరిజం భావన వెనుక యూరప్‌లో వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ. 5, 6 శతాబ్దాల నుండి 15, 16 శతాబ్దాల వరకు యూరప్ క్రైస్తవ మతాధిపతుల అధీనంలోని ‘చర్చ్’ అధీనంలో ఉండేది. రాజ్యంపై ‘చర్చ్’కే స ర్వాధికారాలు ఉండేవి. క్రీ.శ. 4వ శతాబ్దికి చెందిన సెయింట్ ఆగస్టియన్‌ను ‘క్రైస్తవ మత రాజనీతి పిత’గా, సిద్ధాంత కర్తగా భావిస్తారు. ఆయన తన రచనలో చెప్పిన ‘ప్రతివారూ చర్చి అధీనంలో ఉండాలి, చర్చే ప్రజలకు సర్వాధికారి, క్రైస్తవుడు కానివాడు భూమిమీద ఉండకూడదు’ అన్న మాటలు నాటి చర్చి ఆధిపత్యం ఎంత ప్రబలంగా ఉండేదే నిరూపిస్తుంది. చర్చ్‌ల పాలనలో దురాగతాలు భరించలేక అనేక తిరుగుబాట్లు వచ్చాయి. 15, 16, 17 శతాబ్దాల్లో అనేకమంది తత్వవేత్తలు, రాజకీయ ఉద్యమకారులు క్రైస్తవ మత పాలన నుండి యూరప్ ఖండాన్ని విడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వాల్టేర్, రూసో, జాన్‌లాక్, థామస్ హబ్స్ వంటివారు అనేక రచనలు చేసారు.

సెక్యులరిజం అనే పదాన్ని మొదటిసారిగా బ్రిటిషు రచయిత ‘జార్జి హోలియోక్’ 1846 లో ఉపయోగించారు. అప్పటినుంచి ఒక`స్వతంత్ర’ ఆలోచనగా దీన్ని అందిపుచ్చుకున్నారు. మతం నుంచి సమాజాన్ని వేరుచేసి, సమాజాభివృద్ధి కొరకు హోలియెక్ ఇచ్చిన సూచనగానే ఈ వాదనను అర్థం చేసుకోవాలి. ఈ వాదనలో ఆయన మతాన్ని విమర్శించడం గానీ లేదా ఘాటైనవ్యాఖ్యలు గానీ చేయలేదు. కానీ, మతాతీతమైన సెక్యులరిజం.. నేడు మతోన్మాదంగా మారిపోయింది.

మన దేశం విషయానికి వస్తే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదమే లేదు. 1976లో ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగానికి 42వ సవరణ చేసి.. రాజ్యాంగ పీఠికలో ఈ పదాన్ని చేర్చారు. మన దేశంలో సెక్యులరిజం పేరుతో వోటుబ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి. అత్యధిక శాతమున్న హిందువుల మనోభావాలు ఈ లౌకికవాద ముసుగుతో దెబ్బతింటున్నాయన్నది కాదనలేని వాస్తవం.

సెక్యులర్ ముద్ర వున్నా.. లేకపోయినా.. భారత్ ఎప్పుడూ లౌకిక భావనను తప్పలేదు. అన్ని మతాలను సమానంగా గౌరవించింది. గౌరవిస్తూనేవుంది. ఇప్పుడు చెప్పండి.. క్రైస్తవం ముసుగేసుకుని సెక్యులర్ రాజ్యాలుగా చెలామణి అవుతున్న సోకాల్డ్ అగ్రదేశాలు లౌకిక దేశాలా..? లేక, అన్ని మతాలను సమానంగా చూసే భారత్ లౌకిక దేశమా..? జస్ట్ ఆస్కింగ్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven − five =

Back to top button