యూ ట్యూబ్ ఛానల్ కు వ్యూస్ రావడం లేదంటూ ఓ విద్యార్థి బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ క్రాంతి నగర్ కాలనీలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి పేరు దీనా అని పోలీసులు గుర్తించారు.
తమిళనాడుకు చెందిన చంద్రశేఖర్, శాంకరి దంపతులు క్రాంతినగర్‌లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ రైల్వేశాఖ ఉద్యోగి. శాంకరి కంచన్‌బాగ్‌లోని కేంద్ర రక్షణ రంగం సంస్థ డీఎంఆర్ఎల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వీరి ఏకైక కుమారుడైన దీనా(23) ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నాలుగేళ్లుగా సెల్ఫ్ ఫ్లో పేరిట యూట్యూబ్ గేమ్ చానల్ నిర్వహిస్తున్నాడు. క్యాంపస్ నుంచి రెండు నెలల క్రితం సెలవులపై దీనా సైదాబాద్‌కు వచ్చాడు. యూట్యూబ్‌లో వ్యూస్ పెరగడం లేదంటూ మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీనా యూట్యూబ్ పేజీలో సూసైడ్ నోట్ పోస్ట్ చేశాడు. జీవితం విలువైనది అన్న అర్థంలో ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నాడు. తాను చిన్నప్పుడే లైంగిక దాడికి గురయ్యానని, తనను ఎవరూ పట్టించుకునే వారు కాదని, తల్లిదండ్రులు కూడా అశ్రద్ధ చేశారని, ప్రేమను పంచలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.