‘భాగ్యనగరం’గా ‘హైదరాబాద్’..!

0
956

ఇస్లామిక్ వలస పాలకులు తారుమారుచేసిన మన చరిత్రను.. నరేంద్ర మోదీ ప్రభుత్వం సరిదిద్దుతోంది. మొఘలులు, సుల్తానులు, నిజాములు మార్చిన నగరాల పేర్లను తొలగించి.. మళ్లీ అసలు పేర్లను పునరుద్ధరిస్తోంది. గతంలో వాజ్‎పేయి ప్రభుత్వం పలు మహా నగరాలపేర్లను మన పూర్వ చరిత్రకు అనుగుణంగా మార్చింది. బొంబాయిని ముంబాయిగా, మద్రాసును చెన్నైగా మార్చారు. అలాగే, కొచ్చిన్‎ను కొచ్చీగా మార్చారు. ఆ తర్వాత 2001 కలకత్తా కోల్‎కతాగా మారింది. అలాగే 2007లో బ్యాంగ్లూర్.. బెంగళూరు అయ్యింది. 90వ దశకం నుంచి ఈ మార్పు కొనసాగుతోంది. ఇక, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి నగరాల పేర్ల మార్పు మరింత వేగం పుంజుకుంది. మ్యాంగళూర్.. మంగళూరుగా,…. రాజమండ్రి.. రాజమహేంద్రవరంగా,…. మైసూర్.. మైసూరుగా,…. అలహాబాద్ ప్రయాగరాజ్‎గా,…. గుర్గాంవ్.. గురుగ్రామ్‎గా మారాయి. ఇలా తారుమారుచేసిన నగరాల పేర్లను సరిదిద్దేందకు మోదీ ప్రభుత్వం పెద్ద పీటవేస్తోంది. ఇప్పుడు ఈ పేర్ల సంస్కణలో హైదరాబాద్ వంతు వచ్చింది. త్వరలోనే హైదరాబాద్‎ను భాగ్యనగరంగా మారుస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

నిజానికి, హైదరాబాద్‎ను భాగ్యనగరంగా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వుంది. ఆరెస్సెస్ వాళ్లు హైదరాబాద్‎ను ఇప్పటికే భాగ్యనగరంగా సంబోధిస్తున్నారు. ఇటీవల ఆరెస్సెస్, బీజేపీలు తన అనుబంధ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి. దీనిపై అధికారిక ప్రకటన చేశాయి. జనవరి 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశానికి సంఘ్ సామాజిక సేవలో స్ఫూర్తి పొందిన వివిధ సంస్థల ముఖ్య కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్‎లో సమావేశ వేదికను ‘భాగ్యనగర్ – తెలంగాణ’ అంటూ స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానుండగా.. హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మార్చడంపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తుది ముద్ర వేస్తాయనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇదే విషయంపై బీజేపీ ఎంపీ, రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ దాన్వేని ప్రశ్నించగా,.. పేరు మార్చడంపై ఎవరికీ అభ్యంతరం ఉండదని అన్నారు. ఒక ప్రదేశం పేరు దాని సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించాలే గానీ.. ఆక్రమణదారులను కాదని స్పష్టంగా చెప్పారు. మన దేశంపై దాడి చేసిన విదేశీయులు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ.. పాత పేర్లను మార్చారని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో, మన భావాలను గౌరవించేలా.. తిరిగి పాత పేర్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. అలా చేయడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నట్టు తెలిపారు.

ఇక, తెలంగాణ బీజేపీ నేత ఎన్వీ సుబాష్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ప్రకటించారు. ‘భాగ్య’ అనేది సంస్కృతి, అభివృద్ధికి చిహ్నం అని.. ఇది మతపరమైన పేరు కాదని తెలిపారు. అంతేకాకుండా గోల్కొండకు గొల్లకొండ అని, హుస్సేన్ సాగర్‌కు వినాయక్ సాగర్ అని పేరు పెడతామని హామీ ఇచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ కూడా హైదరాబాద్ పేరును మార్పుపై సానుకూలంగా స్పందించారు. మొఘల్ సానుభూతిపరులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మన సంస్కృతిని ప్రేమించలేదు కాబట్టే.. మొఘలులు నగరాల పేర్లను వారికి అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. అయోధ్యకు ఫైజాబాద్ అని, ప్రయాగరాజ్‎కు అలహాబాద్ అని ఎందుకు పేరు పెట్టారని ప్రశ్నించారు. ఇవి మాత్రమే కాదు.. దేశంలో మొఘలులు పేర్లను మార్చిన అనేక ప్రదేశాలు దేశంలో ఇంకా వున్నాయని అన్నారు. మొఘలులు భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిని ప్రేమించలేదు అని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలని ప్రశ్నించారు. ఇక హైదరాబాద్ పేరు మార్పుపై స్పందించిన ఆయన.. హైదరాబాద్‌ను చాలా ఏళ్లుగా ప్రజలు ‘భాగ్యనగర్‌’ అని పిలుస్తున్నారని.. అధికారికంగా మార్చడంలో తప్పే లేదని స్పష్టం చేశారు.

భాగ్యనగర్ అనే పేరు యువరాణి భాగమతి పేరు నుండి వచ్చింది. కులీ కుతుబ్ షాతో ఆమె వివాహం జరిగిన తర్వాత, ఆమె పేరుతో నగరాన్ని నిర్మించారు. దానికి మొదట ‘భాగనగర్’గా పేరు పెట్టారు. ఆ తర్వాత అది ‘భాగ్యనగర్’గా స్థరపడింది. అయితే భాగమతిని ఇస్లాంలోకి మార్చిన తర్వాత నగరాన్ని‘హైదర్ మహల్‌’గా మార్చారు. అది ఆ తర్వాత ‘హైదరాబాద్’ మారింది.

2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలకు వారి చారిత్రక నేపథ్యాల గురించి మరింత అవగాహన పెరిగింది. చాలా నగరాల పేర్లును మన పూర్వీకుల పేర్ల నుంచి ఆక్రమణదారులు, అణచివేతదారులు తమకు అనుగుణంగా మార్చుకున్నారని ప్రజలు గ్రహించారు. దీంతో నగరాల పేర్ల మార్పు డిమాండ్ పెరిగింది. ఇది వివిధ నగరాల పేర్లను మార్చడానికి దారితీసింది. ఇంకా మరికొన్నింటిని మార్చే ప్రతిపాదనలు సిద్ధంగావున్నాయి.

అయితే, పేరులో ఏముందంటూ కొందరు కుహనా లౌకిక మేథావులు వితండవాదం చేస్తుంటారు. కానీ, పేరులోనే అంతావుంది. మన సంస్కృతి వుంది. సంప్రదాయం వుంది. నీతి, నిజాయితీ వుంది. షేక్స్‎పియర్ మాటల్లో చెప్పాలంటే.. సంస్కృతి, చరిత్ర, భవిష్యత్తు లక్ష్యాలు, నాగరికత విలువ ఇంకా మరెన్నో. అందుకే, నగరాల పేర్లు మన సంస్కృతి ప్రతిబింబిచేలా వుండాలి. నిజానికి, ఆక్రమణదారులు, వలసపాలకులు వచ్చేవరకు మన భారతీయ నగరాల పేర్లు అలాగే వుండేవి. అందుకే, ఇప్పుడు పేర్ల మార్పు డిమాండ్ పెరుగుతోంది. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో వుంచుకుని.. భారతీయ సనాతన చరిత్రను పరిగణలోకి తీసుకుని.. నగరాల పేర్లను యుద్ధ ప్రాతిపదికన మార్చాల్సిన అవసరం వుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × 5 =