More

    పాకిస్థాన్ నుండి విడుదలైన ప్రశాంత్.. సంచలన విషయాలు వెల్లడి

    హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ రెండు సంవత్సరాల కిందట పాకిస్థాన్ లో కనిపించిన సంగతి తెలిసిందే..! ఎటువంటి అనుమతులు లేకుండా అతడు పాకిస్థాన్ లోకి వెళ్లడంతో అక్కడి బహవాల్ పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుండి పాకిస్థాన్ లోనే ఉన్న 31 సంవత్సరాల వైందం ప్రశాంత్ ను అటారీ-వాఘా సరిహద్దులో భారత్ కు అప్పగించారు.

    టెకీ అయిన ప్రశాంత్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతు వరి లాల్ లు పంజాబ్ ప్రావిన్స్ లోని బహవాల్ పూర్ పరిధిలోని ఎడారి ప్రాంతంలో నవంబర్ 14, 2019న అక్కడి పోలీసుల కంటబడ్డారు. అక్రమంగా పాకిస్థాన్ లోకి చొరబడ్డారనే అభియోగాలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ దగ్గర వీసా, పాస్ పోర్టు వంటివి ఏవీ లేకపోవడంతో అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకానొక దశలో అతడు గూఢచారి అయి ఉంటారని కూడా పాకిస్థాన్ పోలీసులు భావించారు. అతడిని అన్ని విధాలుగా కూడా విచారించారు. అప్పట్లో అతడు పాకిస్థాన్ లో నుండి తెలుగులో మాట్లాడిన వీడియో రిలీజ్ చేశారు. వైందం ప్రశాంత్ తన ఆన్ లైన్ గర్ల్ ఫ్రెండ్ ను కలుసుకోడానికి పాకిస్థాన్ లోకి వెళ్లాడని తెలిసింది.

    2017 నాటికి ప్రశాంత్ మాదాపూర్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ప్రశాంత్ పనిచేసేవాడు. 2017, ఏప్రిల్ 11న ఉదయం ఆఫీసుకు వెళ్లిన వాడు తిరిగి రాలేదు. రెండు మూడు రోజులు వెతికి చూసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రశాంత్ తల్లిదండ్రులు. ప్రశాంత్ మిస్సింగ్ అయినట్లుగా ఏప్రిల్ 11న మాదాపూర్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతుండగా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చినట్టు ప్రశాంత్ చెప్పాడని పాక్ పోలీసులు చెప్పారు. వారు సరిహద్దు నుంచి చెప్పుకోదగ్గ దూరం వచ్చేశారనీ, చొలిస్తాన్ ఎడారిలో తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఎటువంటి తీవ్రవాద ఆరోపణలూ లేవని కొద్దిరోజులకు పోలీసులు భావించారు. పాకిస్తాన్ కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ 1952లోని సెక్షన్ 3, 4 కింద ప్రశాంత్ పై కేసు నమోదైంది. సరైన వీసా, పాస్‌పోర్ట్ లేని భారత పౌరులు పాకిస్తాన్‌లోకి ప్రవేశించడం నేరమని ఈ సెక్షన్ చెబుతోంది. ఈ కేసుపై పాకిస్తాన్లో 2019 నవంబర్ 14న ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

    పాకిస్థాన్ లో తన కొడుకు ఉన్నాడని తెలుసుకున్న ప్రశాంత్ తండ్రి బాబూ రావు.. అతడిని భారత్ కు తీసుకుని వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ప్రశాంత్ తండ్రి బాబూరావు విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. కుమారులు ఉద్యోగ రీత్యా హైదారాబాద్‌లో స్థిరపడడంతో, విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ప్రశాంత్ 2010 తరువాత బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం రావడంతో అక్కడికి వచ్చేశాడు.

    బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు తన సహోద్యోగి, మధ్యప్రదేశ్ కి చెందిన అమ్మాయితో ప్రశాంత్‌ ప్రేమలో ఉన్నాడని.. ఆ విషయం ఇంట్లో చెప్పడంతో అభ్యంతరం లేదని కుటుంబ సభ్యులు చెప్పారట. ఆ అమ్మాయి స్విట్జర్లాండుకు వెళ్లిపోవడంతో ప్రశాంత్ ఆమెను కలుసుకోడానికి వెళ్లిపోయారని అనుకున్నారు. కానీ పాకిస్థాన్ లో కనపడుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఎలాగైనా తన కొడుకును భారతదేశానికి తీసుకుని రావాలని ప్రయత్నించాడు. ఎట్టకేలకు భారత్ కు చేరుకున్నాడు. వాఘా సరిహద్దులో భారత్ అధికారులకు ప్రశాంత్‌ను అప్పగించారు.

    ప్రెస్ మీట్ లో ఎన్నో విషయాలు:

    ప్రశాంత్ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడాడు. తాను ఇంత త్వరగా ఇంటికి చేరుతానని అనుకోలేదని టెక్కీ ప్రశాంత్ చెప్పాడు. ప్రేమలో పడ్డం వలన ఆలోచించకుండా వెళ్లిపోయానని అది చాలా పర్సనల్ విషయం అని తెలిపాడు. తనతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడ పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారన్నాడు. నెల రోజుల్లోనే తనను విడుదల చేస్తారని భావించానని.. అదే సమయంలో తాను వీడియోను రికార్డు చేసి విడుదల చేశానన్నాడు. ఆ వీడియో ద్వారా తాను ఎక్కడ ఉన్నానో తన పేరేంట్స్ కు తెలిసిందని.. తాను తన తల్లి చెప్పినా వినకుండా స్విట్జర్లాండ్ బయలుదేరానని.. పేరేంట్స్ మాటలను వినాలని కోరాడు. తాను పాకిస్తాన్ చేరుకొన్న సమయంలో తనకు హిందీ సరిగా రాదన్నారు. పాకిస్తాన్ లో ఇండియన్ ఖైదీలందరిని ఒకే బ్లాక్ లో ఉంచుతారని చెప్పాడు. తల్లి మాట వినకుండా వెళ్లినందుకు చాలా బాధపడుతూ ఉన్నానని.. ఇలా వెళ్ళినందుకు తన జీవితంలో కొంచెం సమయం వృధా అయిందని అన్నాడు. గూగుల్ మ్యాప్స్ లో చూశానని.. 60 రోజుల్లో నడుచుకుని స్విజర్లాండ్ వెళ్లాలని భావించానని.. అది గూగుల్ మ్యాప్ లో కూడా ఉందని అన్నాడు. సివిల్ కోర్టుకు తనను ఇచ్చినప్పుడే వీడియో రికార్డు చేయడం జరిగిందని చెప్పాడు. పాకిస్థాన్ ప్రభుత్వం చెడ్డదో కాదో తెలియదు కానీ.. మనుషులు మాత్రం మంచోళ్ళే అని చెప్పారు. చాలా మంది పోలీసులు వాళ్లు తినడానికి తెచ్చుకున్న పదార్థాలను కూడా ఇచ్చేవారని అన్నాడు. లాహోర్ లోని జైలులో తనను ఉంచారని కూడా వెల్లడించాడు. తాను తిరిగి ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నానని ప్రశాంత్ తెలిపాడు.

    Trending Stories

    Related Stories