More

    బాధ్యత ఉండక్కరలేదా.. బేబీ సినిమాకు పోలీసుల క్లాస్

    టాలీవుడ్ లో ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ‘బేబీ’. ఈ సినిమాకు ప్రశంసలతో పాటూ.. విమర్శలు కూడా బాగానే వచ్చాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తీ చేసుకుంది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ట్రయాంగిల్ లవ్ స్టోరీని చూపించారు. అయితే ఈ సినిమాలో పలు సన్నివేశాల్లో మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం వంటివి ఉన్నాయి.

    ఈ సన్నివేశాలపై తెలంగాణ పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ సినిమాలోని పలు సీన్లపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బేబీ సినిమాలో డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా సన్నివేశాలున్నాయని అన్నారు. తాము గతంలో ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్‍‌లో రైడ్ చేసిన సన్నివేశాల్లాగానే ఈ సినిమాలో కూడా సన్నివేశాలున్నాయని సీపీ తెలిపారు. బేబీ మూవీ బృందానికి నోటీసులు జారీ చేయనున్నట్టు సీవీ ఆనంద్ తెలిపారు. ఇక నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. బేబీ సినిమాలో పలు సన్నివేశాల్లో హీరోయిన్ స్నేహితులు జాయింట్స్ కొడుతుండటం, డ్రగ్స్ వాడుతున్నట్టుగా చూపించారు. ఈ సన్నివేశాలు యూత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని సీపీ అన్నారు. ఇలాంటివి తీసే ముందు సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. బేబీ సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారని అన్నారు సీవీ ఆనంద్. మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారన్నారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తామని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా పెడతామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని అన్నారు. బేబీ చిత్రంలోని అభ్యంతరకర సీన్లుగా చెబుతున్నవాటిని మీడియాకు చూపించారు.

    వెంటనే బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు. బేబీ సినిమాపై పోలీసులు అడ్వైజరీ నోటీస్ ఇచ్చారని చెప్పారు. ‘బేబీ’ సినిమాలో ఒక సన్నివేశం గురించి పోలీసులు ఆరా తీశారని, డ్రగ్స్ సన్నివేశాలపై వివరణ అడిగారని వెల్లడించారు. కథలో భాగంగానే ఆ సన్నివేశాలను సినిమాలో పెట్టాల్సి వచ్చిందని దర్శకుడు సాయిరాజేష్ వివరించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని పోలీసులు కోరారని తెలిపారు. బేబి సినిమాలో కథానుసారం రెండు పాత్రల మధ్య డ్రగ్ తీసుకున్న సన్నివేశాలు ఉన్నాయన్నారు సాయి రాజేష్. అయితే వాటిని థియేటర్, ఓటీటీ లో ప్రదర్శించినప్పుడు చట్టబద్ధమైన హెచ్చరిక ఇచ్చామని చెప్పారు. యూట్యూబ్ కు సెన్సార్ ఉండకపోవడంతో ఆడియో కంపెనీలు పాటలు ప్లే చేసినప్పుడు ఆ సూచన చేయలేదని సాయి రాజేశ్ చెప్పారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి ఫోన్ కాల్, అడ్వైజరీ నోటీస్ మాత్రమే వచ్చిందన్నారు. యూట్యూబ్ లో మాత్రమే డ్రగ్ సీన్ కు హెచ్చరిక వేయలేదనే విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చామని సాయి రాజేశ్ అన్నారు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దంటూ తన తరుపున, బేబీ టీమ్ తరుపున కోరుతున్నట్లు సాయి రాజేష్ వివరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

    Related Stories