ఖుదా హఫీస్-2 సినిమాపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు

0
774

బాలీవుడ్ సినిమా ఖుదా హఫీస్ 2 వివాదంలో చిక్కుకుంది. విద్యుత్ జమ్వాల్ నటించిన ‘ఖుదా హాఫీస్ 2’ విడుదలకు ముందు, హైదరాబాద్‌లోని ఏసీపీ మీర్ చౌక్, దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో దర్శకుడు ఫరూక్ కబీర్‌పై పోలీసు ఫిర్యాదు నమోదైంది. షియా ముస్లింల మత మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ ఫిర్యాదు దాఖలైంది. ఫిర్యాదుదారుల ప్రకారం, ఖుదా హాఫీస్ 2లోని ‘హక్ హుస్సేన్’ అనే పాట షియా సమాజాన్ని, ముహర్రం ఊరేగింపును హింసాత్మకంగా.. చెడుగా చూపుతోందని ఫిర్యాదుదారులు అన్నారు. పవిత్ర ఆచారాన్ని అపహాస్యం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పాటను చిత్రం నుండి తొలగించాలని కోరారు. పాటను పూర్తిగా తొలగించకపోతే ఖుదా హాఫీజ్ 2 చిత్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనను దిగబోతున్నామన్నారు.

మీర్ చౌక్ పోలీసు స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు. వెంటనే వీడియో సాంగ్ ను మూవీ నుండి తొలగించకుంటే దేశ వ్యాప్త నిరసనలు చేస్తామని హెచ్చరించారు. సాంగ్ లో మాతం నిర్వహించే సమయంలో కత్తులతో హింస ప్రేరేపించే విధంగా చిత్రీకరించారంటూ షియా మత పెద్దలు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ పాటను వెంటనే తొలగించాలన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు.

విద్యుత్ జమ్వాల్, శివలీకా ఒబెరాయ్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఫరూక్ కబీర్ దర్శకత్వంలో ‘ఖుదా హఫీస్ 2’ మూవీ తెరకెక్కింది. జులై 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖుదా హఫీజ్: చాప్టర్ II అగ్ని పరీక్ష ప్రమోషన్ కోసం ఫరూక్ కబీర్‌తో కలిసి విద్యుత్ జమ్వాల్ శనివారం హైదరాబాద్ కు వచ్చారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. ఈ సినిమాలో శివలీకా ఒబెరాయ్, అస్రార్ ఖాన్, డానిష్ హుస్సేన్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు.