భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అన్ని విషయాల్లోనూ పోలీసులు అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తులను కూడా నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
తాజాగా ఓల్డ్ సిటీకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ మజీద్ అత్తార్ అనే వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్ లో భారత ప్రధాని, కేంద్ర హోం మంత్రిని తల నరికి చంపేస్తానని బెదిరిస్తూ పోస్ట్ పెట్టాడు. దీంతో మోఘల్‌పురా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇంక్విలాబ్-ఎ-మిల్లత్ నాయకుడు అబ్దుల్ మాజిద్ అత్తార్‌పై సుమో-మోటో చర్య తీసుకున్నారు పోలీసులు. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న బి ముఖేష్ వర్ధన్, అత్తార్ ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్టుపై ఫిర్యాదు చేశారు. ఆ పోస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోలు కూడా ఉన్నాయి. దైవదూషణకు బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని మాజిద్ డిమాండ్ చేశాడు. లేకపోతే నిరసనలకు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చాడు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు, మతపరమైన కారణాలతో రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను పెంపొందించేందుకే అత్తార్ సందేశాన్ని పోస్ట్ చేశారని పోలీసులు ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు IPC సెక్షన్లు 153A,295-A,504,505(2),506-II సెక్షన్ల కింద నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కొద్ది గంటల్లోనే అతడిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.