హైదరాబాదులోని దోమలగూడ ప్రాంతంలో ఉండే ఇందిరా పార్క్ లో అన్ని వయసుల వాళ్లు కూడా వస్తూ ఉంటారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పార్కు తెరిచి ఉంటుంది. తాజాగా ఇందిరా పార్క్ వద్ద కనిపించిన ఓ బ్యానర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. “పెళ్లి కాని జంటలకు పార్కులో ప్రవేశం లేదు.. ఇట్లు… పార్క్ మేనేజ్ మెంట్” అని ఆ బ్యానర్లో స్పష్టం చేశారు. కొందరు దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పెళ్లి కాని జంటలు హద్దులు దాటి వ్యవహరిస్తూ ఉండడంతో ఇలా సరికొత్త నిబంధనలు తీసుకుని వచ్చారేమోనని పలువురు భావించారు.
కొందరు సంఘ సంస్కర్తలు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మిని ట్యాగ్ చేస్తూ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పార్కులో ప్రవేశానికి పెళ్లిని అర్హతగా నిర్దేశించకూడదని.. పబ్లిక్ పార్క్ అంటే అందరికీ ప్రవేశం ఉంటుందని చెప్పుకొచ్చారు. బ్యానర్ పై అభ్యంతరాలు రావడంతో జీహెచ్ఎంసీ వెంటనే స్పందించి ఇందిరా పార్క్ వద్ద ఆ బ్యానర్ ను తొలగించింది. పార్క్ ను క్రమం తప్పకుండా సందర్శించాలని, ఉద్యానవనంలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు
జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ B శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “అటువంటి బ్యానర్ ఉందని తమకు ఇప్పుడే తెలియజేయబడింది, దానిని మేము తొలగించాము. బ్యానర్‌ను కింది స్థాయి అధికారులు ఉంచారు. మాకు దాని గురించి సమాచారం లేదు. మా దృష్టికి వచ్చినప్పుడు మేము దానిని వెంటనే తొలగించాము. ” అని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని మరియు అనుమతి లేకుండా బ్యానర్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పార్కుల్లో హద్దులు మీరి ప్రవర్తించే యువతకు సంబంధించిన వీడియోలు చాలా సార్లు బయటకు వచ్చాయి. వాలెంటైన్స్ డే లాంటి సమయంలో యువ జంటలు చేసే రచ్చ గురించి కూడా ఎప్పుడూ చర్చిస్తూనే ఉంటారు. పాశ్చాత్త్య సంస్కృతి మాయలో పడిన యువత ఎంతగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మన పార్కుల్లో కనపడుతుందని ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.