హైదరాబాద్ నగరం గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ కార్యాలయం ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సర్దార్‌ఖాన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో కాంట్రాక్టు ఉద్యోగి సురేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. సెక్యూరిటీ గార్డు, కాంట్రాక్టు ఉద్యోగికి మధ్య పరస్పర వాగ్వాదం జరగడంతో విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్.. కాంట్రాక్టు ఉద్యోగి పైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సర్దార్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రక్షణగా ఉండాల్సిన సెక్యూరిటీ గార్డ్ సర్దార్ ఖాన్ ఏకంగా రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో ప్రజలంతా షాక్ కు గురయ్యారు. గన్‌ఫౌండ్రీ ఎస్.బి.ఐ. ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు సర్దార్ ఖాన్ తన సహోద్యోగిపై కాల్పులు జరిపాడని.. ఈఘటనలో కాంట్రాక్ట్ ఉద్యోగి సురేందర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని బ్యాంకు అధికారి మీడియాకు తెలిపారు. గాయపడిన వ్యక్తిని బ్యాంక్ సిబ్బంది, స్థానికుల సాయంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన సర్దార్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రద్దీగా ఉండే గన్‌ఫౌండ్రీ బ్రాంచ్ లో గన్ పేలగానే జనం ఉలిక్కిపడ్డారు. బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు అంతా భయభ్రాంతులకు గురయ్యారు.
