ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే..! దీనిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అక్కడ చిక్కుకున్న పలువురు భారతీయులను భారత్ కు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఆపరేషన్ గంగను వేగవంతం చేయడానికి ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. నలుగురు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి, భారతీయుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించనున్నారు. హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు, వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16,000 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారతీయులు ఉండగా, వారిలో ఇప్పటికే 4 వేల మంది భారత్‌కు తిరిగి వచ్చారు. మిగిలిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అలాంటి సమయంలో ఓ వివాహం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హైదరాబాదీ యువకుడు ఉక్రెయిన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్‌కి ఉక్రెయిన్‌కు చెందిన లియుబోవ్‌తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తమ జీవితాంతం కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు. అందుకే పెళ్లి కూడా చేసుకున్నారు. లియుబోవ్ హైదరాబాద్ చేరుకుని వివాహ పనుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ప్రతీక్, లియుబోవ్ ఉక్రెయిన్‌లో వివాహం చేసుకున్నారు. రిసెప్షన్‌ను నిర్వహించడానికి భారతదేశానికి వచ్చారు. వారు భారత్ లో దిగిన ఒక రోజు తర్వాత యుద్ధం ప్రారంభమైంది. మల్లికార్జునరావు, పద్మజ దంపతుల కుమారుడు వరుడు ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో పూర్వ విద్యార్థి.
వరుడిని ఆశీర్వదించేందుకు చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి హైదరాబాద్ చేరుకున్నారు. యుద్ధం ముగియాలని ప్రార్థిస్తూ, ఆయన ఒక జంటను ఆశీర్వదించారు. రష్యా దురాక్రమణను అంతం చేయాలని కోరుతూ ఇప్పటికే ఆలయంలో ప్రార్థనలు నిర్వహించామన్నారు.