ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న హైదరాబాద్ యువతులు.. అధికారులను కిషన్ రెడ్డి అప్రమత్తం చేయడంతో

0
730

ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా చోటు చేసుకున్న ఘటనల కారణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 16 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. మూడ‌వ రోజు కూడా రాష్ట్ర‌వ్యాప్తంగా భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇల్లు, బ్రిడ్జ్‌లు ధ్వంసం అయ్యాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 16 మంది మృతిచెందార‌ని అధికారులు తెలిపారు. చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక రెస్క్యూ ఆప‌రేష‌న్ కోసం ఆర్మీ హెలికాప్ట‌ర్ల‌ను రంగంలోకి దింపిన‌ట్లు ఆ రాష్ట్ర సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి తెలిపారు. ఉత్త‌రాఖండ్‌లో నెల‌కొన్న ప‌రిస్థితిపై ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు స‌మీక్షించారు. రాత్రి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌ర్షం త‌గ్గుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ చెప్పింది.

ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాల కారణంగా పలువురు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అధికారులు సోమవారం నుండే మూసివేశారు. ఓ నలుగురు హైదరాబాద్ యువతులు ఇక్కడి వరదల్లో చిక్కుకున్నారు. వారు ఉంటున్న భవనాన్ని వరద చుట్టుముట్టడంతో వారు భవనంపైకి చేరారు. గత మూడ్రోజులుగా వారు భవనంపైనే ఉంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి, అధికారులను అప్రమత్తం చేశారు. కిషన్ రెడ్డి బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మంత్రి ఆదేశాలతో రెస్క్యూ బృందం ఎంతో శ్రమించి ఆ నలుగురు హైదరాబాద్ యువతులను కాపాడింది. అనంతరం వారిని ఢిల్లీకి తరలించారు. కిషన్ రెడ్డికి యువతుల కుటుంబాలు ధన్యవాదాలు తెలిపాయి.