ఫార్ములా రేసింగ్ పోటీలకు హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ముస్తాబైంది. రెండ్రోజుల పాటు జరిగే ఇండియన్ రేస్ లీగ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ట్రాక్ టెస్టింగ్, గ్యాలరీ, సేఫ్టీ బారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఆరు జట్లు.. 24 మంది రేసర్లు పాల్గొనే ఈ ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన నూతనంగా రూపొందించిన స్ట్రీట్ సర్క్యూట్‌పై ఫార్ములా రేసింగ్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. అట్టహాసంగా ప్రారంభమవుతున్న ఈ పోటీలను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఈ ఇండియన్ రేసింగ్ లీగ్‌ను నిర్వహిస్తోంది. ఐఆర్‌ఎల్ పోటీలు ఫార్ములా రేసింగ్‌లోని ఎఫ్-3 స్థాయివి. ఇందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సహా ఆరు జట్లు తలపడుతున్నాయి. మొత్తం ఆరు జట్ల నుంచి 12 కార్లు, 24 మంది డ్రైవర్లు బరిలో ఉంటారు. ఇప్పటికే ఇటలీకి చెందిన 14మంది సభ్యుల బృందం నగరానికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించింది.
300 కిలోమీటర్ల వేగంతో రేసింగ్ కార్లు దూసుకుపోయేందుకు ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఫార్ములా–1 రేసింగ్ ట్రాక్‌లాగా కాకుండా బ్లాక్ టాపింగ్ రోడ్లను రేస్ లీగ్ కోసం ఏర్పాటు చేశారు. మూడు వారాల వ్యవధిలో రెండు రేసుల ద్వారా ట్రాక్ టెస్టింగ్ చేసి.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఫార్ములా-ఈ రేసు కోసం సిద్ధమవుతున్న ట్రాక్‌నే ఈ పోటీలకు ఉపయోగిస్తున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఫార్ములా ఈ ఛాంపియన్ షిప్ పోటీలతో హైదరాబాద్ విశ్వనగరాల జాబితాలో చేరింది. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీలకు అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్ కేంద్రంగా రేసింగ్ పోటీలను నిర్వహించేందుకు ఎంపిక చేశారు. దీంతో లండన్, ప్యారిస్, మొనాకో, బెర్లిన్ నగరాల్లోని రేస్ సర్క్యూట్ తరహాలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ రేసింగ్ ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఈవీ టెక్నాలజీపై అవగాహన పెంచేందుకు ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు కీలకంగా మారుతుందని నిర్వాహకులు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ రేస్ లీగ్ పోటీల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ రేస్‌ల కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లస్ రోడ్డు, లుంబినీ పార్కు వరకు మూసివేశారు. రేసింగ్ జరిగే స్ట్రీట్ సర్క్యూట్ రూట్ చుట్టూ పట్టిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రేస్ పోటీలను చూసేందుకు వచ్చే ప్రేక్షకులతో పాటు సింగిల్ సీటింగ్ డ్రైవింగ్ విధానంలో జరిగే రేసర్ల సేఫ్టీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు.