జులై రెండు, మూడు తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ విధించడంతో పాటు నో ఫ్లయింగ్ జోన్స్‌ను ప్రకటించారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి జులై 4న సాయంత్రం ఆరు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్ పరిధిలోని పరేడ్‌గ్రౌండ్స్, రాజ్‌భవన్, పరిసరాలతోపాటు సైబరాబాద్ పరిధిలోని నొవాటెల్ వరకు ఫ్లయింగ్ జోన్‌ను ప్రకటించారు. డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌పై నిషేధం విధించారు. ఆంక్షలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన దృష్ట్యా గచ్చిబౌలిలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు 5 కిలోమీటర్ల పరిధిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 అమలులో ఉంటుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో శాంతిభద్రతలకు విఘాతం, ప్రజాశాంతి భంగం కలిగించే అవకాశం ఉందని, అలాంటి పరికరాల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు.