వెనక్కు తగ్గని తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికులు

0
784

తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికులు సమ్మె బాట పట్టారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వివిధ కార్మిక సంఘాలు సమ్మె ప్రతిపాదన చేశాయి. నిర్మాతల మండలి, ఇతర సంఘాలు కార్మికులతో నిన్న జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో నేడు హైదరాబాదు జూబ్లీహిల్స్ పరిధిలో వెంకటగిరిలో ఉన్న ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని సినీ కార్మికులు ముట్టడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ యూనియన్లకు చెందిన కార్మికులు భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లకు సంబంధించిన నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. గత నాలుగేళ్లుగా పెంచాల్సిన వేతనాలు పెంచడంలేదని.. ఇంటి అద్దెలు, నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయని, చాలీచాలని వేతనాలతో ఇబ్బందులపాలవుతున్నామని కార్మికులు వెల్లడించారు. తమ వేతనాలు పెంచాల్సిందేనని వారు పట్టుబట్టారు. సినీ కార్మికుల నిరసన నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

హైదరాబాద్‌లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్‌లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్దకు చేరకున్న సినీ కార్మికులు.. 30 శాతం వేతనాలు పెంచాలని కోరుతున్నారు. నాలుగేళ్ళుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని, దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. వేతనాల పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తమ చేతుల్లో ఏమి లేదని ఫెడరేషన్‌ కార్యవర్గ సభ్యులు ఫిల్మ్‌ చాంబర్‌, నిర్మాత మండలిని హెచ్చరించారు.