హైదరాబాద్, అహ్మదాబాద్ లో ముస్లింలు ఎక్కువ.. పాక్ జట్టుకే సపోర్ట్ ఇస్తారట

0
151

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ కోసం భారతదేశానికి చేరుకుంది. సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌లో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 27 రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పాకిస్థాన్ టీమ్ చేరుకుంది. అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో హోటల్‌కు చేరుకున్నారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌కు ఏడేళ్ల తర్వాత వచ్చింది. ఇక పాకిస్థాన్ జట్టుకు భారత్ లో ఏ మాత్రం సపోర్ట్ ఉండదనే విషయం తెలిసిందే!! ఈ విషయంపై పాక్ క్రికెటర్లలో ఆందోళన కూడా మొదలైంది.

అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మాత్రం కొత్త విషయాలు చెబుతున్నారు. ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అహ్మదాబాద్ లాంటి నగరాల్లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ అని.. పాకిస్తాన్ కు తప్పకుండా మద్దతు లభిస్తుందని అన్నారు. భారత్‌లో జరగనున్న ICC క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లకు సంబంధించి పాక్ క్రికెట్ జట్టుకు ముస్లింల మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. పాకిస్థాన్ వార్తా ఛానెల్ సమా టీవీలో చర్చా కార్యక్రమంలో ప్యానలిస్ట్‌గా ఉన్న ముస్తాక్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. “పాకిస్తానీ జట్టు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉందని.. త్వరలో అహ్మదాబాద్‌కు వెళ్లబోతోంది.. స్థానిక అభిమానుల మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది.. ఇది పాక్ జట్టుకు మంచి సంకేతం.” అని ముస్తాక్ అహ్మద్ చెప్పుకొచ్చారు.

ఇదే షోలో యాంకర్ మాట్లాడుతూ.. పాక్ క్రికెట్ జట్టు భారతదేశానికి చేరుకుందని, భారతదేశంలో అడుగుపెట్టగానే విమానాశ్రయం వెలుపల, హైదరాబాద్‌లోని హోటల్ లో కూడా ఘన స్వాగతం లభించిందని చెప్పారు. భారత్‌లోని క్రికెట్ అభిమానులు పాకిస్థాన్ క్రికెట్ జట్టును ప్రేమిస్తున్నారని.. వారి రాక కోసం ఎదురుచూశారన్నారు. పదేపదే బాబర్ ఆజం, హారిస్ రౌఫ్‌ అంటూ ప్రేమగా పిలిచారని కూడా స్పష్టంగా తెలుస్తోందన్నారు. అయితే స్వాగతం పలకడం వేరు.. క్రికెట్ గ్రౌండ్ లోకి వచ్చి పాకిస్తాన్ జట్టును ఎంకరేజ్ చేయడం వేరంటూ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మిగిలిన ప్యానలిస్టులు తెలిపారు. ఇక అహ్మదాబాద్ లో భారత్-పాకిస్థాన్ ప్రపంచ కప్ మ్యాచ్ జరిగే సమయంలో పాక్ ను ఎంకరేజ్ చేసే వారు అతి తక్కువ మాత్రమే ఉంటారనే విషయాన్ని ఆటగాళ్లు గుర్తుంచుకోవాలని ఇప్పటికే ఎంతో మంది పాక్ మాజీ ఆటగాళ్లు సూచించారు.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 29న పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మ్యాచ్‌కు ముందుగానే టిక్కెట్లను విక్రయించింది. అయితే గణేశ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ఉండడంతో మ్యాచ్ కు తగిన భద్రత కల్పించడం సాధ్యం కాదని హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు తేల్చి చెప్పారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టిక్కెట్లను రీఫండ్ చేస్తోంది. అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియంలో వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు. దాదాపు 15 రోజుల పాటు పాక్ జట్టు హైదరాబాద్‌లోనే ఉండనుంది. పాకిస్థాన్ రెండో వార్మప్ మ్యాచ్‌ అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో ఆడనుంది.