హైబ్రిడ్ ఉగ్రవాదిని పట్టుకున్న భద్రతా బలగాలు

0
844

శనివారం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ అధికారులు బారాముల్లా ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) కు సంబంధించిన హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. తిల్గామ్ పయీన్ నివాసి మొహమ్మద్ ఇక్బాల్ భట్‌ను ఉగ్రవాదిగా గుర్తించారు. బారాముల్లాలోని క్రీరీ ప్రాంతంలోని చెక్‌పాయింట్‌లో అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు, ఆర్మీ అధికారుల జాయింట్ పార్టీలు క్రీరి వద్ద నాకాబందీని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా తనిఖీలు చేపట్టగా.. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) గ్రూపుకు చెందిన ఒక హైబ్రిడ్ ఉగ్రవాది ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.

హైబ్రిడ్ ఉగ్రవాది వద్ద ఏడు రౌండ్ల తూటాలు, మందుగుండు సామగ్రి, పిస్టల్ మ్యాగజైన్, ఇతర నేరారోపణ వస్తువులు కూడా ఉన్నట్లు గుర్తించారు. పాకిస్థానీ ఉగ్రవాదులు సైఫుల్లా, అబు జరార్‌లతో పరిచయం ఉన్న ఈ ఉగ్రవాది తీవ్రవాద చర్యలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో చురుకుగా పాల్గొంటున్నాడని అధికారులు తెలిపారు. హైబ్రిడ్ టెర్రరిస్ట్‌ని విజయవంతంగా పట్టుకోవడంతో ఉగ్రవాదుల ప్లాన్ లను తెలుసుకోనున్నారు అధికారులు.