హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ మొదలైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించడం మొదలుపెట్టారు. కౌంటింగ్ లో భాగంగా ఒక్కోరౌండులో 9 వేల నుంచి 11 వేల ఓట్లు లెక్కించనున్నారు. ఒక్కోరౌండులో 14 ఈవీఎంలు ఉంటాయి.
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల ప్రారంభమైంది. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియనుంది. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.
పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం సొంతం చేసుకుంది. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్‌కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి. ఇక మొదటి రౌండ్ లో మాత్రం భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. ఈటల రాజేందర్‌కు 4,610 ఓట్లు పోలవ్వగా, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్‌కు 119 ఓట్లు పోలయ్యాయి.