జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కేంద్రం మరో ముందడుగు వేసింది. కశ్మీర్ లోయలో అరాచకాలు సృష్టించిన హురియత్ కాన్ఫరెన్స్ కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని NIA తాజాగా సీజ్ చేసింది. శ్రీ నగర్, రాజ్ బాగ్ ప్రాంతంలోని ఈ కార్యాలయాన్ని జప్తు చేసి నోటీసు అంటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం UAPA నిబంధనల ప్రకారం ఢిల్లీ కోర్టు ఈ కార్యాలయ జప్తుకు ఆదేశించింది. ఈ కార్యాలయానికి యజమాని అయిన Nayeem అహ్మద్ ఖాన్ ఢిల్లీ కోర్టులో దేశ ద్రోహ విచారణ ను ఎదుర్కొంటున్నారనీ,.. అందుకే ఇతడికి చెందిన కార్యాలయాలను జప్తు చేయాలని ఢిల్లీ కోర్టు తెలిపింది. దీంతో ఎన్ఐఏ అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమిస్తూ సీజ్ చేశారు.
హురియత్ కాన్ఫరెన్స్ అనే సంస్థ 1993 లో ఏర్పడింది. దాదాపు 26 రాజకీయ పార్టీలు, పలు ఉగ్రవాద సంస్థలకు అనుసంధాన కర్తగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అన్ని సంస్థలకు ఉమ్మడిగా హురియత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు అవడంతో ఆయా సంస్థల నుంచి పలువురు ప్రతినిధులుగా ఉండి దీన్ని నడిపించేవారు. ఏడుగురు ప్రతినిధులతో ఏర్పడిన ఈ సంస్థలో యాసిన్ మాలిక్ లాంటి నరరూప రాక్షసుడు కూడా ప్రతినిధిగా ఉన్నాడు. JKLF నేతగా ఉన్న యాసిన్ మాలిక్ 1990 కశ్మీర్ మారణ హోమంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఏర్పాటైన హురియత్ కాన్ఫరెన్స్ లో సభ్యుడిగా ఉండి లోయలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాడు. ఈ హురియత్ కాన్ఫరెన్స్ పాకిస్తాన్ ఆదేశాలతో పనిచేసేది. ఉగ్రవాద దేశం నుంచి నిధులను పొంది లోయలో అరాచకాలకు పాల్పడేది.
కశ్మీర్ ప్రజల్లో భారత వ్యతిరేక భావజాలం పెంచి పోషించే విధంగా ఈ సంస్థ పనిచేసింది. పూర్తి పాక్ అనుకూల భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళింది. భారత ఆర్మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను నూరిపోసింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భారత సైన్యంపై తరచూ రాళ్ళ దాడులకు పాల్పడేవారు. దీనికి హురియత్ కాన్ఫరెన్స్ కూడా సహాయం అందించేది. రాళ్ళు విసిరేవారికి ఎక్కువ మొత్తంలో డబ్బులను వెదజల్లేది. అంతేకాదు, తరచూ సరిహద్దు దాటి వచ్చే ఉగ్రవాదులకు ఈ సంస్థ పరోక్షంగా సహాయం అందించేది. వారికి స్థానికంగా వసతి కల్పించడం, బాంబులు తయారీకి కావాల్సిన వస్తువులను సమకూర్చడం లాంటివి చేసేది. దీనికి స్థానిక ప్రజలను రెచ్చగొట్టి వారి సహకారం తీసుకునేది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు జోరుగా కొనసాగేవి. అన్ని రాజకీయ పార్టీలు ఈ కాన్ఫరెన్స్ లో భాగం కావడంతో దీనికి రాజకీయ అండ కూడా ఉండేది. ఆర్టికల్ 370 ని అడ్డుపెట్టుకుని కశ్మీర్ ప్రజల కోసం కేటాయించిన నిధులను ఈ నాయకులు పంచుకునేవారు. దీంతో వారి సొంత అవసరాల కోసం కశ్మీర్ ను రావణకాష్టంలా మార్చారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ నాయకులందరిపైనా NIA దేశ ద్రోహ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టులలో విచారణ జరుపుతోంది. ఆయా నాయకులు ఇన్నాళ్ళూ చేసిన అరాచకాలను ఆధారాలతో సహా చూపి శిక్షలు పడేలా చేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా హురియత్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యాలయానికి యజమానిగా ఉన్న Nayeem అహ్మద్ ఖాన్ పై విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ కార్యాలయాన్ని జప్తు చేయాలని NIA కోరడంతో ఢిల్లీ కోర్టు అనుమతించింది.