ఇమ్రాన్ ఖాన్ ఇంటికి భారీగా చేరుకుంటున్న అభిమానులు

0
924

పీటీఐ (పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్) అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేయడంతో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. పలు బహిరంగ సభల్లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు.

ఇస్లామాబాద్‌లోని మేజిస్ట్రేట్ 30 సెప్టెంబర్ 2022న ఇమ్రాన్ ఖాన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో సీనియర్ సివిల్ జడ్జి రాణా ముజాహిద్ రహీమ్ ఈ వారెంట్ జారీ చేశారు. మహిళా న్యాయమూర్తిని బెదిరించినందుకు అతనిపై కేసు నమోదైంది. 2022 ఆగస్టు 20వ తేదీన ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ జిల్లా, సెషన్స్ జడ్జి జెబా చౌదరిని బెదిరించినట్లు ఇమ్రాన్ ఖాన్ పై అభియోగాలు మోపారు. ఆగస్టు 20న అతనిపై కేసు నమోదైంది. ఇమ్రాన్ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌లో పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ జరిగే అవకాశం ఉందని తెలియడంతో పెద్ద ఎత్తున ఇమ్రాన్ ఖాన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటూ ఉన్నారు.

ఖాన్ అరెస్ట్ పట్ల అప్రమత్తమైన పలువురు PTI కార్యకర్తలు, అతని మద్దతుదారులు శుక్రవారమే సంఘీభావంగా ఖాన్ నివాసానికి చేరుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ బని గాలాలోని తన నివాసంలో ఉన్నారు, వందలాది మంది ఇప్పటికే బని గాలాకు చేరుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుండి కూడా ఇమ్రాన్ ఖాన్ నివాసం దగ్గరకు చేరుకుంటూ ఉన్నారు.