నెహ్రూ తప్పిదానికి చరమగీతం..! కశ్మీర్‎కు రాష్ట్ర ప్రతిపత్తి..!! UT గా లద్దాక్..!!!

0
837

జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తి హోదా పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. తెరవెనుక సమ్మతి సృష్టి జరిగిపోయింది. వేదికపై ప్రధాని సరసన సూత్రధారుల సమక్షంలో పాత్రధారుల అంగీకారం ఖరారుగానే కనిపించింది. నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. లడఖ్ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ- కేంద్ర పాలిత ప్రాంత అకాంక్ష సాకారమై రెండేళ్ల కాలం గడిచిపోయింది. 370-35A అధికరణాలు రద్దు చేసిన రెండేళ్లకు; మరో చారిత్రక నిర్ణయం వైపు అడుగులు వేసింది నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.

శీతవేళ దాల్ సరస్సు ఘనీభవించినట్టే లోయ మొత్తం స్థాణువుగా మారిందని, మాట పెగలని మౌనం రాజ్యమేలుతోందనీ అ‘గౌరవ’ ప్రతిపక్షాలు గత కొంత కాలంగా ఆర్తనాదాలు చేస్తున్నాయి. దాల్ సరస్సు గర్భంలో జల సజీవంగానే సడి చేస్తోందని వారికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. గగ్గోలు పెట్టిన గతాన్ని పునస్సమీక్షించుకునే కాలం ఆసన్నమైంది.

జమ్మూ-కశ్మీర్ విషయంలో బీజేపీ వ్యూహం దీర్ఘకాల దృష్టితో రచించిందా? లడఖ్ విషయంలో అంత పకడ్బందీగా ఎందుకు వ్యవహరించింది? దోవల్ రూపొందించిన ‘Mission Kashmir 2.0’లో ప్రత్యేకతలేంటి? 370 అధికరణం తర్వాత రెండేళ్లకు రాష్ట్ర హోదా పునరుద్ధరణ వెనుక ప్రణాళిక ఏంటి?

కార్గిల్ రివ్యూ కమిటీ రహస్య నివేదిక ‘లడఖ్’ విషయంలో వెలిబుచ్చిన కీలక సూచనలేంటి? కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను ఫిబ్రవరి నుంచే ప్రధాని మోదీ లైన్ లో పెట్టారా? కాంగ్రెస్ లో ‘గ్రూప్-23’ ఏర్పాటు వెనుక ఉన్నదెవరు? లడఖ్ మినహా మిగతా జమ్మూ-కశ్మీర్ ప్రాంతానికి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తే చోటుచేసుకునే రాజకీయ పరిణామాలేంటి? శ్రీనగర్ కేంద్రంగా జరిగే కపట రాజకీయానికి చరమగీతం పడేందుకే జమ్మూను ‘అధికార కేంద్రం’గా మార్చారా? జమ్మూ-కశ్మీర్ విషయంలో కేంద్రం ఆరున్నరేళ్లుగా అవలంబించిన 12 విడతల విధానం ఏంటి? ఇలాంటి కీలక అంశాలకు సంబంధించిన విశ్లేషణను తెలియజేసే ప్రయత్నం చేస్తాను.

 1. నిఘా వర్గాల సమన్వయం
 2. బలగాల పొందికలో మార్పు
 3. రాజకీయ పునరేకీకరణ
 4. ప్రభుత్వ అంతర్గత సమాచార సేకరణ
 5. Over ground వేర్పాటువాద శక్తుల నియంత్రణ
 6. గ్రామ పంచాయితీలకు నిధుల కేటాయింపు
 7. 370-35ఏ అధికరణం రద్దు
 8. జమ్మూ-కశ్మీర్  కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు
 9. వ్యూహాత్మక భూభాగం లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచడం
 10. జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ
 11. నియోజకవర్గాల పునర్విభజన
 12. అసెంబ్లీ ఎన్నికలు 

కశ్మీర్ విషయంలో బీజేపీ అనుసరించిన వ్యూహం భారత రాజకీయ-సైనిక చరిత్రలో చిరకాలం మిగిలిపోయే అధ్యాయం. లడఖ్ కు ఈశాన్యంలో ద్రాస్ సెక్టార్ నుంచి ఇటు దక్షిణాన న్యోమా వరకూ వైరి ఉచ్చులు వేచి చూస్తున్నాయి.

ఇరువైపులా..రెండు శతృదేశాలు పొంచి ఉన్న వ్యూహాత్మక భూభాగం లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం వెనుక ‘ఆపరేషన్ విజయ్’ గుణపాఠాలున్నాయి. తూర్పు లడఖ్ సరిహద్దు వివాద వర్తమానం ఉంది. అంతకు మించి, అంతర్జాతీయ సైనిక వ్యూహకర్త కె.సుబ్రమణ్యం నేతృత్వంలో వేసిన కార్గిల్ రివ్యూ కమిటీ-KRC రహస్య నివేదిక సూచనలున్నాయి.   అధికార కేంద్రాన్ని శ్రీనగర్ నుంచి జమ్మూకు మార్చడం వెనుక కశ్మీరీ పండితుల హృదయ విదారక గతం ఉంది. 

సంచలనాల వెనుక కాదు, సర్వసాధారణంగా జరిగిపోయే ప్రక్రియల్లోనే అసలు రహస్యం దాగి ఉంటుంది. పాలనా యంత్రాంగంలోనో, రాజకీయ వ్యవహారాల్లోనో యథాలాపంగా దర్శనమిచ్చే పరిణామాల వెంట సుదీర్ఘ వ్యూహ-ప్రతివ్యూహాలు ఇమిడి ఉంటాయి. సామాన్యంగా కనిపించే మనుషులే అసామాన్య ధీరోదాత్తతను ప్రదర్శిస్తారు. అచ్చెరువొందే విజయాలను చరిత్రలో నమోదు చేస్తారు.

అజిత్ దోవల్ అర్భక ప్రాణి కాదు, ఆజానుబాహువూ… కాదు. రోజూ రోడ్డు వారన తారసపడే సామాన్యుడిలాగే కనిపిస్తారాయన. పాతికేళ్ల క్రితం మోదీ ఎవరో భారత ప్రజలకు తెలియదు. ఆనాటికి, దేశ రాజకీయాల్లో అమిత్ షా ఊసే లేదు. కానీ, ఇవాళ ఆ ముగ్గురే విధాన నిర్ణేతలు. భవిష్యత్ విధాతలు.

వాగ్దాన పరిపూర్తికి వ్యూహం వాహిక. ఎత్తుగడ ఊతకర్ర. ఈ సత్యాన్ని గుర్తించి-సంయమనంతో వ్యవహరిస్తే; చారిత్రక తప్పిదాలను తెలివిగా సరిచేయవచ్చని బీజేపీ ‘మిషన్ కశ్మీర్’ స్ట్రాటజీ నిరూపించింది. నేహ్రూ నేతృత్వంలో, మౌంట్ బాటన్ అదుపాజ్ఞల్లో జరిగిన జమ్మూ-కశ్మీర్ షరతుల విలీనానికి చరమగీతం పాడి-భారత్ రెక్కలకిందికి తెచ్చేందుకు రాజనీతిని-సైనిక పాటవాన్ని వినియోగించాల్సి వచ్చింది. భద్రతా బలగాలు అమరత్వాన్నీ, పౌరులు ప్రాణాలనూ ఫణంగా పెట్టాల్సి వచ్చింది.

జమ్మూ-కశ్మీర్ చారిత్రక విలీన తప్పిదాన్ని సరిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం పదేళ్ల సుదీర్ఘ ప్రణాళికను రచించింది. విడతల వారీగా విధాన నిర్ణయాలు తీసుకుంటూ పరిస్థితిని చక్కదిద్దుతోంది. 2014లో అధికార పగ్గాలు చేపట్టగానే కశ్మీర్ లోయలో ఉగ్రవాదంపై దృష్టి సారించారు భద్రత సలహాదారు అజిత్ దోవల్. తొందరపాటుగా ఉగ్రవాద నిర్మూలనకు పూనుకోలేదు.

1990లో చేపట్టిన ‘ఆపరేషన్ రక్షక్’, 2003లో ఆపరేషన్ ‘షార్ప్ వానిష్’ ల అనుభవాల నేపథ్యంలో 2016లో ‘ఆపరేషన్ కామ్ డౌన్’కు శ్రీకారం చుట్టింది సైన్యం. బుర్హాన్ వనీని మట్టుబెట్టన తర్వాత నిఘావర్గాల సమన్వయాన్ని మరింత కట్టుదిట్టం చేసింది. దీర్ఘకాల అవసరాల రీత్యా కాంపోజిషన్ టేబుల్ ను మార్చింది.

 గడచిన 27 ఏళ్లుగా ఉన్న ‘ముఖ్ బీర్’-ఇన్ఫార్మర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసింది. గతంలో ‘ముఖ్ బీర్’ లు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందివ్వటం వల్ల వెంటనే వారి ఉనికి ఉగ్రవాదులకు తెలిసిపోయేది. దీంతో ఇన్ఫార్మర్ నెట్ వర్క్ మొత్తం క్రమంగా పట్టుతప్పింది. కొన్ని సార్లు అది ఉగ్రవాదుల నెట్ వర్క్ మారి బలగాలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఉగ్రవాద ఏరివేత చర్య కేవలం-శాంతి భద్రతల నియంత్రణను దృష్టిలో ఉంచుకుని చేసింది కాదు. మొత్తంగా జమ్మూ-కశ్మీర్ భవిష్యత్తును, రూపురేఖలను మార్చేందుకు ఉద్దేశించిన సుదీర్ఘ ప్రణాళిక అది. ‘ఆపరేషన్ కామ్ డౌన్’ తర్వాత 2017లో ‘ఆపరేషన్ ఆల్ అవుట్’కు ఆదేశాలు జారీచేసింది సైన్యం. దీంతో డజన్ల కొద్దీ ఉగ్రవాదులు బలగాల ఉచ్చుకు చిక్కి హతమయ్యారు.

2011 నుంచి 2015 వరకు జమ్మూ-కశ్మీర్ లోని పంచాయితీలకు నిధులు అందుబాటులో లేవు. ఇదే విషయాన్ని నాటి కశ్మీర్ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది కూడా. 370 అధికరణం రద్దు తర్వాత జమ్మూ-కశ్మీర్ పంచాయిత్ రాజ్ చట్టం-1989 కి సవరణలు చేసింది కేంద్రం. అధికరణం 370 రద్దుకు ముందు అంటే, 2018లో 2వేల కోట్లు, 2019, జూలైలో 3వేల7వందల కోట్ల నిధులను కేంద్రం గ్రామపంచాయితీ ఖాతాలకు నేరుగా బదిలీ చేసింది. 2020-21లో కొత్తగా ఏర్పాటైన డిస్ట్రిక్ట్ డెవ్ లప్ మెంట్ కౌన్సిళ్లకు 2 వందల కోట్లు, బ్లాక్ డెవ్ లప్ మెంట్ కౌన్సిళ్లకు 71.9 కోట్లు, మరో 30 కోట్లు డీడీసీ, బీడీసీ భవనాల నిర్మాణానికి కేటాయించింది.

జమ్మూ-కశ్మీర్ రాజకీయాలను శాసిస్తున్న షేక్ అబ్దుల్లా కుటుంబ రాజకీయాలను మొదటి ప్రాధన్యం కింద తీసుకుంది మోదీ ప్రభుత్వం. నిజానికి కశ్మీర్ విలీన సమయంలో సైతం షేక్ అబ్దుల్లా బెదిరింపు ధోరణి కారణంగానే దశాబ్దాలుగా లోయ రాచపుండుగా మారిపోయింది. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రాబల్యాన్ని తగ్గించే పనిలో పడింది బీజేపీ. అంతేకాదు, 1947 నుంచి 2014 వరకు జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. అంతర్గత రహస్యాలు ఛేదించడం-ఎన్.సీ ప్రభావాన్ని తగ్గించే పనిలో 2015లో పీడీపీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. సుమారు మూడేళ్ల కాలం గడిచాక 2018లో కూటమికి గుడ్ బై చెప్పింది కమలం.

కశ్మీర్ లోయలో ప్రధానంగా దక్షిణ కశ్మీర్ లో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టిన తర్వాత, చైనా, పాక్ సరిహద్దుల వెంబడి బలగాలను మోహరించిన తర్వాత 2019, ఆగస్ట్, 5,6 తేదీల్లో ఎగువ, దిగువ సభల్లో 370 అధికరణం రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. వెను వెంటనే జమ్మూ-కశ్మీర్, లడఖ్ లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఈ విభజన కాలం నాటికే భవిష్యత్ ప్రణాళిక కేంద్రం వద్ద ఉంది.

పరిస్థితులు చక్కబడిన తర్వాత, మరీ ముఖ్యంగా కశ్మీర్ లోయలో అవకాశవాద రాజకీయాల కోసం వేర్పాటువాదాన్నీ సమర్థిస్తున్న రాజకీయ శక్తుల పీచమణచిన తర్వాత, ఉగ్రమూకల ఆటకట్టించిన అనంతరం జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కేంద్రం భావించింది. లడఖ్ ను మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచడం వల్ల సరిహద్దులపై నిరంతర సమాచారం కేంద్ర రక్షణ శాఖ తెప్పించుకునే అవకాశం ఉందని కేంద్రం భావించింది. ఇందుకు ప్రధాన కారణం కార్గిల్ యుద్ధం తర్వాత వేసిన ‘కార్గిల్ రివ్యూ కమిటీ’ సూచనలను పరిగణలోకి తీసుకోవడమే అంటారు నిపుణులు.

కె. సుబ్రమణియం నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్గిల్ రివ్యూ కమిటీ ప్రధానంగా సూచించింది ఏంటంటే…లడఖ్ చుట్టూతా ఉన్న సరిహద్దుల్లో జరిగే ఉగ్రకార్యకలాపాలు, చొరబాట్ల గురించి నాటి జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించపోవడమే కారణమని నిర్ధారించింది. అంతే కాదు, లోయలో ఉగ్రవాద సంస్థలకు బాహటంగా మద్దతు పెరిగిపోతున్న కారణంగా బలగాలపై దాడులు తీవ్రమవుతున్నాయని సదరు కమిటీ అభిప్రాయపడింది. దీంతో బలగాలపై అల్లరిమూకల దాడుల సంఖ్య పెరిపోయాయని పేర్కొంది. ఇది బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపింది. వీటితో పాటు బయటకు వెల్లడించని అనేక కారణాలను ప్రభుత్వానికి నివేదించింది  కార్గిల్ రివ్యూ కమిటీ.

హురియత్ కాన్ఫరెన్స్ లాంటి వేర్పాటువాద సంస్థలు ఉగ్రవాదులతో సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తూ రహస్య సంబంధాలు కొనసాగిస్తున్న వాస్తవాన్ని కేంద్ర నిఘా వర్గాలు గతంలోనే గుర్తించినా కశ్మీర్ లో అధికారంలో ఉన్న పార్టీలు-వేర్పాటువాదులకు మధ్య ఉన్న సంబంధాల వల్ల వారిపై చర్యలు తీసుకోవడం అసాధ్యంగా మారింది. 2014 తర్వాత జాతీయ భద్రతా సంస్థ పూర్తి స్థాయిలో వేర్పాటువాద సంస్థలపై దృష్టి సారించింది. బ్యాంకు లావాదేవీలు, ఫోన్ సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారాలు సేకరించింది. ఆకస్మిక దాడులు చేసింది. సాక్ష్యాలు సేకరించింది. 370 అధికరణం రద్దు తర్వాత వారందరినీ నిర్బంధించింది.

నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ సహా కశ్మీర్ కేంద్రంగా పనిచేసే పార్టీల పునాదులు కదిలిన తర్వాత క్రమంగా స్థానిక సంస్థలు బలపడ్డాయి. 370 అధికరణం రద్దు తర్వాత పరిస్థితులు మెరుగుపడుతూ వచ్చాయి. దీంతో ఈ ఏడాది జనవరి నుంచే జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కేంద్రం భావించింది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ వచ్చింది.

ఇందులో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేస్తున్నసమయంలో వ్యూహాత్మకంగా ప్రధాని మోదీ ఆజాద్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అందుకు ప్రతిగా ఆజాద్ సైతం ప్రధానిని ప్రశంసించారు. దీని వెనుక కశ్మీర్ లో రాజకీయ పక్షాలను ఏకతాటిపై తెచ్చేందుకు స్వతహాగా కశ్మిరీ అయిన ఆజాద్ ఉపకరిస్తాడని బీజేపీ భావించింది.

అనుకున్నట్టుగానే ఆజాద్ బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమయ్యాడు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం పార్టీలను హస్తినకు రప్పించి ఒప్పించే పని సవ్యంగా, సునాయాసంగా జరిగిపోయింది. అంతేకాదు, కాంగ్రెస్ లో ‘గ్రూప్ 23’ సృష్టికి సైతం బీజేపీ వ్యూహకర్తలు పథకం వేసినట్టూ, అందులో భాగంగానే విభేదాలు బట్టబయలై సీనియర్ల గ్రూపు ఏర్పడినట్లూ జాతీయ పత్రికలు కథనాలు రాస్తున్నాయి.

జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తే జమ్మూ అధికార కేంద్రంగా ఏర్పడుతుంది. నియోజకవర్గాల పునర్విభజన వల్ల కశ్మీర్ లోయతో సమానంగా జమ్మూలో సైతం నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. మొన్నటి వరకూ రాష్ట్ర హోదా విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు వ్యతిరేకత వెలిబుచ్చడానికి ప్రధాన కారణం జమ్మూ స్థానాల సంఖ్య పెరిగితే తమ ఉనికి పోతుందన్న భయమే అంటారు పరిశీలకులు.

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగే ఎన్నికలు జమ్మూ-కశ్మీర్ చరిత్రను పునర్లిఖించనున్నాయి. బీజేపీ, పీడీపీ, ఎన్సీ త్రిముఖ పోటీలో ఎవరు నెగ్గుతారన్నది ఉత్కంఠ రేపుతున్నది. ఒక వేళ ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ అధికార పగ్గాలు చేపడితే 90ల మారణ హోమం తర్వాత జమ్మూ, కశ్మీర్ ను వదిలిన పండితులు తిరిగి తమ స్వస్థలాలకు చేరడం ఖాయమనే వాదనలూ ఉన్నాయి.

భారతీయ జనతా పార్టీ అనుసరించిన సుదీర్ఘ వ్యూహం-ఎత్తుగడల్లో రాబోయే రోజుల్లో జమ్మూ-కశ్మీర్ తిరిగి ప్రాభవాన్ని, భూతల స్వర్గమనే ఉపమానాన్ని తిరిగి నిజం చేయాలని ఆశిద్దాం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two × three =