Telugu States

హైదరాబాద్ షో కోసం మునావర్ ఫారూఖీ ఎంత తీసుకున్నాడంటే..!

హిందూ దేవతలను అవమానించిన కమెడియన్ మునావర్ ఫారూఖీ ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే..! స్టాండప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ఇతడు.. గతంలో హిందూ దేవతలపైన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వివాదాస్పద వ్యాఖ్యలు అతడు చేస్తున్నా కూడా అతడిని వెనకేసుకు వచ్చే వాళ్లు చాలా మందే ఉన్నారు. అతడి షోను దేశంలోని పలు నగరాల్లో రద్దు చేసినప్పటికీ ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించారు. హిందూ సంఘాలు, నాయకులు, ప్రజలు అతడి షో నిర్వహించకూడదని అంటున్నా కూడా వేల మంది పోలీసుల సెక్యూరిటీ మధ్యన హైదరాబాద్ లో షో నిర్వహించారు.

ముంబైలోని డోంగ్రీకి చెందిన కుర్రాడిలా కెరీర్ మొదలు పెట్టిన మునావర్.. ఏక్తా కపూర్ రియాలిటీ షో లాక్ అప్ లో గెలుపొంది అంతో ఇంతో ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. మునావర్ ఫారూఖీ చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు, ఓ వర్గంలో అతడికి ఫాలోయింగ్ పెరగడానికి ఈ వివాదాలే కారణమని కూడా అంటుంటారు. జనవరి 2021లో స్టాండ్-అప్ కామెడీ షోలో హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు అతడిని అరెస్ట్ చేశారు. అతను ఒక నెల జైలు జీవితం గడిపాడు.

మునవర్ ఫారూఖీ ఇటీవల హైదరాబాద్‌లో స్టాండ్-అప్ షో లో పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రామ్ ను ఆపాలని ఎంతో మంది డిమాండ్ చేశారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల నాయకులను అరెస్టు చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను హౌస్ అరెస్ట్ కూడా చేశారు. హైదరాబాద్‌లో స్టాండ్-అప్ షో కోసం మునావర్ ఎంత తీసుకున్నాడనే విషయమై తీవ్ర చర్చ కూడా జరుగుతోంది. అందుకు సంబంధించిన వివరాలు మీకు అందిస్తున్నాం. Celebwale.com నివేదిక ప్రకారం, 2022 నాటికి మునావర్ ఫారూఖీ ఆస్తుల విలువ రూ. 2 కోట్లు, అతడు స్టాండ్-అప్ షోల ద్వారా భారీగా ఆర్జించాడు. గతంలో మునవర్ స్టాండ్-అప్ షోకి 1.5-2.5 లక్షలు తీసుకునేవాడు. అతని పాపులారిటీ కారణంగా, ఇప్పుడు ఒక్కో షోకి 3-4 లక్షలు తీసుకుంటున్నాడు. హైదరాబాద్‌లో షో కోసం కూడా అతడు అదే మొత్తం లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేసినట్లు భావిస్తున్నారు.

అయితే హైదరాబాద్ లో చోటు చేసుకున్న వివాదం కారణంగా అతడి షోలు పలు నగరాల్లో రద్దు అవుతూ వస్తున్నాయి. ఢిల్లీలో షో చేపట్టేందుకు కమెడీయన్ మునావర్ ఫారూఖీ భావించగా.. హైదరాబాద్ సహా పలుచోట్ల చోటచేసుకున్న పరిణామాల కారణంగా ఢిల్లీ పోలీసులు ఫారూఖీ షోకు అనుమతి నిరాకరించారు. మునావర్ షో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. దీంతో సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసుల రిపోర్ట్ ఆధారంగా మునావర్ షో కోసం చేసుకున్న దరఖాస్తును ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు. ఫారూఖీ షోకు అనుమతి నిరాకరించకుండా ఉంటే నిరసన ప్రదర్శన చేపడతామని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ హెచ్చరించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా మునావర్ ఫారూఖీ షోలు పలు నగరాల్లో రద్దవ్వడం ఖాయం. అతడి షోలు జరగడం సందేహమే..!

Related Articles

Back to top button