Sports

నీరజ్ చోప్రా కోసం భారత ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంతంటే..!

భారత జవాన్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఫైనల్‎లో బంగారు పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల విసిరి బంగారు పతకాన్ని గెలుపొందాడు. తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లు, మూడో ప్రయత్నంలో 76.93 మీటర్లు విసిరాడు. ఇక, నాలుగో ప్రయత్నంలోనూ 80 మీటర్లకు దగ్గరగా జావెలిన్‌ని సంధించాడు. కానీ.. అది ఫౌల్ అయ్యింది. ఐదో ప్రయత్నంలోనూ అలానే జరిగింది. ఇక చివరి ప్రయత్నంలో మాత్రం 84.24 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. పసిడి పతకం దిశగా అడుగులేశాడు. చివరి అటెంప్ట్‌కి రెండు నిమిషాల ముందే నీరజ్ చోప్రాకి స్వర్ణం ఖాయమైపోయింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించగా ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. 100 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున అథ్లెటిక్స్‌లో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

2018 ఏషియన్‌ గేమ్స్‌లో జావెలిన్‌ త్రో ఫైనల్లో 88.07 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్‌ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.07 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచాడు. ఇలా ప్రతిష్టాత్మక ఈవెంట్లన్నింటీలోనూ పసిడి అందుకున్నాడు.

హర్యానాకు చెందిన నీరజ్‌ చోప్రా పానిపట్‌ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్‌ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్‌ చిన్న వయసులోనే ఇండియన్‌ ఆర్మీకి సెలక్ట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్‌ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో.. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. 130 కోట్ల భారతీయుల 125 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన వీరుడు నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది.

నీరజ్ కోసం చేసిన ఖర్చు విషయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షేర్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ చోప్రా 450 రోజుల పాటు జావెలిన్‌ త్రో కోసం విదేశాల్లో శిక్షణ పొందాడు. ఈ శిక్షణ కోసం మోదీ ప్రభుత్వం 4.85 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దక్షిణాఫ్రికా, పోలాండ్, టర్కీ, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్ స్వీడన్‌ వంటి దేశాల్లో విదేశీ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాడు. 2017లో నీరజ్‌ చోప్రా కోచ్‌గా జావెలిన్ త్రో లెజెండ్ ఉవే హోన్ బాధ్యతలు స్వీకరించగా.. 2019లో చోప్రా మోచేతి శస్త్రచికిత్స తర్వాత ఆయన కోచ్గా డా. క్లాస్ బార్టోనియెడ్జ్ ఎంపికయ్యారు. ఆయనకు ప్రభుత్వం రూ.1.22కోట్లు చెల్లించింది. నీరజ్ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావలిన్లకు రూ. 4,35,000 ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒలింపిక్స్‌కు కొన్ని రోజుల ముందు నీరజ్ యూరప్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 50 రోజులపాటు స్వీడన్‌లో ఉన్నారు. ప్రభుత్వం రూ .19.22 లక్షలు ఖర్చు చేసింది. మెరుగైన క్రీడాకారుడిగా రాటుదేలేందుకు కేంద్ర ప్రభుత్వం అతడికి వెన్నుదన్నుగా నిలిచింది. ఇంకా పలువురు ఆటగాళ్ల విషయంలో భారత ప్రభుత్వం అండగా నిలిచింది. క్రీడల విషయంలో మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 − 4 =

Back to top button