More

  మెడికల్ టెక్స్‎టైల్ హబ్ గా భారత్..!

  కరోనా విపత్తులో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి, అవుతూనేవున్నాయి. ఇప్పుడు మన వంతు వచ్చింది. రెండో దశ విస్తృతితో భారత్ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. అయినా, వ్యాప్తి విషయంలోనూ, డెత్ రేట్ విషయంలోనూ అగ్రరాజ్యాల కంటే కూడా భారత్ దిగువనే వుంది. భారత్ లో డెత్ రేట్ 1.2 శాతం. అంటే మిగతా 98.8 శాతం కోలుకుంటున్నారు. మరణాల శాతంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి అగ్రదేశాలన్నీ టాప్ 25 లో వుంటే.. భారత్ మాత్రం 108వ స్థానంలో వుంది. ఇది ఊరటనిచ్చే విషయమే. సెకండ్ వేవ్ ఉధృతి కూడా క్రమంగా తగ్గుముఖం పట్టింది. మరి, భారత్ లో ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఇదిసాధ్యమైందా..? అసలు కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఏమీ చేయాలేదా..? కరోనా విపత్తులో మోదీ సర్కార్ ఏం చేసింది అని ప్రశ్నిస్తూ.. శ్మశాన జర్నలిజాన్ని ప్రదర్శించే లెఫ్ట్ లిబరల్ మేథావుల కోసం ఈ వీడియో.

  ఈయన పేరు గౌతమ్ నాయర్. మ్యాట్రిక్స్ క్లోథింగ్ కంపెనీ సీఈవో. తన 41 ఏళ్ల వ్యాపార జీవితంలో 2020లో చవిచూసిన నష్టాన్ని గతంలో ఎప్పడూ చూడలేదు. లాక్ డౌన్ తో కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా నిట్ వేర్ దుస్తులను ఎగుమతి చేసే నాయర్ 2020 మొదటి త్రైమాసికంలో భారీ నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. చెప్పాలంటే ఆ క్వార్టర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. లాక్ డౌన్ వల్ల గతేడాది ఏప్రిల్, మే నెలల్లో గుర్గావ్, జార్ఖండ్ వలోని అతని కర్మాగారాలన్నీ మూతపడ్డాయి. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నాయర్ కు.. ఒకరోజు అనూహ్యంగా కేంద్ర టెక్స్ టైల్ శాఖ కార్యదర్శి నుంచి ఫోనొచ్చింది. వెంటనే తన కర్మాగారాల్లో పీపీఈ కిట్ల తయారీ ప్రారంభించాలని నాయర్ కు సూచించారాయన. ఇలా కేంద్ర టెక్స్ టైల్ శాఖ నుంచి ఫోన్ కాల్ అందుకున్న కీలక టెక్స్ టైల్ తయారీదారుల్లో నాయర్ కూడా ఒకరు. కానీ, పీపీఈ కిట్ల తయారీ పూర్తిగా కొత్త వ్యవహారం. గతంలో ఇలాంటివి తయారు చేసింది లేదు. పైగా లుధియానా నుంచి నూలు.. కోయంబత్తూరు నుంచి స్పన్ దిగుమతి చేసుకోవాలి. అసలే లాక్ డౌన్ లో సరుకుల రవాణా కత్తిమీద సామే. ఇదీ నాయర్ పరిస్థితి.

  అమితాబ్ ఖర్బందా విషయానికి వద్దా. 500 పీపీఈ కిట్లను తయారు చేసిన నోయడాకు చెందిన సన్‌లార్డ్ అప్పారెల్స్ కంపెనీ యజమాని ఈయన. ఒక్క నాయర్ దే కాదు.. అమితాబ్ ఖర్బందా వంటి చిన్న తయారీదారులదీ ఇదే సమస్య. ప్రారంభదశలో నాణ్యతా ప్రమాణాలు అందుకోవడం, టెస్టింగ్ కోసమే మూడు వారాలు వేచిచూడటం సన్ లార్డ్ వంటి చిన్నతరహా పరిశ్రమలకు కష్టమైన పని. అయినప్పటికీ, ఉత్పత్తికి కావాలిసిన అన్ని మౌలిక సదుపాయాలున్న పెద్ద కంపెనీలతో సమానంగా పీపీఈ కిట్లు, మాస్క్ ల ను తయారు చేయగలిగారు అమితాబ్. సమయానుగుణంగా కేంద్రం నుంచి వస్తున్న సూచనలు.. రవాణాలో ప్రభుత్వ సహకారంతో అనుకున్నది సాధించారు.

  నిజానికి, పీపీఈ కిట్లు, మాస్కుల తయారీ మన వస్త్ర తయారీదారులకు కొత్త. దీంతో ప్రారంభ సమయంలో ప్రమాణాలు అందుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. అసలు పీపీఈ కిట్లు, మాస్కులంటే ఏమిటి..? ఎలా తయారు చేయాలి..? క్వాలిటీ ఎలా వుండాలి..? ఇలా ప్రతి చిన్న విషయాన్ని కేంద్ర టెక్స్ టైల్ శాఖ అధికారులు విడమరిచి చెప్పారు. అనుక్షణం ఫ్యాక్టరీ ఓనర్లు, వర్కర్లకు జూమ్ కాల్స్ చేస్తూ, సూచనలిస్తూ దగ్గరుండి ప్రోత్సహించారు. నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలోమ్యాట్రిక్స్ ఓనర్ నాయర్ కు ప్రతీరోజూ కేంద్రం నుంచి కాల్స్ వచ్చేవి. అడ్డంకులేమైనా వున్నాయా..? సాంకేతికత విషయంలో ఏవైనా సమస్యలున్నాయా..? అంటూ అధికారుల నుంచి నాయర్ తో పాటు.. తయారీదారులందరికీ ప్రతిరోజూ జూమ్ కాల్స్ వెళ్లేవి. మొదట్లో పీపీఈ కిట్ల శాంపిళ్లను టెస్టింగ్ కోసం కోయంబత్తూర్ కు పంపాల్సి వచ్చేదని.. ఎందుకంటే, అప్పటి దేశంలో అదొక్కటే టెస్టింగ్ సెంటర్ అని నాయర్ తెలిపారు. అయితే, రవాణా దగ్గర్నుంచి, అనుమతులు, పాసులు అందించడం వరకు.. అన్నీ కేంద్ర టెక్స్ టైల్ శాఖే చూసుకుందని.. ప్రతి పైసా ప్రభుత్వమే భరించిందన్నారు నాయర్. ఇలా పీపీఈ కిట్లు, మాస్కుల తయారీ, టెస్టింగ్, రవాణా ఇలా ప్రతి అంశంలో తయారీదారుల అడ్డంకుల్ని.. టెక్స్ టైల్ మంత్రిత్వ శాఖ తొలగించిందన్నారు క్లోథింగ్ మానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాహుల్ మెహతా. ఓ కేంద్ర ప్రభుత్వ శాఖ ఇంత చైతన్యవంతంగా పనిచేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.

  ఇక, మాస్కులు కిట్ల తయారీ చేపట్టిన వెల్ స్పన్ ఇండియా కంపెనీ అధికారులకైతే పీఎంవో ఆఫీసుతో పాటు గుజరాత్ సీఎంవో ఆఫీసు నుంచి ప్రతి రోజూ ఫోన్స్ కాల్స్ వచ్చేవి. వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా యూనిట్లు నెలకొల్పి.. మాస్కులు, రెస్పిరేటర్ల తయారీ చేపట్టాలంటూ ఒత్తిడి చేశారు. గృహ వస్త్ర తయారీ రంగంలో అనుభవమున్న వెల్ స్పన్ ఇండియా రాత్రికి రాత్రి సాంకేతిక పరిజ్ఙానంలో మార్పులు చేసి.. ఎన్-95 మాస్కుల తయారీ మొదలు పెట్టింది. ఆర్డర్ చేసిన మానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ వచ్చేలోగా.. కంపెనీలో అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఙానంలో మార్పులు చేసి తయారీ ప్రారంభించారు. అలా తయారీదారులను అనుక్షణం ప్రోత్సహిస్తూ.. నాలెడ్జ్ ట్రాన్స్ ఫర్, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, ప్రతి రాష్ట్రంలో టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటు, రవాణా, అనుమతులు ఇస్తూ.. ఇలా ఎక్కడా తాత్సారం జరక్కుండా ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఓ వ్యవస్థేనే ఏర్పాటు చేసింది. స్వతంత్ర్య భారత దేశంలో మునుపెన్నడూ ఇంత తక్కువ సమయంలో ఇలాంటివి జరగలేదు. అసలు పీపీఈ కిట్లు, మాస్కులంటే ఏంటో కూడా తెలియని వస్త్ర తయారీదారులతో వాటిని తయారు చేయిచింది. దేశాన్ని పీపీఈ కిట్లు, మాస్కుల తయారీ హబ్ గా మార్చేసింది మోదీ ప్రభుత్వం. ప్రస్తుతం దేశంలో 600 కంపెనీల నుంచి ప్రతి రోజూ 5 లక్షల పీపీఈ కిట్లు తయారవుతున్నాయి. ప్రపంచంలో పీపీఈ కిట్ల తయారీలో చైనా తర్వాత రెండోస్థానం మనదే. అసలు మాస్కులు, పీపీఈ కిట్లను దిగుమతి చేసుకోవడం తప్ప తయారు చేయడం తెలియని భారత్ ను.. అతి పెద్ద తయారీదారుగా నిలిపింది మోదీ ప్రభుత్వం.

  కర్మాగారాలు ఏర్పాటు, పీపీఈ కిట్ల తయారీలో శిక్షణ, విదేశాల నుంచి మెషినరీ దిగుమతి ఇలా ప్రతి అంశంలోనూ అనుక్షణం అండగా నిలబడి.. తయారీదారులను ప్రోత్సహించింది మోదీ ప్రభుత్వం. ఓవైపు దేశం మొత్తం లాక్ డౌన్ లో వున్న పరిస్థితుల్లో.. పరికరాలను దిగుమతి చేసుకోవాల్సిన దేశాలతో కేంద్ర టెక్స్ టైల్ శాఖ అనుక్షణం సంప్రదింపులు జరిపింది. దిగుమతుల ప్రక్రియ సజావుగా సాగేలా అనుమతులు మంజూరు చేస్తూ రౌండ్ ది క్లాక్ పర్యవేక్షించింది. అటు తయారీతో పాటు.. పంపిణీని కూడా వేగవంతం చేసింది. గతేడాది ఏప్రిల్ మొదటివారంలోనే ఫ్యాక్టరీలు నెలకొల్పేందుకు తయారీదారులకు అనుమతులు లభించాయి. ఇక, సింగిల్ విండో ప్రొక్క్యూర్ మెంట్ ఏజెన్సీ హిందూస్థాన్ లైఫ్ కేర్ లిమిటెడ్ పీపీఈ కిట్లు, మాస్కుల పంపిణీని సమన్వయం చేసింది. తయారీదారుల నుంచి కిట్లను సేకరించడమే కాకుండా.. నాణ్యతాలోపాలున్న కిట్లు మార్కెట్లోకి వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంది. పీపీఈ కిట్ల తయారీ మార్గదర్శకాలను రూపొందించి తయారీ సంస్థలకు అందజేసింది. ప్రభుత్వ ఏజెన్సీ ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం.. ప్రపంచ పీపీఈ కిట్ల మార్కెట్ విలువు 3.8 లక్షల కోట్లు కాగా.. అతి తక్కువ కాలంలోనే భారత్ 7 వేల 300 కోట్ల మార్కెట్ షేర్ ను సాధించింది. మెడికల్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ భారత్ కు పూర్తిగా కొత్త పరిశ్రమ. కానీ, అనతికాలంలో చైనాను శాసించే స్థితికి భారత్ చేరుకుంది.

  అటు, పీపీఈ కిట్ల తయారీ యూనిట్లు ప్రారంభించిన కొత్తలో, అంటే కరోనా మహమ్మారి తీవ్రంగా వున్న సమయంలో కార్మికులు దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో గ్రామాల్లోకి వెళ్లి కార్మికులను ఒప్పించాల్సి వచ్చింది. కార్మికులకు ఆరోగ్య రక్షణకు భద్రత హామీ ఇస్తూ.. వారిని కర్మాగారాల్లోకి రప్పించాల్సి వచ్చింది. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని గట్టెక్కించడం కోసం కార్మికులు సైతం నడుం బిగించారు. ఎందరో మహిళలు రాత్రింబవళ్లు పీపీఈ కిట్లు కుట్టారు. ఎక్కడ ఇంటికి వెళ్తే కుటుంబ సభ్యులకు వైరస్ సోకుతుందోనని.. కర్మగారాల్లోనే ఉంటూ పగలూ, రాత్రి అన్ని షిఫ్టులలో కష్టపడి దేశానికి అండగా నిలిచారు. తయారీ సంస్థలు సైతం కార్మికులు ఫ్యాక్టరీల్లోనే ఉండేందుకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన ఆత్మనిర్భర భారతానికి బాటలు వేశారు. విపత్తులోనూ స్వయం సమృద్ధి సాధించారు.

  ఒక్క పీపీఈ కిట్లు, మాస్కుల విషయంలోనే కాదు.. పూర్తిగా కొత్తదైన మెడికల్ టెక్స్ టైల్ మానుఫ్యాక్చరింగ్ లో మునుపెన్నడూ లేని ఘనత సాధించింది భారత్. ఆత్మనిర్భర భారత్ లో భాగంగా దేశం ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించింది. దేశంలో ఇప్పుడు అవసరానికి సరిపడా పీపీఈ కిట్లు ఉన్నాయంటే అది ఆత్మనిర్భర భారత్ వల్లనే సాధ్యమైంది. ఒక్క మెడికల్ టెక్స్ టైల్స్ విషయంలోనూ కాదు.. ఆక్సిజన్ విషయంలోనూ భారత్ ఆత్మనిర్భరతను చాటుకుంది. విదేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా.. అతి తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిన్ ఉత్పత్తిని సాధించింది. శానిజైటర్లు, వెంటిలేటర్ల ఉత్పిత్తి సైతం గణనీయంగా పెరిగింది. అటు, వ్యాక్సిన్ల విషయంలోనూ స్వయం సమృద్ధిని సాధించి.. ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాకారం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మారాలని.. ‘మేక్ ఫర్ ది వరల్డ్’ సంకల్పంతో ముదుకు సాగాలని ఆకాక్షించారు. ఇప్పుడు ఆయన సంకల్పం నెరవేరుతోంది.. భారత్ ‘మేకిన్ ఇండియా’ స్థాయి నుంచి ‘మేక్ ఫర్ ది వరల్డ్’ స్థాయికి చేరుకుంటోంది. కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ఇప్పటికే ఇది నిరూపితమైంది. 60కి పైగా దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసి సత్తా చాటింది భారత్.

  కానీ, ఈ విపత్కర కాలంలో భారత్ సాధించిన ఈ ప్రగతి గుర్తింపునకు నోచుకోలేదు. పైగా కుహనా లౌకికవాదులు, లెఫ్ట్, లిబరల్ మీడియా హౌజ్ లు శ్మశాన జర్నలిజాన్ని ప్రదర్శించాయి. మరుభూమిని ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. కాలుతున్న కరోనా బాధితుల శవాలతో టీఆర్పీలను పెంచుకున్నాయి. మెడికల్ టెక్స్ టైల్ విభాగంలో భారత్ సాధించిన విజయాన్ని కనీసం గుర్తించడానికి కూడా వీళ్లకు మనసు రాలేదు. పైగా, ఆక్సిజన్ కొరతను మాత్రమే హైలైట్ చేసి.. భారత్ ఆత్మనిర్భరతపై దెబ్బకొట్టాయి. ఆగమేఘాలమీద ఆక్సిజన్ సరఫరా చేసిన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు వీరికి కనబడలేదు. యుద్ధవిమానాల్లో తరలిన కాన్సంట్రేటర్లు కానరాలేదు. నౌకలమీదుగా సాగిన ప్రాణవాయువు పంపిణీ వీళ్ల కంటికి ఆనలేదు. నిజానిజాలను, నిజమైన గణాంకాలను ఈ విదేశీ పెంపుడు జర్నలిజం ఏనాడూ గుర్తించలేదు. కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే వీళ్ల ప్రధాన ఎజెండా. ఆత్మనిర్భర భారత్ కు అండగా వుండకుండా.. విదేశీ మీడియా అంకెలను వల్లెవేయడమే వీళ్ల పని. కుహనావాదులు గుర్తించనంత మాత్రాన నిజం నిజం కాకుండా పోదు. లెఫ్ట్, లిబరల్ మీడియా చెప్పనంత మాత్రాన సత్యాలు అసత్యాలు కావు. ఈ నిజాలు అబద్ధాలు కావు. అబద్ధాలను వల్లెవేసే శ్మశాన జర్నలిస్టుల అసలు గుట్టును ప్రజలు గమనించకా మానరు.

  Trending Stories

  Related Stories