రాష్ట్రపతి అందంగా లేదన్న TMC మంత్రి..! భగ్గుమన్న బీజేపీ..!!

0
670

భారత రాష్ట్రపతి పదవి.. దేశ అత్యున్నత పదవి. దేశానికి తొలి పౌరుడు, లేదా పౌరురాలు రాష్ట్రపతే. అంతటి అత్యున్నత రాష్ట్రపతి పీఠాన్ని తొలిసారి ఓ గిరిజన అధిరోహించింది. అయితే, ఈ విషయం ఏమాత్రం రుచించని విపక్ష పార్టీలు.. ఆమెపై అనుచిత వ్యాఖ్యలకు దిగుతున్నాయి. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికై మూడు నెలలు గడుస్తున్నా.. ఆమెపై అనుచిత వ్యాఖ్యల పరంపర ఆగడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ అధికార టీఎంసీ మంత్రి అఖిల్ గిరి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆమె అందంగా ఉండదంటూ అవమానించాడు. ఇటువంటి దారుణ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అతడిని మంత్రిపదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.

బీజేపీ నేత సువేందు అధికారిని కామెంట్ చేస్తూ.. రాష్ట్రపతిని కూడా అవమానించాడు అఖిల్ గిరి. నందిగ్రామ్‎లో పర్యటనలో ఉన్న ఆయన.. సువేందు అధికారి ఏమైనా అందంగా ఉన్నాడా..? అని ప్రశ్నిస్తూనే.. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందం ఎంతటిదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వివాదంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దేశానికి మొట్టమొదటిసారిగా ఓ గిరిజనురాలు రాష్ట్రపతిగా ఎంపికైతే ఈ విధంగా మాట్లాడటమేంటని విమర్శించారు. తృణమూల్ పార్టీకి గిరిజనులపై ఉండే ప్రేమ ఇదేనా అంటూ దుయ్యబట్టారు. ఏకంగా తృణమూల్ పార్టీకి చెందిన మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే,.. పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. టీఎంసీ మంత్రి అఖిల్ గిరి చేసిన ఇటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే అతడి మనస్తత్వం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చని తెలిపింది. దీనిపై ‘బెంగాల్ బీజేపీ’ కూడా ట్విట్టర్ ఖాతాలో స్పందించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన వర్గాల నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్నారని,.. అటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ విరుచుకుపడింది. దీంతో పాటు మంత్రి వ్యాఖ్యలపై బెంగాల్ బీజేపీ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

అటు ఈ వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ కూడా ఖండించింది. మా పార్టీకి రాష్ట్రపతిపై అపారమైన గౌరవముందని చెప్పుకొచ్చింది. మహిళలు అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ సమాజంలో ఇటువంటి వ్యాఖ్యలు హేయకరమైనవని ట్వీట్ చేసింది. మంత్రి వ్యాఖ్యలకు పార్టీకి ఏమాత్రం సంబంధంలేదనీ తెలిపింది. ఇక ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అఖిల్ గిరి క్షమాపణలు కోరాడు. గౌరవనీయులైన రాష్ట్రపతిని అగౌరవపరచాలన్నది తన ఉద్దేశ్యం కాదంటూ చెప్పుకొచ్చాడు. బీజేపీ నేతలు తనపై చేస్తున్న మాటల దాడికి మాత్రమే సమాధానమిచ్చానని బుకాయించాడు. తాను రాష్ట్రపతిని అగౌరవపరిచినట్లు ఎవరైనా భావిస్తే అది తప్పు అనీ,.. తనకు దేశ రాష్ట్రపతి పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వ్యాఖ్య చేసినందుకు క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.

అయితే ప్రతిపక్షాలు రాష్ట్రపతిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ఆమెను రాష్ట్రపత్ని అని పిలవాలా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగటంతో క్షమాపణలు కోరాడు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

19 + nineteen =