సరిహద్దులు దాటి సమాచారాన్నితస్కరించాలి. శతృవు భూభాగంలో మారువేశంలో సంచరించాలి. గుట్టు బయటపడకుండా గూఢచర్యం చేయాలి. ఎరవేసి వశపరచుకోవాలి. వలపన్ని వైరి వేగులను నిర్బంధించాలి. ఇవీ Spy encyclopedia చేప్పే ప్రాథమిక సూత్రాలు. All warfare is based on deception అన్నాడు చైనా ప్రాచీన యుద్ధ నిపుణుడు Sun tzu. సంగ్రామం సాంతం మోసంపైనే ఆధారపడి ఉందంటూ యుద్ధకళలోని ప్రాథమిక సూత్రాన్ని నిర్వచించాడు. మావో సెటుంగ్ నుంచి జిన్ పింగ్ వరకూ ఇదే సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తోంది చైనా.
Nicholas Eftimiades తన పుస్తకం ‘‘Chinese Intelligence Operations’’లో ‘‘ The MSS uses two main themes in recruiting foreign nationals of Chinese ancestry. First, it appeals to their perceived obligation to help the land of their heritage, thereby exploiting sentimental feelings of ethnic pride. Second, it implies that family members still in the PRC will receive unfavorable treatment unless the subjects cooperate’’ అంటూ పరిశీలనాత్మక వ్యాఖ్య చేశాడు.
విదేశాల్లో స్థిరపడిన చైనీయులను గూఢచారులుగా చేర్చుకోవడంలో మినిష్ట్రీ ఆఫ్ హోమ్ అఫయిర్స్ రెండు రకాల పద్ధతులను అవలంబిస్తుంది. మొదటిది: తమ పూర్వీకుల పరంపర ఉన్న దేశానికి సేవాచేయాలంటూ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం, జాతి సంబంధమైన అంశాలను ముందుకు తేవడం ద్వారా వారిని సమ్మోహపరుస్తుంది. రెండోది: ఒక వేళ గూఢచర్యానికి సహకరించకపోతే ఇప్పటికీ చైనాలోనే ఉండిపోయిన వారి బంధువుల భద్రత అనిశ్చితిలో పడుతుందన్న భయాన్ని కలిగించడం.
దీన్నిబట్టి చూస్తే చైనా నిఘా విభాగాలు ఎన్ని ప్రమాదకరమైన పద్ధతులు అనుసరిస్తాయో తెలుస్తుంది. చైనా గూఢచర్యంపై Roger Faligot రాసిన ‘‘Chinese Spies: From Chairman Mao to Xi Jinping’’ పుస్తకం మరిన్ని సంచలన నిజాలను బయటపెట్టింది.
ఇరవయ్యో శతాబ్దంలో రష్యా నిఘా విభాగం కేజీబీ ఎలాంటి పాత్ర పోషించిందో 21వ శతాబ్దంలో ఎంఎస్ఎస్-మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ కూడా ఆ స్థాయిలో ప్రపంచ దేశాలను గడగడలాడించాలని భావిస్తోందంటాడు రోజర్ ఫాలిగాట్. నిఘా విభాగాల పనితీరులో మావో అనుసరించిన కుట్ర పద్ధతులనే జిన్ పింగ్ కూడా అవలంబిస్తున్నాడంటారు ఫాలిగాట్.
ఆసియా దేశాల్లో… ప్రధానంగా భారత్, పాకిస్థాన్ లో తన గూఢచారులను మోహరించింది చైనా. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా ఏజెంట్లను నియమించింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 2021, జూన్ 26న పట్టుబడిన చైనా గూఢచారి వెల్లడించిన నిజాలు విని ఇంటలీజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్ లు కూడా అవాక్కయ్యాయి.
ఇటీవలే బయటపడిన మరో ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే ఇజ్రాయిల్ లో కూడా చైనా తన గూఢచారులను మోహరించిందని. ఇజ్రాయిల్ కు చెందిన Haaretz పత్రిక ఈ ఏడాది ఫిబ్రవరి 25న ‘Amos Harel’ రాసిన ‘‘How Deep Has Chinese Intelligence Penetrated Israel?’’ శీర్షికన విశ్లేషణాత్మకమైన ఓ వ్యాసాన్ని ప్రచురించింది. చైనా గూఢచారులు ఇజ్రాయిల్ లో ఎలా పాతుకుపోయారో ఈ వ్యాసం వెల్లడించింది.
ప్రధానంగా ఇజ్రాయిల్ రక్షణ పరిశోధన రంగాన్ని లక్ష్యంగా చేసుకున్న చైనా రకరకాల మార్గాల్లో గూఢచారులను పురమాయించింది. మోస్సాద్ సైతం చైనా గూఢచారుల ఆనుపానులు తెలుసుకోలేకపోయిందని ఇటీవల వెలువడిన వార్తాకథనాలు రూఢీ చేస్తున్నాయి. చైనా ఇజ్రాయిల్ రక్షణ రంగంతో పాటు Industrial espionage గా పారిశ్రామిక గూఢచర్యం చేస్తున్నట్టూ అంతర్జాతీయ పత్రికల కథనాలు చూస్తుంటే అర్థమవుతుంది.
నెతన్యాహు అధికారంలో ఉన్న కాలంలో చైనా టెక్నాలజీ దృష్టిలో ఉంచుకుని ద్వైపాక్షిక బంధాన్ని మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి అవసరమైన 5జి సేవల విస్తరణ కోసం చైనాపై ఆధారపడింది ఇజ్రాయిల్. అయితే నాఫ్తాలీ బెన్నెట్ అధికారంలోకి వచ్చాక అమెరికా అభ్యంతరాల నేపథ్యంలో చైనాను దూరం ఉంచే ప్రయత్నం చేశారు. చైనా సైబర్ సెక్యూరిటీకి నిపుణులు ఇజ్రాయిల్ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలతో పాటు ఇతర ప్రైవేట్ సంస్థల వెబ్ సైట్లను హ్యాక్ చేయడంతో పారిశ్రామిక గూఢచర్యం ఉదంతం మరోసారి బయటపడింది.
ఇజ్రాయిల్ ఆయుధ పరిశ్రమపై చైనా సుదీర్ఘకాలంగా కన్నేసింది. క్వింట్ వెబ్ సైట్ గతేడాది మార్చి 25న ‘‘What Does China Have to Do With Israeli Weapons Industry Scandal?’’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయిల్ ఆయుధ తయారీ పరిశ్రమలో జరిగిన భారీ కుంభకోణాన్ని ఆ దేశ నిఘా విభాగం బట్టబయలు చేసింది. ఈ కుంభకోణంలో ఉన్న 20 మందిని అరెస్టు చేసింది. ఇజ్రాయిల్ డ్రోన్లు కొన్నింటిని రహస్యంగా దేశం దాటించారు ఆయుధ పరిశ్రమ కార్మికులు. ఇజ్రాయిల్ నిఘా విభాగం మోస్సాద్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి కూపీ లాగింది. ఇజ్రాయిల్ ఆయుధ పరిశ్రమ నుంచి తస్కరణకు గురైన డ్రోన్లు చైనాకు వెళ్లినట్టూ గుర్తించింది. దీంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం చైనాతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో పునరాలోచనలో పడింది. అమెరికా సైతం ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 20న ఇండియా టైమ్స్ వెబ్ సైట్ ‘‘Investigation On Alleged Chinese Espionage On Israel Through Gifts’’ శీర్షికన ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా రాయబార కార్యాలయ ఉద్యోగులు ఇజ్రాయిల్ మంత్రి ఒకరికి రెండు మగ్గులను బహుకరించారట! అయితే ఈ మగ్గులు అనుమానాస్పదంగా ఉన్నాయని భావించిన మోస్సాద్ పూర్తిస్థాయి రహస్య విచారణకు ఆదేశించింది. బహుమతుల ముసుగులో బగ్స్ ను అమర్చిందని ఇజ్రాయిల్ ఆరోపించింది. రకరకాల మార్గాల్లో చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని ఇజ్రాయిల్ గట్టిగా నమ్ముతోంది. అందుకు చైనా దౌత్య అధికారులు ఇచ్చిన ప్రతి బహుమతినీ క్షణ్నంగా పరిశీలిస్తోందని ఈ కథనం పేర్కొంది. అయితే కొంత మంది మోస్సాద్ అధికారులు మాత్రం బహుమతుల్లో ఏమీ లేదంటున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలూ ప్రత్యారోపణలు గతంలో కూడా చాలా వినిపించాయి. మొత్తంగా రెండు దేశాల మధ్య సంబంధాల్లో గూఢచర్యం చిచ్చుపెట్టిందనడం ఖాయం.
ఇజ్రాయిల్ internal intelligence agency చీఫ్ షిన్ బెట్ మాత్రం చైనాతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటాడు. యూదుల పర్వదినం సందర్భంగా చైనీయులు ఇచ్చిన బహుమతులను స్కాన్ చేయగా అనుమానాస్పద ఎలక్ట్రానిక్ పరికరాలున్నాయని గుర్తించామన్నారు. సదరు బహుమతులను సాంకేతిక నిపుణుల వద్దకు పంపగా అసలు విషయం బయట పడిందని షిన్ బెట్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ లోని కొన్ని హిబ్రూ మీడియా సంస్థలు కూడా చైనీయుల బహుమతులను spying devices గా పేర్కొన్నాయి.
అమెరికా-చైనా వాణిజ్య ఘర్షణ సమయంలో ఇజ్రాయిల్ తో సంబంధాల విషయంలో చైనా ఆసక్తిని ప్రదర్శించింది. ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, రోబోటిక్స్ లాంటి కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని భావించింది. అయితే తదనంతర కాలంలో ఈ సంబంధాలు ప్రమాదకరంగా మారతాయని ఇజ్రాయిల్ భావించినా….ఇంత త్వరగా ప్రమాదం వచ్చి పడుతుందని ఊహించలేదంటారు రక్షణరంగ నిపుణులు.
అమెరికన్ వారపత్రిక న్యూస్ వీక్ ఈ ఏడాది ఆగస్ట్ 10న వెలువరించిన సంచికలో ‘‘China Targets Israeli Technology in Quest for Global Dominance as U.S. Frets’’ శీర్షికన KIRSTEN TATLOW రాసిన కథనాన్ని ప్రచురించింది. న్యూస్ వీక్ పత్రిక ‘‘కోవర్ట్ చైనా’’ పేరుతో వరుస కథనాలను ప్రచురించింది. చైనా 2049 వరకు తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకునేందుకు చేసుకునే ప్రయత్నాలను ఈ కథనాల్లో వివరంగా రాసింది.
టెల్ అవివ్ లో ఉండే ఓ రాజనీతి శాస్త్ర అధ్యాపకుడికి తన సోషల్ మీడియా ద్వారా హఠాత్తుగా ఓ మెసేజ్ వచ్చింది. చైనాకు పనిచేస్తే తగిన ప్రతిఫలం ఉంటుందని ఆ మెసేజ్ సారాంశం. “Casey Xu” అనే చైనా పౌరుడు ‘We chat” యాప్ ద్వారా ఈ మెసేజ్ పంపినట్టూ ఇజ్రాయిల్ నిఘా విభాగాలు గుర్తించాయి. “Casey Xu” ని సీసీపీ కోసం పనిచేస్తున్న “international recruiter” గా గుర్తించాయి.
రాజనీతి శాస్త్ర అధ్యాపకుణ్ని కేవలం పాఠాలు బోధించడానికి చైనా ఆహ్వానిస్తుందా? అంటే అసలే కాదు. మచ్చిక చేసుకున్న తర్వాత ఇజ్రాయిల్ పౌరుణ్నే తిరిగి ఇజ్రాయిల్ పై గూఢచర్యానికి ఉపయోగిస్తుంది. ఇదీ చైనా అనుసరించే ప్రమాదకరమైన ధోరణి.
ఈ ఆపరేషన్స్ లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రత్యక్ష హస్తముందని మోస్సాద్ రూఢీ చేసింది. ‘చైనా డ్రీమ్-2049’ కోసమే ఇదంతా చేస్తున్నట్టూ, బహుముఖీనమైన దాడి, భిన్నమైన దారుల్లో ప్రయత్నాలు పేరిట సీసీపీ విదేశాల్లోని నైపుణ్యాన్ని కొల్లగొట్టే పనిలో ఉందని కూడా ఇజ్రాయిల్ తేల్చేసింది.
మోస్సాద్ అధికారులు “Casey Xu” ను విచారిస్తున్న సమయంలో ఆశ్యర్యకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. ప్రతి గూఢచారికీ మూడు అక్షరాలు-మూడు అంకెలతో సీక్రెట్ కోడ్ ఉంటుందని Casey Xu విచారణలో వెల్లడించాడు.బ్రిటన్ లో ఉండే ఏజెంట్ కు “GBR 004”, న్యూజీల్యాండ్ లో గూఢచారికి “NZL 002”, భారత్ లో ఉండే వేగుకు “IND 004”, ఇజ్రాయిల్ గూఢచారికి “ISR 007″కోడ్ కేటాయిస్తారని తెలిపాడు. అంతేకాదు బ్రిటన్ లో కార్యకలాపాలు సాగిస్తున్న గూఢచారి microwave photons లో నిపుణుడనీ, అయితే పరిఙ్ఞానాన్ని వంట పరికరాల్లో మాత్రమే కాదు క్వాంటమ్ ఫిజిక్స్, రేడియో కమ్యూనికేషన్స్ లో కూడా వినియోగిస్తారని విచారణలో తేలింది.
మనిషి దూరని గహనాటవులు, గుహల్లోని సమాచారాన్ని ఈ సాంకేతికత ఆధారంగా తెలుసుకోవచ్చు. న్యూజీల్యాండ్ లో తిష్ఠవేసిన ఏజెంట్ nanomaterialsలో నిపుణుడు. నానో మెటీరియల్స్ పరిజ్ఞానాన్ని… వైమానిక రంగం, అంతరిక్ష వాహకనౌకలు, రక్షణ లాంటి కీలక రంగాల్లో వినియోగిస్తారు. భారత్ లో ఉన్న చైనా గూఢచారి integrated circuits లో ఎక్స్ పర్ట్. ఈ సాంకేతికతను ఇంటర్ నెట్ లో వినియోగిస్తారు. ఇక ఇజ్రాయిల్ లో ఉన్న చైనా వేగులు ఆ దేశ విధాన నిర్ణయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తమ దేశానికి చేరవేశారు.
2018లో దిగ్భ్రాంతికరమై సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫ్రెంచ్ దిన పత్రిక లే మాండే ఇందుకు సంబంధించిన కథనాన్ని ప్రచురించింది. ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ ని బీజింగ్ లో నిర్మించింది. అయితే నిర్మాణ సమయంలోనే బగ్ లను అమర్చడంతో ఆ తర్వాత కాలంలో మొత్తం సమాచారం చైనా నిఘా వర్గాలకు చేరింది. 2012 నుంచి 2017 వరకు ఈ రహస్య సమాచార తస్కరణ అప్రతిహతంగా కొనసాగింది. 2017లో ఆఫ్రికన్ యూనియన్ అసలు విషయాన్ని పసిగట్టింది. ఆ తర్వాత సదరు భవనాన్ని వదిలేసింది. చైనా టెలీకం దిగ్గజం హువావే లిథువేనియాలో ఇదే తరహాలో బీజింగ్ కోసం గూఢచర్యానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. లిథువేనియా పౌరులను వేగులుగా మార్చుకుందని ఆ దేశం ఆరోపించింది.
మొత్తంగా చైనా ప్రపంచంలోని అన్ని కీలక దేశాల్లో తన గూఢచారులను మోహరించింది. ఇజ్రాయిల్ లాంటి కట్టుదిట్టమైన భద్రత గల దేశంలోనే చైనా గూఢచర్యం చేసిందంటే…భౌగోళిక విస్తృతి, అపారమైన జనాభా గల మన దేశంలో…డ్రాగన్ ఎంతమంది వేగులను పురమాయించిందో……..?
చైనా పేరోల్స్ లో ఉన్నవారు…డ్రాగన్ కోసం భారత్ లో అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నవారు…మద మధ్యే తచ్చాడుతున్నారు…తస్మాత్ జాగ్రత్త…!