More

    ఆ ఘటనపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి.. బాధ్యుల సస్పెండ్

    ఒంగోలులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కాన్వాయి కోసం రోడ్డుపై వెళ్తున్న కార్లను పోలీసులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారనే వార్తలు రావడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వినుకొండ నుంచి తిరుమల దర్శనానికి వెళ్తున్న శ్రీనివాస్ కారుని పోలీసులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పినా వినిపించుకోలేదనే విమర్శలు వచ్చాయి. అర్థరాత్రి రోడ్డుపై శ్రీనివాస్ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది. పోలీసుల తీరుతో చేసేది లేక శ్రీనివాస్ కుటుంబం వెనక్కి వెళ్లిపోయింది.

    ఈ ఘ‌ట‌న‌పై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విష‌యంపై కథనాలు రావ‌డంతో శ్రీ‌నివాస్‌ కారును తీసుకెళ్లిన‌ సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోంగార్డు పి.తిరుపతిరెడ్డి, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సంధ్యను అధికారులు సస్పెండ్‌ చేశారు. కారు స్వాధీనం చేసుకున్న‌ ఘటనకు వారిని బాధ్యులను చేస్తూ ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆ కారు య‌జ‌మాని శ్రీ‌నివాస్ గురించి ఏపీ సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది. ఆ కారును తీసుకెళ్లాలని ఫోనులో శ్రీ‌నివాస్‌కు పోలీసులు చెప్పారు.

    ఈ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీయే (RTA) అధికారులు ఒంగోలులో ప్రజల కార్ తీసుకెళ్లడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమన్నారు. భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటని.. సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళిందని ప్రశ్నించారు.

    Trending Stories

    Related Stories