Right Angle

‘సూయజ్’ సంక్షోభం.. చరిత్రలో మరో కోణం..!

కళ్లు చెదిరే రంగుల్ని సముద్రం నుంచి దొంగిలించినట్టే.. సంపదను కూడా సాగరం మీదుగానే తస్కరించాలి. నాగరికతకూ, సాంకేతిక పరిఙ్ఞానానికీ నిరంతరం సవాలు విసురుతుంది ప్రకృతి. సముద్రంపై నుంచి వీచే శీతగాలుల తాకిడి 2లక్షల 20వేల  టన్నుల నౌకను లక్కపిడతవలె తిప్పేసింది. సూయిజ్ కాలువలో భారీ ఎవర్ గివెన్ నౌక కడుపులో బిడ్డవలె అడ్డంగా తిరగబడింది. అగ్రరాజ్యాల ఘీంకారాలన్నీ మూలుగులుగా తర్జుమా అయ్యాయి. సాక్షాత్తూ శ్వేతసౌధం ఏకంగా సైనిక సహకారానికి సిద్ధమైంది. మరోవైపు సముద్ర దొంగల భయం పారిశ్రామికవేత్తలను వెంటాడుతోంది. గంట‌ల‌కు 2 వేల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టిని తొవ్వే భారీ డ్రెడ్జింగ్ మెషీన్‌ను రప్పించినా ప్రయోజనం కనిపించడలేదు.

కార్ల తయారీ పరిశ్రమలు మొదలు ప్లాస్టిక్ కంపెనీల వరకూ సమస్తం స్తంభించిపోయే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఎర్ర సముద్రంలో రెండువందలకు పైగా నౌకలు, ఇటు మధ్యధరా సముద్రంలో అదే సంఖ్యలో నావలు నిలిచిపోయాయి. ఛప్పన్నారు దేశాల ఉత్పాదక పరిశ్రమలను కకావికలం చేసింది ఎంవీ ఎవర్ గివెన్.

అసలు నౌక ఎలా ఇరుక్కుపోయింది? సూయజ్‌ కెనాల్‌కు ఇలాంటి సమస్య ఇదే మొదటిసారా? సూయజ్ ‌లో రోజుకు ఎన్ని షిప్‌ లు ప్రయాణిస్తాయి? ఆ కెనాల్‌ను ఎందుకు నిర్మించారు? ఎవరు నిర్మించారు?  ఇలాంటి ఆసక్తి రేకెత్తించే ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం.

ప్రస్తుతం సూయిజ్ లో తిరగబడిన నౌక కథ త్వరలోనే సుఖాంతం కావచ్చు. అయితే చరిత్ర పొడవునా ఈజిప్ట్ లోని సూయిజ్ జలమార్గానికి ఉన్న చరిత్ర సుదీర్ఘమైంది. అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసింది. ‘ఎవర్ గివెన్’ సంక్షోభం సందర్భంగా ‘సూయిజ్’ చారిత్రక ప్రాముఖ్యతను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సూయిజ్ కాలువకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. సూయిజ్ లో ఏం జరిగినా యూరప్, ఆసియా ఖండాల్లో దాని ప్రభావం ఉంటుంది. దౌత్యానికీ, యుద్ధాలకూ వారధి సూయిజ్. భౌగోళిక రాజకీయాలకూ, ఆయుధ ప్రదర్శనకు వేదిక సూయిజ్. బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ దేశాలను ముప్పుతిప్పలు పెట్టింది కూడా ఈ జలమార్గమే!

 ప్రపంచ వాణిజ్య సామ్రాజ్యాన్ని నిలువునా వణికిస్తున్న పేరు సూయిజ్ కెనాల్. ప్రపంచంలోనే అతి పెద్ద సరకు రవాణా నౌకల్లో ఒకటైన కంటెయినర్‌ నౌక ఎంవీ ఎవర్‌గివెన్‌.. ఈజిప్ట్ లోని సూయిజ్‌ కాలువలో 24వ తేదీన అనూహ్యంగా ఇరుక్కుపోయింది.

కృత్రిమ జలమార్గంలో నౌకా రవాణాకు అంతరాయం ఏర్పడింది. సూయజ్‌ కాలువపై రవాణా మొత్తం స్తంభించిపోయింది. ఇక ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే  వాణిజ్యం జరుగుతుంది. అంతేకాకుండా 8 శాతం సహజ వాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా జరగుతోంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెల్స్‌ ఆయిల్‌ సరఫరా అవుతోంది. నావ నిలిచిపోయిన కారణంగా ఈ మార్గం గుండా రాకపోకలు అంతరాయం ఏర్పడింది.  దీంతో ఆయా దేశాల్లో ఇంధన ధరలు పెరగవచ్చని వాణిజ్య నిపుణుల అంచనా.

సూయిజ్ కాలువ పొడవు 193 కి.మీ.  మధ్యదరాసముద్రం నుంచి ఎర్ర సముద్రాన్ని కలిపే జలమార్గమే సూయిజ్. యూరప్ -ఆసియాలను కలిపే దగ్గరి జలమార్గం. సూయిజ్ లేకపోతే ఆఫ్రికా మీదుగా ఆసియాకు రావాలంటే సుమారు 7వేల కిలోమీటర్లు చుట్టి రావాల్సిందే! అరేబియా మహాసముద్రం మీదుగా యూరప్ వెళ్లాలంటే దాదాపు 8వేల 9వందల కిలోమీటర్లు-పదిరోజుల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. సుదీర్ఘ జల రవాణా మార్గాన్ని నివారించింది సూయిజ్.

పనామాకు చెందిన ఎవర్ గివెన్ నౌక ఆకాశ హర్మ్యాన్ని తలపిస్తుంది. కాలువలో ఉత్తరం వైపు మళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. గంటకు 50 కి.మీ. వేగంతో వీస్తున్న ఈదురు గాలులు, ఇసుక తుపాను దాదాపు 2లక్షల 20వేల టన్నుల సరుకుతో వెళ్తున్న నౌకను ప్రమాదానికి గురిచేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

‘సూయిజ్’ 150 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఓడ ముందు భాగం తూర్పు గోడను, వెనుక భాగం పశ్చిమ గోడను తాకి నిలిచిపోయింది. దీంతో మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాల్లో అనేక నౌకలు ఆగిపోయాయి. ఎవర్ గివెన్ మట్టిలో కూరుకుపోయిన కారణంగా గంటకు సుమారు రూ.2,896 కోట్లు, రోజుకు  సుమారుగా రూ.73 వేల కోట్ల రూపాయల నష్టం వస్తున్నట్టు నిపుణుల అంచనా.  

సూయజ్‌ కాల్వలో నౌకా రవాణా స్తంభించడం గత రెండు దశాబ్దాల్లో ఇది మూడోసారి.  2004లో ట్రోపిక్‌ బ్రిలియన్స్‌ అనే నౌక చిక్కుకుపోతే మూడు రోజుల పాటు  కెనాల్ ను మూసివేయాల్సి వచ్చింది. ఇక 2017లో జపాన్‌కు చెందిన నౌక నిలిచిపోయిన కారణంగా కొన్ని గంటల పాటు మూతపడింది.

ఆఫ్రికా, ఆసియా ఖండాలను వేరు చేసేది, యూరప్-ఆసియాలను కలిపేది సూయజ్ కెనాల్. ఈజిప్ట్ మీదుగా మధ్యధరా సముద్రం-ఎర్రసముద్రాలను ఏకం చేసే జలమార్గం. ప్రపంచ చరిత్రలో ‘‘సూయిజ్ సంక్షోభం’’ అత్యంత ప్రధానమైంది. యాభై, అరవై దశకాల్లో అరబ్ దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చింది కూడా సూయిజ్ కాలువే! ‘‘ఇఖ్వాన్’’పేరుతో ముస్లీం బ్రదర్ హుడ్ ఏర్పాటుకు కారణమైందీ సూయిజ్ కెనాలే!! 50వ దశకంలో వలస పాలన అంతమయ్యాక అరబ్ రాజకీయాలను మలుపు తిప్పింది సూయిజ్ సంక్షోభమే!

గమాల్ అబ్దుల్ నాసర్ లాంటి నేత, సయ్యద్ ఖుత్బ్ లాంటి ఇస్లామిక్ సిద్ధాంతకర్త ప్రపంచ రాజకీయాల్లో చర్చకు రావడానికి కారణం ఈ కృత్రిమ జలమార్గం. పశ్చిమాసియా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన చరిత్ర కూడా సూయిజ్ కే దక్కుతుంది.

వలసపాలన కాలంలో వనరుల దోపిడీ కోసం మొదలైన వేట వాణిజ్య రవాణా మార్గాల అన్వేషణకు దారితీసింది. రేవులన్నీ రాజకీయ ఘర్షణలకూ కారణమయ్యాయి. వాణిజ్యంలో వాటా కోసం పడిన పోటాపోటీ కాస్త భయంకర యుద్ధాలకు దారితీసింది.

సూయిజ్ కాలువ కేవలం రవాణా మార్గం కాదు. రెండు సముద్రాలనూ, రెండు ఖండాలనూ కలిపే జలమార్గం మాత్రమే కాదు. రాజకీయాల్లో మతభావన మరింత ఉధృతంగా ప్రవేశించేందుకు కారణమైంది. ఈజిప్ట్ నుంచి పొంచి ఉన్న ప్రమాదమే ఇజ్రాయిల్ సైనిక పాటవం పెరిగేందుకు కారణమైంది. ఏకకాలంలో అనుకూల, ప్రతికూల ప్రభావాలను నెరపిన చరిత్ర సూయిజ్ కాలువది. మధ్యధరా తీరంలోని టెల్అవివ్ నగరంలోని మొస్సాద్ ఏజెంట్లు నిరంతరం తమ నిఘా నేత్రాన్ని సముద్రంపై సారించి ఉంటారు.

అగ్రరాజ్యాల అంతర్జాతీయ నిఘాసంస్థల ఏజెంట్లూ, సముద్ర దొంగలూ, నిషేధిత డ్రగ్ డీలర్లూ, అక్రమ ఆయుధ వ్యాపారులకు మధ్యధరా, ఎర్ర సముద్రాలు అడ్డా. సముద్ర అధ్యయన శాస్త్రాన్నీ, యుద్ధకళనూ, బాలిస్టిక్ రంగాన్నీ మరింత పరిపుష్ఠం చేశాయి మధ్యధరా, ఎర్ర సముద్రాలు. చమురు రాజకీయాలూ-వాణిజ్య సామ్రాజ్యం పరస్పరం తలపడేందుకు దారులు వేశాయి.

హిప్పాలస్ అనే గ్రీకు నావికుడు ఎర్ర సముద్రం మీదుగా భారతదేశంలోకి అడుగుపెట్టాడు. అగస్టస్ రోమ్ చక్రవర్తిగా ఉన్న కాలంలో భారత్, ఈజిప్ట్ ల మధ్య వాణిజ్యం సాగిందని చరిత్ర చెపుతుంది. ఈజిప్టు వద్ద ఈ కీలక జలమార్గాన్ని 1858-69 మధ్య ఫెర్డినాండ్ లెసెప్స్ అనే దౌత్యవేత్త సూయిజ్ జలమార్గాన్ని నిర్మించాడు.

సూయిజ్ నిర్మాణం జరుగుతున్న కాలంలో భారత దేశంలో మొదటి స్వాతంత్ర్య సంగ్రామం సాగుతోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలోకి ప్రవేశించి-అధికారాన్ని హస్తగతం చేసుకున్న శతాబ్దన్నర కాలానికి తిరుగుబాటుని రుచి చూసింది.

20 వేల మంది  బ్రిటీష్ సైన్యం ఖైబర్ పర్వత శ్రేణుల్లో హతమైంది. ఆసియాలో పట్టుకోల్పోతున్నమాని గ్రహించిన బ్రిటీష్ వలస పాలకులు ఫ్రేంచ్ భాగస్వామ్యంతో వ్యూహాత్మక రవాణా మార్గాల అన్వేషణలో పడింది. అలా నిర్మించిందే సూయిజ్ కృత్రిమ జలమార్గం.

యాభయ్యో దశకంలో పర్షియన్ గల్ఫ్, అట్లాంటిక్, మధ్యధరా సముద్రం, అరేబియా మహాసముద్రం మీదుగా చమురు రవాణా సాగాలంటే అతి సమీప మార్గం సూయిజ్ మాత్రమే. అందుకే బ్రిటీష్ వలస పాలకులు సూయిజ్ పై తమ పట్టును అంత సులభంగా వదులుకోలేదు.

ఆ రోజుల్లోనే బ్రిటన్ కు సుమారు 20 మిలియన్ టన్నుల చమురు సరఫరా సూయిజ్ మీదుగా సాగేది. ఆఫ్రికా మీదుగా చమురు రవాణా జరిగితే వ్యవధి పెరిగి బ్రిటీష్ దేశీయ చమురు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపేది. ఈ కారణంగానే సూయిజ్ నిర్మాణంపై ఫ్రెంచ్, బ్రిటీష్ పాలకులు దృష్టి సారించారు.

1956 నాటికి సూయజ్ పై బ్రిటీష్ పెత్తనాన్ని ఈజిప్ట్ కరాఖండిగా వ్యతిరేకించింది. 1956 జూన్ లో అధికార పగ్గాలు చేపట్టిన గమాల్ అబ్దుల్ నాసర్-ఈజిప్ట్ ను పాలించిన బ్రిటీష్ అనుకూల హషిమితో రాచరికానికి భిన్నంగా బ్రిటన్ వ్యతిరేక విధానాన్ని అనుసరించాడు.  

ఫ్రెంచ్, బ్రిటీష్, ఇజ్రాయిల్ లాంటి దేశాల బెదిరింపులకు లొంగేది లేదంటూ సూయిజ్ ను జాతీయకరణ చేసి సవాల్ విసిరాడు. అంతకు మునుపు దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న సంక్షోభానికి చరమగీతం పాడాడు నాసర్. ఈ పరిణామమే ప్రపంచ రాజకీయాల్లో పెనుసంచలనానికి తెరతీసింది. దీంతో ఇజ్రాయిల్, ఫ్రెంచ్, బ్రిటీష్ బలగాలు ఈజిప్ట్ పై దాడికి దిగాయి.

ఐక్యరాజ్య సమితి జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అంతర్జాతీయ రవాణాకు అనుకూలంగా విదేశీ నౌకలు ప్రయోణించేందుకు అనుమతించింది ఈజిప్ట్.

ఈజిప్ట్ పై 72ఏళ్లపాటు సాగిన బ్రిటీష్ సైనిక పట్టు సడలింది. బ్రిటన్-ఈజిప్ట్ ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఆంగ్లో-ఈజిప్షియన్ బంధంలో మాత్రమే పరస్పర వ్యతిరేకత, అవిశ్వాసం మాత్రం కొనసాగుతూ వచ్చాయి.

పంచభూతాలనూ వ్యాపారం చేసిన వలసవాదం ప్రపంచం నొసటన భౌతిక, మానసిక హింసను రచించింది. ధ్వంసరచనకు నాగరికత పేరు తగిలించింది. సూయిజ్ కాలువలో పారే జలాల్లో మామూలు మనుషుల రక్తం అటు మధ్యధరా సముద్రంలోనూ-ఎర్రసముద్రంలోనూ కలిసిపోయింది. బ్రిటీష్ దౌత్య చరిత్రును అధ్యయనం చేసిన చరిత్రకారుడు ఏ.పి.జే టేలర్ అన్నమాటలు గుర్తుంచుకోవాలి…

“The British are entitled always to mistrust other people but others are not entitled to mistrust the British. That is why England is known or was known abroad as ‘Perfide Albion’, because the British have two standards, one for themselves and one for other people.” బ్రిటీషర్లు ఇతరులను అపనమ్మకంతో చూడటాన్ని తమకున్న హక్కుగా భావిస్తారు. అదే సమయంలో ఇతరులు తమను సంశయించడాన్ని సహించరు. అందుకే భ్రిటన్ ను బయటి దేశాల వాళ్లు కపటధారిగా చూస్తారు. తమకో ప్రమాణాన్ని ఇతరులకో ప్రమాణాన్ని పాటించడం బ్రిటీషర్లకు అలవాటు..

Related Articles

Leave a Reply

Your email address will not be published.

16 − twelve =

Back to top button