కొంకణ్ తీరం గురించి స్కంధ పురాణంలో ఆసక్తికరమైన ప్రస్తావన ఉంది. పరశురాముడు తన గండ్రగొడ్డలిని సాగరంలోకి విసిరి, అది ఎక్కడ ఉందో గుర్తించమని సముద్రుడిని ఆదేశించాడట. పరశురాముడి గండ్రగొడ్డలి దొరికిన ప్రాంతం పేరు కొంకణ్ గా మారింది. అయితే కొంకణ్ కోస్ట్ లో ఉండే గోవా నగరం పేరు ఎటిమాలజీ మాత్రం ఎవరికీ తెలియకుండా పోయింది.
గోవా అనగానే అందమైన బీచ్ లు ..ఆనందానికి అవధుల్లేవనిపించే హుషారైన క్షణాలు మన కళ్లముందు కదలాడతాయి. కానీ ఆ ఆహ్లాదం వెనుక విషాద భరిత చరిత్ర ఉంది. హాలిడే డెస్టినేషన్ వెనుక బానిసలుగా మన భారతీయుల్ని పీడించిన విదేశీ దురహంకారం దాగి ఉంది. భారతీయులు ఏనాడో విస్మరించిన రక్త చరిత్రను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం.
‘గోవా విమోచన’ జరిగి ఆరు దశాబ్దాల కాలం గడిచింది. ‘ఆపరేషన్ విజయ్’ని చేపట్టి 1961, డిసెంబర్ 19న గోవాను విముక్తి చేసింది కేంద్రం. 40గంటల ఆపరేషన్ తర్వాత పోర్చుగీసు వలసవాదులు ఓటమిని అంగీకరించి, దేశం విడిచి వెళ్లిపోయారు.
స్వాతంత్ర్యం వచ్చాక గోవా సుమారు 14 ఏళ్లపాటు పోర్చుగీసు వలసపాలనలోనే ఉండిపోయింది. దేశంలోని సంస్థానాలన్నీ విలీనమైన 11 ఏళ్లకు ‘గోవా విమోచన ప్రభుత్వానికి గుర్తుకు వచ్చింది. ‘ఆపరేషన్ పోలో’ ద్వారా నిజాం మెడలు వంచి ‘హైదరాబాద్ రాజ్యాన్ని విముక్తి చేసిన ప్రభుత్వం, అలాంటి వైఖరిని పశ్చిమ తీరంలోని పోర్చుగీసు వలసవాదుల విషయంలో ఎందుకు అనుసరించలేదు?
పటేల్ హఠాన్మరణం కారణంగానే ‘గోవా విమోచన’ ఆలస్యమైందా? నిర్ణయాత్మక వైఖరి, వ్యూహాత్మక దృష్టి లేకపోవడమే ఇందుకు కారణమా? నెహ్రూ కారణంగానే అలసత్వం జరిగిందా? నాటి రక్షణ మంత్రి క్రిష్ణమీనన్-జే.బీ క్రిపలానీల వైరం గోవా విమోచనకు కారణమా లేదా ఉత్తర బాంబే ఎన్నికా? 1961 డిసెంబర్ 1న ‘ఆపరేషణ్ చట్నీ’ తో మొదలై డిసెంబర్ 19న ‘ఆపరేషన్ విజయ్’ లో సైన్యం అనుసరించిన వ్యూహం-ఎత్తుగడలు ఏంటి? ‘ఆపరేషన్ విజయ్’ నలభై గంటల పాటు ఎలా సాగింది?
చారిత్రక అలసత్వానికి కారణాలనూ, పాలకుల మందగమనాన్నీ, సైన్యం సాహసంతో సాగిన ఉద్వేగభరిత చరిత్రను వివరించే ప్రయత్నం చేస్తాను.
పశ్చిమతీరంలోని గోవా విదేశీ వలసకు గురైన తొలి ప్రాంతం. భారత యూనియన్ లో ఆలస్యంగా విలీనమైన రాష్ట్రం కూడా. నాలుగున్నర శతాబ్దాలు పోర్చుగీసు వలస పాలనలో అంతకు ముందు ఢిల్లీ సుల్తానేట్ కింద మగ్గిన ప్రాంతం.
దేశంలో సంస్థానాల విలీనం 1947 నుంచి 1951 వరకూ నాలుగేళ్లపాటు ఉద్యమస్థాయిలో సాగింది. 1950 సర్దార్ పటేల్ మరణం తర్వాత తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రాంతాలు మాత్రం వలసప్రాంతాలుగా కొనసాగాయి.
ఏ దేశానికైనా సముద్ర తీర ప్రాంతాలు మరీ ముఖ్యంగా రేవుపట్టణాలు వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా అతికీలకం. ప్రాదేశిక జలాల్లో పహారా అత్యవసరం. అంతటి ప్రాముఖ్యం ఉన్న పశ్చిమ తీరాన్ని పోర్చుగీసు పాలకులకూ, తూర్పుతీరంలోని పాండిచ్చేరిని ఫ్రెంచ్ వలసపాలకులకు వదిలేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చారిత్రక కారణాలు, విధాన నిర్ణయాల్లో జాప్యాన్ని అన్ని సందర్భాలకు ఆపాదించలేం!
రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్టులు, భారతీయ జన్ సంఘ్ లాంటి సంస్థలు 1955 నుంచే ‘యూనైటెట్ ఫ్రంట్ ఆఫ్ గోవాన్స్’ ను బాంబే కేంద్రంగా స్థాపించి ఉద్యమిస్తున్నారు. ఆగస్ట్ 15, 1955 నాడు పోర్చుగీసు పోలీసులు 22మంది ఉద్యమకారులను కాల్చి చంపారు. 225 మంది గాయపడ్డారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. 1962 సాధారణ ఎన్నికలు దగ్గరపడగానే ‘గోవా విమోచన’ గుర్తుకు వచ్చింది.
గోవా విమోచనకు తూర్పు బాంబే లోక్ సభ స్థానానికి జరిగే ఎన్నికలకూ ఆసక్తికరమైన చరిత్ర ఉంది. నాడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న రక్షణ మంత్రి క్రిష్ణ మీనన్ కు, కాంగ్రెస్ నేత జే.బి.క్రిపలానీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతోంది. ఇద్దరూ తూర్పు బాంబే ఎన్నికలో గెలవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రక్షణ మంత్రిగా ఉన్న మీనన్ కు ‘గోవా విమోచన’ అస్త్రంగా పనికి వచ్చింది. అంతిమంగా ఉత్తర బాంబే లోక్ సభ స్థానం నుంచి క్రిష్ణమీనన్ గెలిచాడు.
ఈ పరిణామాలు నిజమేనా అనే సందేహించవచ్చు. ఎందుకు ఈ వాదన నిజమనిపిస్తుందంటే…1951లో విలీన ప్రక్రియ ముగిసింది. 1955 నుంచి గోవా విమోచన కోరుతూ ఉద్యమాలు సాగుతున్నాయి. పోర్చుగీసు పాలకులు ఉద్యమకారులపై దమన నీతిని అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ ఒత్తిడిని సైతం పోర్చుగీసు పాలకులు ఖాతరు చేయలేదు. దీనిపై సైతం భారత ప్రభుత్వం పట్టింపులేనట్టుగా వ్యవహరించింది. అంజ్ దేవా ద్వీపం వద్ద 1961లో జాలర్ల పడవలపై కాల్పులు జరిగాయి. వాణిజ్య ఓడ సబర్మతిపై దాడి జరిగింది.
ఇంత జరుగుతున్నా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న నెహ్రూ ప్రభుత్వం గోవా విమోచన గురించి ఎందుకు ఆలోచించలేదన్న సందేహమే సదరు ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. అటల్ బిహారీ వాజ్ పేయి లోక్ సభలో ఓ సందర్భంలో ఈ చారిత్రక అలసత్వం గురించి ప్రశ్నించారు కూడా.
ఇది స్థూలంగా ‘గోవా విమోచన’ జాప్యం వెనుక ఉన్న చరిత్ర. పతనం అంచులకు నెట్టబడినపుడు పాత తప్పిదాలను వైరి పక్షాలు పదే పదే గుర్తు చేయడం రాజకీయాల్లో సర్వసాధారణం. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇదే పరాభవాన్ని ఎదుర్కొంటోంది.
ఇక నలభై గంటలపాటూ ఉద్వేగభరితంగా..సాగిన ఆపరేషన్ విజయ్ గురించీ, సన్నాహకదశలో సాగిన ‘ఆపరేషన్ చట్నీ’ గురించి తెలుసుకుందాం. ఈ ఘటనల క్రమాన్ని తెలుసుకునేందుకు P. N. Khera రాసిన ‘‘OPERATION VIJAY’’ The Liberation of Goa and Other Portuguese Colonies in India పుస్తకం ఆధారం చేసుకుంటున్నాను.
నవంబర్ ఆఖరు వారంలో రక్షణ శాఖ, హోంశాఖ, విదేశాంగ శాఖలు సంయుక్తంగా ‘గోవా విమోచన’కు సైనిక చర్య చేయాలని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను త్రివిధ దళాధిపతులతో చర్చించాయి. డిసెంబర్ 1వ తేదీన సన్నాహకదశగా ‘ఆపరేషన్ చట్నీ’ని ఆరంభించాయి. ఎయిర్ వైస్ మార్షల్ ఎర్లిక్ పింటోను వాయుసేన థియేటర్ కమాండ్ కు బాధ్యుడిగా నియమించారు.
వాయుసేనకు పింటో సారథ్యం వహించడంతో పాటు టోటల్ కమాండర్ బాధ్యతలు అప్పజెప్పారు. మొత్తం ఆపరేషన్లను పింటో పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఆర్మీకి మేజర్ జనరల్ కే.పి. కండేత్, గోవా, డయ్యూ, డామన్ లక్ష్యంగా ఎంచుకున్నారు. అధికారికంగా 11 తేదీనే గోవా స్వాధీన ప్రక్రియ మొదలైంది.
రెండో దశలో టోపోగ్రఫికల్ అడ్వంటజెస్ గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడే కొంత చిక్కువచ్చి పడింది. గోవా, డయ్యూ, డామన్ ప్రాంతాల్లో అనేక చిన్నాచితక నదులు ప్రవహిస్తాయి. కొన్ని నావిగేషన్ కు అనుకూలంగా ఉంటే ప్రధాన నదులైన తెర్కోల్, మాండవి, జువారీ, రాచోల్ నదులు మీదుగా ఆపరేషన్ చేయడంలో ఇబ్బంది వచ్చింది. రెండు లోయలుగా విడిపోయిన గోవాలో నదుల నావిగేషన్ గురించి కొత్త వ్యూహాన్ని తయారు చేయాల్సి వచ్చింది.
పదాతిదళం, వాయుసేన, నావికాదళం మూడింటిని ఈ ఆపరేషన్ లో వినియోగించినా తొలిదశలో ప్రధాన పాత్ర పోషించేది మాత్రం వాయుసేన, నావికాదళం. త్రివిధ దళాలకు సంబంధించి మొత్తం 30 వేల బలగాలను మోహరించాయి. పోర్చుగీసు బలం కేవలం 3వేలు మాత్రమే. మొత్తంగా యుద్ధమైదానాన్ని అంచనా వేసిన తర్వాత డిసెంబర్ 17వ తేదీ గ్రామీణ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాయి త్రివిధ దళాలు. మౌలింగెమ్ అనే గ్రామం వద్ద పోర్చుగీసు దళాలు ప్రతిదాడి నుంచి వెనక్కి తగ్గాయి. పదాతి దళాల సంఖ్య తక్కువ కావడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు పోర్చుగీసు అధ్యక్షుడు “scorched earth” అవలంబించాలని ఆదేశించాడు. “scorched earth” పాలసీ అంటే ‘శతృవు స్వాధీనం చేసుకునేలోపే అన్ని వనరులను, సదుపాయాలను ధ్వంసం చేయడం’ అన్నమాట. అయితే బలగాలు బలహీన స్థితిలో ఉన్నకారణంగా గవర్నర్ జనరల్ సిల్వా భారత బలగాలకు లొంగిపోవడమే ఉత్తమమని భావించాడు.
ఈలోపు బేత్వా, బియాస్ అనే వాయుసేన నావలు అంజ్ దీప్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని పెట్రోలింగ్ చేయనారంభించాయి. మైసూర్, త్రిశూల్ నావలు పూర్తి స్థాయి ఆపరేషన్ మొదలుపెట్టాయి. 75మంది సెయిలర్ల ప్లటూన్ ఈ నావల్లో ఉంది. ఈ ఆపరేషన్ కు అరున్ ఆడిట్టో, గన్నర్ కెల్మన్ లు సారథ్యం వహించారు.
డిసెంబర్ 18న ఐఎన్ఎస్ త్రిశూల్ రంగంలోకి దిగింది. గోవా బీచ్ నుంచి పోర్చుగీస్ గ్యారిసన్ వరకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మొత్తం దూరాన్ని త్రిశూల్ ప్లటూన్ రెండు ప్రవాహాలుగా కవర్ చేయాలని నిర్ణయించారు. మొదటి ప్రవాహంలోనే పోర్చుగీసు దళాలు లొంగుబాటును ప్రకటిస్తూ తెల్లజెండాను తమ నావలపై ఎగరేశాయి.
మొదటి ప్రవాహం అనుకున్న విధంగా విజయం సాధిస్తే, రెండో ప్రవాహం ముందు సాగగానే పోర్చుగీసు దళాలు మెషిన్ గన్లతో కాల్పులు మొదలుపెట్టాయి. దీంతో భారత నావలు బుల్లెట్ రంద్రాల కారణంగా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో నావికాదళం భీకర కాల్పులకు దిగింది. కొన్ని గంటలపాటు కాల్పులు జరిగాయి. భారత బలగాల కాల్పుల ధాటికి పోర్చుగీసు సైన్యాలు తోకముడిచాయి.
డిసెంబర్ 19న పోర్చుగీసు పాలకులు అధికారికంగా లొంగుబాటు ప్రకటించారు. భారత ప్రభుత్వం కే.పి. కండేత్ ను మిలట్రీ జనరల్ గా నియమించింది.
ఇదీ గోవా విలీనం వెనుక ఉన్న చరిత్ర. విదేశీ దురాక్రమణ దారుల మూలంగా అఖండ భారతావని ముక్కలు ముక్కలుగా విడిపోయి చివరికి 1947 లో స్వతంత్ర భారతంగా ఏర్పడినప్పటికీ కశ్మీర్ , జునాఘడ్ నిజాం సంస్థానాల రూపంలో రక్తపుటేరులు పారాయి. ఆ తర్వాత కూడా అటు సిక్కిం ఇటు గోవాల్లో ప్రజా ఉద్యమాలు , అనంతరం రక్షన దళాల ప్రత్యేక ఆపరేషన్స్ మూలంగానే తిరిగి భారత భూభాగంలో విలీనమయ్యాయి. నెహ్రూ నిర్లక్ష్య విధానాలు , ముందుచూపు లేని వైఖరుల మూలంగా నాటి గాయాలను మాన్పేందుకు నేటికీ ప్రయత్నించాల్సి వస్తోంది. ఏది ఏమైనా పర్ఫెక్ట్ హోలిడే డెస్టినేషన్ గా గుర్తింపు పొందిన గోవా వెనుక విషాద చరిత్రను స్మరించుకోవడం భారతీయులుగా మనందరి బాధ్యత కూడా.