పురాతన ఆలయాలకు పూర్వ వైభవం

0
1105

సనాతన సంస్కృతి, సాంప్రదాయాల సంరక్షణ ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం. చరిత్ర ఏదైనా మనకు ఎంతో విలువైనది. అలాంటి మన పురాతన ఆలయాలు ఎన్నో అద్భుతాలు, అవిష్కరణలకు సాక్ష్యాలుగా నిలిచాయి. ప్రతి ఆలయ నిర్మాణం అంతుచిక్కని విధంగానే ఉంటుంది. అనాటి కాలంలో జరిగిన నిర్మాణాలపై ఎన్ని పరిశోధనలు చేసినా కొన్ని కట్టడాలు ఎలా సాధ్యమయ్యాయి అనేది అర్ధం కావడం లేదు. అయితే భారత దేశంపై పూర్వం ఎంతో మంది ఇతర రాజ్యాల వాళ్లు దండయాత్రలు చేశారు. ఇందులో కొంతమంది అఖండ భారతవనిని పాలించిన వారు కూడా ఉన్నారు. ఎవరూ పాలించినా మొదట హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసే వారు. పురాతనమైన, బలమైన కట్టడాలపై దాడులకు దిగే వారు. అత్యంత విలువైన సంపదనను దోచుకెళ్లారు. అందులో పోర్చుగీసుల ఏలికలో హిందూ పూరాతన ఆలయాలు భారీగా ధ్వంసమయ్యాయి. అయితే కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం నుంచీ దేశంలోని పురాతన ఆలయాల గురించి చర్చ మొదలైంది. కాశీ కారిడార్ తరహాలో మధురలోనూ ఏదన్నా ఏర్పాటు చేసి కృష్ణ జన్మస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని అక్కడి బీజేపీ ఎంపీ హేమామాలిని అన్నారు. అయితే అయోధ్య రామాలయం పునర్:నిర్మాణంతో పురాతన ఆలయాలకు కొత్త కళ సంతరించుకుంటోంది.

తాజాగా హిందూ సంస్కృతీ వైభవాన్ని చాటే ఆలయాల పునరుద్ధరణ జరగాలని అభిప్రాయపడ్డారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. హిందూ ఆలయాలు, హైందవ సంస్కృతి కాపాడుకోవాలి. ముఖ్యంగా పురాతన ఆలయాల్ని పునర్నిర్మించే శక్తి మాకు ప్రసాదించాలని వేడుకుంటున్నానని ఆయన అన్నారు. పోర్చుగీసుల ఏలికలో గోవాలోని వందలాది ఆలయాల విధ్వంసం జరిగిందని ఆయన గుర్తు చేశారు. 60వ గోవా విమోనచనోత్సవం సందర్భంగా అన్ని ఆలయాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. పోండాలోని మంగూషిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నిత్యం వేలాదిమంది పర్యాటకులు సందర్శించే మంగూషి ఆలయం రాష్ట్రంలో ప్రముఖ యాత్రాస్థలం అని చెప్పవచ్చు. పోర్చుగీసుల పాలనలో ధ్వంసమైన ఆలయాల్లో కొన్నింటిని గోవా విమోచనం తరువాత స్థానికులే పునర్నిర్మించుకున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. వెర్నాలోని మల్సా ఆలయం సహా కొన్ని ఆలయాలను తీర్చి దిద్దడంలో ప్రభుత్వం కూడా సాయపడిందన్నారు. అయితే గోవా ప్రభుత్వం ఒక యాప్ తయారు చేసిందని సీఎం వెల్లడించారు. ఆ యాప్ ద్వారా టూరిస్టులు తమకు ఇష్టమైన ప్రదేశాల్లో పర్యటించవచ్చని చెప్పారు. ఆలయాలకు సంబంధించిన వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఉదాహారణకు మంగూషి టెంపుల్ సెర్చ్ చేయగానే ఈ పురాతన ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయన్నారు. మంగూషి ఆలయ పునర్:నిర్మాణంతో గోవా టూరిజం కూడా బలోపేతం కానుందని చెప్పారు. మంగూషి టెంపుల్ వద్ద ఫస్ట్ ఫేస్ లో భాగంగా టాయిలెట్ బ్లాక్, టూరిస్ట్ ఇన్ఫో సెంటర్, పార్కింగ్, ఇల్యుమినేషన్, షాప్స్ నిర్మాణం పూర్తి చేశామని సీఎం వెల్లడించారు. రెండో ఫేస్ లో 28 కోట్ల వ్యయంతో ఫుడ్ ఫ్లాజా, కమ్యూనిటీ హాల్, కాటేజీల నిర్మాణం చేపడుతామన్నారు.

అటు యూపీలోనూ యోగి ఆధిత్యనాథ్ సర్కార్ పురాతన దేవాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మోదీ డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తోన్న శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్‌ లో భాగంగా దాదాపు 50 వేల చదరపు మీటర్ల ఒక పెద్ద ప్రాంగణంగా నిర్మించారు. దీని ప్రధాన ప్రవేశ మార్గం గంగానది వైపు లలితా ఘాట్ నుంచి ఉంటుంది. రూ.340 కోట్లు వ్యయంతో పురాతన ఆలయాలను పునరుద్దరించి, కొత్తగా 24 నిర్మాణాలను చేపట్టి అత్యాధునికంగా మార్చారు. ఒడిశా ప్రభుత్వం కూడా ఇటీవల ఆలయాల పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. పురాతన కట్టడాలకు మరమ్మత్తులు చేస్తూ.. ఆధునిక కాలానికి అనుగుణంగా మారుస్తున్నారు. 2019-20 సంవత్సరంలో ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. భారత సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా పునర్నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆలయాల పునరుద్దరణకు దాదాపు 2వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇప్పటివరకు 700 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. సామలేశ్వరి ఆలయానికి రూ.15 కోట్లు, కోణార్క్ హెరిటేజ్ కారిడార్ కి రూ.375 కోట్లు, అఖండలమణి ఆలయానికి రూ.6 కోట్లు, తారా తారిణి ఆలయానికి రూ.15 కోట్లు ఖర్చు చేశారు.

భారతదేశంలోనే కాదు దాయాది దేశాల్లోని పురాతన హిందూ దేవాలయాలు ఇప్పుడిప్పుడే తెరుచుకోవడంతో పాటు పునర్:నిర్మాణానికి నోచుకుంటున్నాయి. బంగ్లాదేశ్‌ ఉత్తర నాటోర్‌ జిల్లాలో 300 సంవత్సరాల పురాతనమైన కాళీ ఆలయ పునర్నిర్మాణ పనులను భారత్‌ ఈ ఏడాది జులైలో ప్రారంభించింది. ఇందుకు బంగ్లా కరెన్సీ లో రూ.97లక్షలు భారత ప్రభుత్వం కేటాయించగా, మొత్తం రూ.1.33కోట్లతో పనులు పూర్తి చేయనున్నారు. భారత ప్రభుత్వం హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్ కింద ఆలయ నిర్మాణం చేపడుతుంది. కాగా, కాళీ మాతర్‌ ఆలయం బంగ్లాలోని నాటోర్‌లోని పురాతన ఆలయాల్లో ఒకటి. దీన్ని 18శ శతాబ్దం ప్రారంభంలో నాటోర్‌ రాణి భహాని దివాన్‌, దిఘాపియా రాయల్‌ ఫ్యామిలీ వ్యవస్థాపకుడు దయారామ్‌ రాయ్‌ నిర్మించారు. ఈ ఆలయంలో శివాలయం కూడా ఉంది.ఆలయంలో దుర్గా, కాళీ ఏటా ఉత్సవాల్లో పూజలందుకుంటున్నారు. రామకృష్ణ ఆలయ నిర్మాణానికి, శ్రీ ఆనందమోయి కాళీ మాత మందిర పునర్ధురణకు సైతం భారత్‌ నిధులు సమకూరుస్తోంది.

అయితే గత నెల పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో ఓ హిందూ మందిరం తెరుచుకుందన్న వార్త భారత మీడియాలో బాగా ప్రచారమైంది. అది శివాలా తేజా సింగ్ మందిరమని, 72 ఏళ్ల తర్వాత మళ్లీ తాజాగా అందులో పూజలు, అర్చనలు మొదలయ్యాయని చాలా కథనాలు వచ్చాయి. దివంగత చరిత్రకారుడు రషీద్ నియాజ్ రచించిన ‘హిస్టరీ ఆఫ్ సియాల్‌కోట్’ పుస్తకం ప్రకారం ఆ మందిరం దాదాపు 1000 ఏళ్ల పురాతనమైంది. అయితే, గత మే లోనే ఆ గుడి తెరుచుకుందని పాకిస్తాన్ పాత్రికేయులు చెబుతున్నారు. పాకిస్తాన్‌లోని అల్పాసంఖ్యాక వర్గాల్లో హిందువులే అతిపెద్ద వర్గం. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 75 లక్షల మంది హిందువులు పాక్‌లో ఉన్నారు. భారత్-పాక్ విభజన తర్వాత హిందువులు చాలా మంది భారత్‌కు వెళ్లడంతో ఆలయాల బాగోగులు చూసేవారు కరువయ్యారని, చాలా గుళ్లు కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా మారిపోయాయని అక్కడి వారు చెబుతుంటారు. మొత్తం మీద ఎంతో విలువైన చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన ఆలయాల పునర్:నిర్మాణం ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందనే చెప్పవచ్చు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eight + fifteen =