మరో హిందూ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, దోచుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా నోయిడాలోని బెహ్లోల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మార్చి 20-21 మధ్య రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జర్నలిస్ట్ సచిన్ గుప్తా పోస్ట్ చేసిన వీడియోలో, ఆలయ ప్రాంగణంలో చెల్లాచెదురుగా ఉన్న హిందూ దేవుళ్ల విగ్రహాల ముక్కలు ముక్కలుగా కనిపించాయి. ఆయన ట్వీట్ చేస్తూ, “సంఘ వ్యతిరేకులు ఆలయంలోకి చొరబడి విగ్రహాలను ధ్వంసం చేశారు. శివలింగం దగ్గర రక్తం కూడా కనిపించింది. ఘటనా స్థలంలో పోలీసు బలగాలను మోహరించారు.” అని చెప్పుకొచ్చారు.
ఆలయ పవిత్రతకు భంగం కలిగించిన గుర్తుతెలియని దుండగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తెలెత్తింది. ABP జర్నలిస్ట్ అంకిత్ కౌశిక్ పోస్ట్ చేసిన వీడియోలో, శివలింగం భాగాలు ధ్వంసమైనట్లు చూడవచ్చు. గుడి నేలపై కూడా రక్తం చిమ్మినట్లు కనిపించింది.
పోలీస్ కమిషనరేట్ గౌతమ్ బుద్ధ్ నగర్ విభాగం స్పందించింది. “పోలీసు ఫోర్స్ స్పాట్‌లో ఉంది. పరిస్థితి అదుపులో ఉంది. ఈ విషయమై విచారణ ప్రారంభించి తగిన చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.
“మేము సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత, డాగ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ బృందాన్ని ఆ స్థలానికి పంపాము. ఒక విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించాం. రక్త నమూనాలను కూడా సేకరించాం. విగ్రహం ఉంచిన గాజు అద్దాన్ని పగులగొట్టే క్రమంలో నిందితుడు గాయపడ్డాడని మేము భావిస్తున్నాము” అని డిసిపి (సెంట్రల్ నోయిడా) హరీష్ చందర్ వ్యాఖ్యానించారు.
జంతు కళేబరంతో ఆలయాన్ని అపవిత్రం చేశారన్న పుకార్లను కూడా ఆయన తోసిపుచ్చారు. ఆలయ పూజారి రాత్రి ఇంటికి వెళ్లాడని, తెల్లవారుజామున విధ్వంసం జరిగినట్లు గుర్తించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. “ఘటన సమయంలో ఆలయ పూజారిని బందీగా చేసుకున్నారనే మరొక పుకారును నమ్మకండి” అని ఆయన చెప్పుకొచ్చారు. స్థానికులు ఆలయానికి సమీపంలో ఉన్న అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు.